- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

ఆ రజక శిల్పి ఔదార్యం.. ప్రపంచానికి ఆదర్శం
నోబుల్ మేధావులు పుట్టిన నేల
శాస్త్ర జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన నేల
ప్రవక్తలు, జ్ఞానులు పుట్టిన నేల నుండి
విధ్వంసకాండ జరుగుతోంది.
పాలస్తీనా, ఇరాన్, లెబనాన్,
సిరియా దేశాలపై
అమానుష దాడులు ప్రతి దాడులు
ప్రేమ పంచిన పవిత్ర గ్రంథాలు
అక్కడ పుట్టాయి
శాంతి బహుమతులు పొందినవారు
అక్కడే జనించారు
కానీ! నేడు అది
అగ్నిగుండమయ్యింది
వారే మళ్ళీ ఆలోచించాలి
వారిలో అంతర్గత వివేచన దాగి వుంది
అవును! అలెగ్జాండర్
ప్రపంచమంతా జయించాడు
సమాధి పెట్టెలో నుండి చేతులు
బయటకు చాచాడు
మేధావులు, తాత్వికులు
ఈ ప్రపంచాన్ని విస్తరింపజేశారు
ఆయుధదారులు కాదు
అనేక ఆటుపోటులు ఉంటేనే
కడలికి ఊనిక
మనిషీ అంతే!
గాలిని శ్వాసగా మార్చడమే ప్రక్రియ
దానికి నిశ్చలత, నిబ్బరం అవసరం
నీవు నిన్నలో అన్నీ వెదకవద్దు
ఈ రోజును అనుభవిస్తే
వీచే గాలి తాగే నీళ్ళు
నీకు అనుభూతం అవుతాయి
జ్ఞాన స్థిరత్వం వస్తుంది
తర్కం వివేచన నుండి వస్తుంది
ప్రవక్తలు ఘర్షణల నుండి పుట్టారు
ప్రజ్వలన శక్తులుగా ఎదిగారు
జీవితాన్ని మేళవించారు
నది ప్రవహించే దగ్గర
కొండ కూడా రాపిడికి గురవుతుంది
అది మొదట రాయి
తరువాత శిల్పం అయ్యింది
అక్షరం క్షయం కానిది
అర్థ గాంభీర్యత వివేచన
నిజానికి చారిత్రక అవగాహన
సామాజిక స్పృహ
మానవ జీవన సంఘర్షణ
మనిషిని తీర్చిదిద్దుతాయి
ఆ జాలరి సముద్రం
అలల మీద రాసిన రాతల్లో
ఎంతో ప్రకృతి సంపద దాగి వుంది
అక్షరం అర్థం కానీ చక్రవర్తులు
నియంతలయ్యారు
కత్తి ఒకనాడు ఉత్పత్తి పరికరం
క్షత్రియత్వం మానవ వధకు
దాన్ని ఉపయుక్తం చేసింది
ఆ మంగలి కత్తి
ఎప్పుడూ శిల్పాలు చెక్కే ఉలి వంటిదే
అతని ఔదార్యం ప్రపంచానికి ఆదర్శం
హిట్లర్ కంటే మంగలి గొప్పవాడని
చాప్లీన్ చెప్పాడు!
మంచి మాట కోసం జీవించండి
మానవత్వ పరిమళాలు వెదజల్లండి
మానవతా మూర్తులు
ఆకాశ నక్షత్రాలై వెలుగుతారు
యుద్ధం వినాశనానికి గుర్తు
శాంతి కోసం ఆరాటపడండి
విధ్యంసం ఎక్కడ జరిగినా
అక్కడ మరణించేది మానవులే
ఇజ్రాయేల్, ఇరాన్ యుద్ధం
ప్రపంచానికి ముప్పు
మరొకరికి ఆయుధం కూడా
మధ్యవర్తిత్వంలో మార్మికత వుంది
మరొకసారి బుద్ధుడిని
గుర్తు చేసుకోండి
పంచశీలతోనే బుద్ధుడు
ప్రపంచానికి విస్తరించాడు
హేతు దృక్పథంతో నడవడం
శాంతి కోసం ఆలోచించండి
శాంతి మానవుని మార్గం
ప్రపంచానికి ఊపిరి...
డాక్టర్ కత్తి పద్మారావు.
అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్,
లుంబిని వనం,
ఆంధ్రప్రదేశ్.
98497 41695






