ఆయిల్ పామ్‎తో ఎంతో ఆదాయం..!

by  |
ఆయిల్ పామ్‎తో ఎంతో ఆదాయం..!
X

దిశ, వెబ్ డెస్క్: రైతులు ఆరుగాలం శ్రమించి ఆదాయం కోసం ఆరు నెలలైనా వేచి చూడాలి. కొన్నిసార్లు పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి రైతాంగం నష్టపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెలా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయితే.. ఆ రైతుకు కలిగే సంతోషమే వేరు. ఇప్పుడు ఆయిల్‌ పామ్‌ సాగుతో తక్కువ పెట్టుబడితో ఆశించిన ఆదాయం చేతికి వస్తోంది.

వేరుశనగ, పొద్దు తిరుగుడు, తదితర నూనె గింజల సాగు క్రమంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పామాయిల్‌ వాడకం నానాటికీ పెరుగుతోంది. ఆయిల్ పామ్‌ సాగుకు అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈ క్రమంలో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ఆయిల్‌ పామ్‌ సాగు వైపు మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. మొక్కలు నాటడం నుంచి మార్కెటింగ్‌ వరకు అన్ని రకాలుగా రైతులకు అధికారులు సలహాలు అందిస్తారు. ఆయా జిల్లాల్లో ఉండే కంపెనీలే రైతులకు సబ్సిడీ ద్వారా మొక్కలను అందిస్తాయి.

ఎర్ర నేలలు అనుకూలం

ఆయిల్‌ పామ్‌ సాగుకు సౌడు నేలలు మినహా అన్ని రకాల భూములూ అనుకూలంగా ఉంటాయి. వీటితోపాటు ఇసుకతో కూడిన ఎర్ర నేలలు, ఒండ్రుతో కూడిన ఎర్ర నేలల్లోనూ సాగు చేయవచ్చు. వీటి సాగుకు నీళ్లు సమృద్ధిగా ఉండాలి. ఆరుతడి పంట అయినప్పటికీ రోజూ ఒక్కో చెట్టుకు కనీసంగా 200 లీటర్ల నీళ్లు పట్టాలి. వేసవిలో మరో 50 లీటర్లు అదనంగా అవసరం అవుతాయి. అయితే వరి పంటతో పోలిస్తే ఆయిల్‌ పామ్‌ సాగుకు తక్కువ నీరే అవసరమవుతుంది. ఒక ఎకరం వరి సాగుకు ఖర్చయ్యే నీటితో నాలుగెకరాల్లో ఆయిల్‌ పామ్‌ను సాగు చేయవచ్చు.

మొక్కలు నాటే సమయంలో మొక్క వయసు 13 నెలలు ఉండాలి. అయితే ఎకరానికి 57 మొక్కలను మాత్రమే నాటాలి. ఒక్కో మొక్క మధ్య దూరం 9×9 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. లేకుంటే చెట్లు పెరిగేందుకు వీలులేక చనిపోయే ప్రమాదం ఉంది. అదే విధంగా చెట్లు గుబురుగా పెరిగిన తర్వాత సరైన గాలి, వెలుతురు లేకపోతే దిగుబడి తక్కువగా వస్తుంది.

వ్యవసాయంలో చీడ పీడల బాధ ఎక్కువగా ఉంటుంది. కానీ, ఆయిల్‌ పామ్‌ సాగులో ఆ బాధ ఉండదు. ఈ చెట్లకు ఎలాంటి చీడలు పట్టవు. ఈ చెట్లు తుపానులు, భారీ వర్షాలు, ఈదురు గాలులను తట్టుకొని నిలబడతాయి. ఆయిల్‌ పామ్‌ పంటకు కోతుల బెడద ఉండదు. ఇతర పశువుల నుంచి కూడా ఎలాంటి హానీ జరగదు.

పెట్టుబడి తక్కువ..

అయిల్‌ పామ్‌ సాగుకు పెట్టుబడి తక్కువగా ఉంటుంది. మొదటి మూడేళ్లు సుమారు రూ. లక్ష పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. పంట దిగుబడి వచ్చే నాలుగో ఏడాది నుంచి పెట్టుబడి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఏటా సుమారు రూ.20వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఆదాయం విషయానికొస్తే ప్రస్తుతం ఒక టన్నుకు రూ.9500 ధర పలుకుతోంది. ఒక ఎకరానికి కనీసం 10 టన్నుల దిగుబడి వచ్చినా, రైతుకు రూ.95 వేల ఆదాయం వస్తుంది. ఇందులో పెట్టుబడి రూ. 20వేలు తీసేస్తే, కనీసంగా రూ.75వేలు మిగులుతాయి.

ఆయిల్‌ పామ్‌ సాగులో మొక్క నాటిన నుంచి మూడేళ్ల వరకు ఎలాంటి ఆదాయం ఉండదు. నాలుగేళ్ల నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మొదటిసారి ఎకరానికి సుమారు ఆరు టన్నుల దిగుబడి వస్తుంది. ఆ తర్వాత ఏటేటా ఉత్పత్తి పెరుగుతూ గరిష్ఠంగా ఏడాదికి 16 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. అయితే రైతుల సాగు విధానంపైనే ఉత్పత్తి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఆర్గానిక్‌ ఎరువుల వాడకంతో మంచి దిగుబడి వస్తుంది. సగటున ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇక ఒక చెట్టు జీవిత కాలం 25 నుంచి 30 ఏళ్లు ఉంటుంది. దాదాపు 15 ఏళ్ల దాకా మంచి దిగుబడి ఇస్తుంది. ఆ తర్వాత క్రమంగా దిగుబడి తగ్గుతోంది.

ప్రభుత్వాల సహకారం

ఆయిల్‌ పామ్‌ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మొక్కల కొనుగోలు నుంచి ఎరువుల దాకా ప్రతి దశలో సబ్సిడీలు అందిస్తున్నాయి. మొదటి నాలుగేళ్లలో కేంద్రం నుంచి రూ. 2.70 లక్షల దాకా సబ్సిడీ అందనుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలో డ్రిప్‌ సిస్టం అందిస్తున్నది. అదేవిధంగా రైతుబంధుతో ప్రతి ఎకరానికీ రూ. 10వేలు ఇస్తుంది.

మార్కెటింగ్‌ సమస్యకు చెక్‌

ఆయిల్‌ పామ్‌ రైతులను వేధించే మార్కెటింగ్‌ సమస్యకు ప్రభుత్వం చెక్‌పెట్టింది. ప్రతి జిల్లాకు ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసేలా ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహిస్తుంది. రైతులకు మొక్కలు ఇవ్వడం నుంచి చెట్లు నాటడం, ఎరువుల వాడకం, క్రాప్‌ కటింగ్‌, మార్కెటింగ్‌ లాంటి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటారు. ఇందు కోసం నామమాత్రంగా చార్జీలు వసూలు చేస్తారు. ఆయిల్‌ పామ్‌ సాగు చేసే ప్రతి రైతుకూ ప్రత్యేక గుర్తింపు కార్డును జారీ చేస్తారు. దీని ఆధారంగానే పంట కొనుగోలు చేస్తారు.

ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతుకు ప్రతి 15 రోజులకోసారి డబ్బులు చేతికొస్తాయి. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఒక్కో చెట్టు గెలలు ఒక్కోసారి పక్వానికి వస్తుంటాయి. దీంతో ప్రతి 15 రోజులకోసారి గెలల్ని కోయాల్సి ఉంటుంది. వాటిని గంటల వ్యవధిలోనే కంపెనీకి చేర్చాలి. దీంతో దిగుబడికి తగ్గట్లు కంపెనీనే నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. దీంతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు.


Next Story

Most Viewed