‘మహా’ వ్యాక్సినేషన్

by  |
‘మహా’ వ్యాక్సినేషన్
X

ముంబై: టీకా పంపిణీలో మహారాష్ట్ర రికార్డు సృష్టించింది. దేశంలో వ్యాక్సినేషన్ మొదలైనప్పటి(జనవరి 16) నుంచి ఇప్పటివరకు మహారాష్ట్రలో కోటి మందికి పైగా రెండు డోసుల టీకా తీసుకున్నారు. దీంతో దేశంలోనే కోటి మందికిపైగా పూర్తి వ్యాక్సిన్(రెండు డోసులు) అందించిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర ఘనత సాధించింది. రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ(హెల్త్) డాక్టర్ ప్రదీప్ వ్యాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 25నాటికి 45ఏళ్లు పైబడిన వారిలో 1.7కోట్ల తొలి డోసు తీసుకోగా, 74.28లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారు.

18-44 ఏళ్లవారిలో 1.04కోట్ల మంది తొలి డోసు తీసుకోగా, 4.5లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారు. ఇక ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 21.13లక్షల మంది సింగిల్ డోసు, 11లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారు. హెల్త్ కేర్ వర్కర్లలో 12.85లక్షల మందికి తొలి డోసు, 8.9లక్షల మందికి రెండు డోసుల టీకాను రాష్ట్రం పంపిణీ చేసింది. ఇక డోసుల విషయానికొస్తే, ఇప్పటివరకు 4.44 కోట్ల డోసుల పంపిణీతో ఉత్తరప్రదేశ్ తొలిస్థానంలో ఉండగా, 4.13కోట్ల డోసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. యూపీలో 72లక్షల మందికి పైగా రెండు డోసుల టీకా తీసుకున్నారు.

దేశంలో 43కోట్ల డోసులు

దేశవ్యాప్తంగా సోమవారం నాటికి పంపిణీ చేసిన డోసుల సంఖ్య 43.51కోట్లకు చేరింది. ఇందులో తొలి డోసు తీసుకున్నవారి సంఖ్య 34.18కోట్లుగా ఉండగా, 9.33 కోట్ల మందికిపైగా రెండు డోసులూ తీసుకున్నారు.


Next Story

Most Viewed