- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రజెండా నీడలో త్యాగజీవి!
Vetapalem Venkayamma Book Review

గతాన్ని చూసుకుని గర్వపడటం కాదు.. వర్తమానంలో జీవించడం.. భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలబడటం.. ఎర్రజెండాలో ఏముందో కానీ మట్టి మనుష్యులను.. ప్రపంచం తనకు అవసరం లేదని విసిరేసిన సాదాసీదా మనుష్యులను వర్తమానంలో హీరోలుగా మార్చింది.
ఒక సామాన్య మహిళ, కష్టజీవి.. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో మొదలు అయిన ప్రయాణం.. ఉభయ కమ్యూనిస్టులుగా మారడం.. ఎన్నికలు.. ఎన్నికల సభల్లో పాల్గొనడం.. కాంగ్రెస్ మోసపూరిత విధానాలు.. సాయుధ పోరాట ఎజెండా బయటికి వచ్చిన సీపీఎమ్ తిరిగి ఎన్నికల ఊబిలోనే విప్లవాన్ని అన్వేషించడం.. పార్లమెంటరీ పంథాను తిరస్కరించిన విప్లవకారుల వెంట నిలబడటం. విప్లవకారుల్లోనే మితవాద పంథాను తిరస్కరించి నక్సల్బరీ వెంట నడవడం.. విప్లవ పార్టీకి ప్రజా సంఘాల అవసరం.. ఆవశ్యకత.. పార్టీలో సంక్షోభం.. కొండపల్లిని కేవలం వ్యక్తిగానే పరిగణించి మెజారిటీ వైపు.. నిర్మాణాత్మకమైన పార్టీ వైపు నిలవడం.. ఇదీ వెంకాయమ్మ జీవితం అంటే...
50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అమ్మ..!
ఇది ఎత్తు వంపుల దారి. ఇది నెత్తి రొలికిన దారి..బండి ఇరుసు లాగా వెంకాయమ్మ గుండె తెగువు చూడు.. 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం.. కమ్యూనిస్టు యోధులతో పనిచేసిన అనుభవాల పరంపర.. ఒక మనిషి తనను తాను మార్చుకుంటూ.. సమాజ శ్రేయస్సు కోసం జీవితకాలం పని చేయడం అంటే? జైళ్లు... లాఠీలు.. ఆమె ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. ఆమె పాదాలను గమ్యం వైపు సాగించడాన్ని ఆపలేకపోయాయి..
కార్యకర్తలకు అన్నం పెట్టే అమ్మ!
Sp.. దినేష్ రెడ్డిని చీవాట్లు పెట్టినా, ఎన్టీఆర్‌ను నిలదీసినా... ప్రజాసంఘాల నిర్మాణం వెనకాల.. కార్యకర్తలకు అన్నం పెట్టే అమ్మగా మారినా, ఊరేగింపులో తానే ఒక ఎర్రజెండాగా మారినా, ధిక్కార ప్రతిఘటనా స్వరంగా మారిన తానే ఒక సామూహిక చైతన్యంగా మారినా.. విప్లవ శక్తి జీవితమంతా పేద ప్రజల తోనే.. ఎర్రజెండాతోనే... అవును త్యాగం ఒక్కటే ఈ ప్రపంచాన్ని మారుస్తుంది. త్యాగమే మనిషిని మహోన్నత వ్యక్తిత్వం గల వాళ్లగా మారుస్తుంది.. మార్క్సిజం అజేయం..
కార్యకర్తల చరిత్రలు ఇప్పుడు కావాలి!
జోహార్ కామ్రేడ్.. వేటపాలెం వెంకాయమ్మ.. మీ ఆదర్శ జీవితం..త్యాగపూరిత జీవితం.. మాలాంటి చచ్చు, పుచ్చు వేదవలకు చెంప దెబ్బ.. నీ త్యాగం వృధా కాదు...నీ త్యాగం రేపటి సూర్యోదయం.. కమ్యూనిస్టు మహా ప్రస్థానంలో నాయకుల త్యాగాలే కాదు.. జీవితమంతా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన కార్యకర్తల చరిత్రలు ఇప్పుడు కావాలి.. వీరి త్యాగాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేయాలి.. అల్ప జీవులకు, మధ్యతరగతి మేధావులకు చెంప పెట్టు కావాలి.. అట్లాంటి త్యాగజీవి నక్సలైట్ వెంకాయమ్మను ఇంటర్వ్యూ చేసి ఆమె అనుభవాలను పుస్తకరూపంలో తీసుక వచ్చిన కాంతి నల్లూరి అభినందనీయురాలు. తమ్ముని మీద ప్రేమ మీరా నాకు పుస్తకాన్ని పంపిన కాంతి నల్లూరి అక్కకు కృతజ్ఞతలు.
ఆమె గురించి చెప్పడమంటే..?
'స్టాలినో నీ ఎర్రసైన్యం ఫాసిజం వినాశ సైన్యం' ఈ పాట విటగానే ఎవ్వరికైనా టక్కున గుర్తొచ్చే పేరు వేటపాలెం వెంకాయమ్మ. ఎవరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఎర్రజెండా ఆమె చిరునామా, పోరాటం ఆమె ఉనికి. ఆందోళన ఆమె ఊపిరి. వెంకాయమ్మ గురించి చెప్పడం అంటే ఉమ్మడి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్ర, నక్సల్బరీ రాజకీయాల గురించి చెప్పడమే. తెలంగాణలో రజాకారులకు వ్యతిరేకంగా మొదలైన సాయుధ పోరాటం గురించి ఇప్పటి నయా రజాకారులకు వ్యతిరేకంగా జరుగుతున్న సాయుధ పోరాటం గురించి చెప్పడమే. ఎర్రజెండాను కప్పుకొని వెళ్లిపోయే వరకు ఆమె పోరాట బాట వదల్లేదు. బావుటానీ వదల్లేదు. ఆమె జ్ఞాపకాలివి. ఆమె గురించి పంచుకున్న జ్ఞాపకాలివి.
ఇది కదా మాటంటే ...
‘నేనూ పార్టీనే , పార్టీ మనందరిలో వుంది’ అనే ఈ ఒక్క మాటలోనే కదా మా జీవితకాలపు ఆచరణాంత సమ్రతగా ఒదిగిపోయి ఇమిడిపోవాల్సి వుంది. ఈ ఒక్క మాటను మేం విప్లవ ప్రజానీకం అందరిలో నాటగలిగితే, వెంకాయమ్మ గారిలా ఆ మాటను వాళ్లు జీర్ణం చేసుకోగలిగేలా చేయగలిగితే, అది కదా ఒక కమ్యూనిస్టు కార్యకర్త జీవితానికి ధన్యతను యిచ్చే సేత. ఈ మాట భౌతికశక్తిగా మారినప్పుడు దాని బొంబార్డ్‌మెంట్‌కు తుక్కుతుక్కు కాకుండా ప్రపంచంలోని ఏ సామ్రాజ్యవాద మహాగొప్ప ఆయుదాగారమైనా తనను తాను రక్షించుకోగలదా...? -- షహీదా
పుస్తకం: వేటపాలెం వెంకాయమ్మ
రచన సంపాదకత్వం: నల్లూరి కాంతి
ప్రచురణ: నది ప్రచురణలు
పేజీలు: 200; వెల: రూ.100
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
-సీపీ. కొండారెడ్డి,
97031 12654






