టీఆర్ఎస్‌లో కొత్త జోష్.. నూతన కమిటీల ఎంపికకు ముహూర్తం ఫిక్స్

by Shyam |   ( Updated:2021-09-03 03:33:10.0  )
trs 1
X

దిశప్రతినిధి, మేడ్చల్ : గులాబీ పార్టీలో సంస్థాగత సంబురం మొదలైంది. టీఆర్ఎస్‌లో గత కొన్నేళ్లుగా నూతన కమిటీల ఎంపికపై జాప్యం నెలకొన్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి ఏడున్నరేళ్లుగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో మేడ్చల్ జిల్లాలోని గులాబీ పార్టీ కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నెలకొంది. దీనికి తోడు జిల్లాలో ప్రతిపక్ష పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలు చురుగ్గా పనిచేస్తున్నాయి.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. క్యాడర్‌కు పదవులను కట్టబెట్టకుండా తీవ్ర కాలయాపన చేస్తూ వస్తోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు సెప్టెంబర్ 3 నుంచి నూతన కమిటీలను ఎంపిక చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో శ్రేణుల్లో సందడి నెలకొంది.

నేటి నుంచే షురూ..

టీఆర్ఎస్ పార్టీ నేటి(శుక్రవారం) నుంచే నూతన కమిటీల ఎంపికకు శ్రీకారం చుట్టింది.సెప్టెంబర్ 3 నుంచి 30వ తేదీ వరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి కమిటీలను ఎన్నుకునేలా కార్యచరణను రూపొందించింది. జిల్లాలో 61 గ్రామాలుండగా, గ్రామస్థాయి కమిటీలను 3 నుంచి 12 వరకు ఎన్నుకోనుంది. ఆ తర్వాత 12 నుంచి 20 వరకు మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్, డివిజన్, నియోజకవర్గ స్థాయి కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి 30 వరకు జిల్లా స్థాయి కమిటీలతో పాటు, రాష్ట్ర స్థాయి కమిటీలను ఎంపిక చేస్తారు. ఇందులో పార్టీ అనుబంధ సంఘాలను కూడా ఎంపిక చేస్తారు. మహిళ, యువజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ, రైతు, విద్యార్థి, సోషల్ మీడియా తదితర విభాగాలను ఎన్నుకోనున్నారు. అనుబంధ సంఘాలలో 15 మంది చొప్పున తీసుకునే అవకాశం ఉంది.

కష్టపడేవారికే పదవులు..

పార్టీకి కోసం నిరంతరం కష్టపడుతూ.. ప్రతి పక్షాలకు ధీటుగా సమాధానం చెప్పే వారికే ఈసారి పదవులను కట్టబెట్టే ఆలోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు పార్టీ ముఖ్య నాయకుడొకరు ‘దిశ’తో పేర్కొన్నారు. స్థానిక సంస్థలలో పోటీ చేసే అవకాశం రాని వారికి, ఉద్యమ కారులకు సైతం నూతన కమిటీలలో ప్రాతినిధ్యం దక్కుతుందని తెలిపారు. అదే విధంగా సామాజిక సమతూకం కమిటీలలో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనారిటీ, మహిళలకు సమాన అవకాశాలతో కమిటీల నిర్మాణం ఉండనుంది. జిల్లాలోని 5 నియోజకవర్గాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 40 మున్సిపల్ డివిజన్లు, నాలుగు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు, 5 మండలాలు, 61 గ్రామాలలో నూతన కమిటీలు రానున్నాయి. 2018 డిసెంబర్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియమితులయ్యారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారని,అప్పట్లో అందరూ భావించారు. మూడేళ్ల తర్వాత కేటీఆర్ సంస్థాగతంపై దృష్టి సారించడంతో శ్రేణుల్లో ఆశలు చిగురించాయి. అయితే, నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈ కమిటీల ఎన్నికల బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలిపోయింది. ఎమ్మెల్యేలే కమిటీలను ఎంపిక చేస్తే.. వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులనే కమిటీలలో నియమించే అవకాశం ఉంది. దీంతో వ్యతిరేక వర్గాలకు పదవులు రాకపోవచ్చు.. దీంతో ఎవరిని పదవులు వరిస్తాయో.. ఎవరికి రావో.. అన్న చర్చ అయితే జిల్లాలో జోరుగా జరుగుతోంది.

Advertisement

Next Story