తెలంగాణ మట్టి వాసనకు జాతీయ గౌరవం!

by Ravi |   (  Updated:2026-03-23 01:15:10  IST  )

తెలంగాణ మట్టి సువాసనను, తెలంగాణ భాష సహజత్వాన్ని తన కవిత్వం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త డాక్టర్. నందిని సిధారెడ్డి రచించిన అనిమేష.

తెలంగాణ మట్టి వాసనకు జాతీయ గౌరవం!
X

తెలంగాణ మట్టి సువాసనను, తెలంగాణ భాష సహజత్వాన్ని తన కవిత్వం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త డాక్టర్. నందిని సిధారెడ్డి రచించిన “అనిమేష” కవితా సంకలనానికి ' కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం' లభించడం తెలుగు సాహిత్య ప్రపంచానికి గర్వకారణం. ఇది కేవలం ఒక కవికి వచ్చిన వ్యక్తిగత గౌరవమే కాదు. తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్యానికి దక్కిన విశిష్ట గుర్తింపు.

తెలంగాణ ఆత్మను, దాని మట్టిలోని మానవీయ భావజాలాన్ని తన కవిత్వంలో ప్రతిబింబించిన కవి నందిని సిధారెడ్డి ఈ గౌరవానికి అర్హుడు. ప్రముఖ కవులు, సాహితీ వేత్తలు మధురాంతకం నరేంద్ర, డాక్టర్.ఎన్. గోపీ, డాక్టర్.కే కోటేశ్వరరావులతో కూడిన న్యాయ నిర్ణేతల కమిటీ ఈ అవార్డుకు ఆయన పేరును ఎంపిక చేశారు.

విమర్శకుల ప్రశంసలందుకున్న పరిశోధన

నందిని సిధారెడ్డి 1955 జూన్ 12న తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో బందారం గ్రామంలో జన్మించారు. 2017-మే 2 నుంచి 2020 మే వరకు తొలి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా పని చేశారు. ఆయన తండ్రి నర్ర బాల సిధారెడ్డి నిజాం పాలనలో రజాకారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుడు. ఆ కుటుంబంలోనే ఉన్న అంతర్గత సామాజిక చైతన్యం, ప్రజల పట్ల ఉన్న బాధ్యతా భావం సిధారెడ్డి ఆలోచనలపై గాఢమైన ప్రభావం చూపింది. చిన్ననాటి నుంచే సాహిత్యం, సామాజిక ప్రశ్నల పట్ల ఆసక్తి కలిగిన ఆయన విద్యార్థి దశలోనే కవిత్వం రాయడం ప్రారంభించారు. ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ లో తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పూర్తి చేశారు. తరువాత ఆధునిక తెలుగు కవిత్వంపై ఎం.ఫిల్‌, అనంతరం పీహెచ్‌.డి చేశారు. ఆధునిక తెలుగు కవిత్వంలోని వాస్తవికత, అధివాస్తవికత అంశంపై ఆయన చేసిన పరిశోధన సాహిత్య విమర్శకులలో ప్రాధాన్యత పొందింది.

తెలంగాణను జీవింపచేసిన రచనలు..

విద్యార్హతలు పూర్తి చేసిన తరువాత ఆయన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. మెదక్ ప్రాంతంలో బోధన ప్రారంభించి తర్వాత సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. విద్యార్థుల్లో సాహిత్యాభిరుచి పెంపొందించడంలో ఆయన విశేష కృషి చేశారు. 2012లో ప్రభుత్వ సేవ నుంచి పదవీ విరమణ చేసినప్పటికీ సాహిత్య రంగంలో ఆయన సేవలు మరింత విస్తరించాయి. సాహిత్యకారుడిగా నందిని సిధారెడ్డి విభిన్న రంగాల్లో రచనలు చేశారు. కవిత్వం, వ్యాసాలు, కథలు, పాటలు వంటి అనేక రూపాల్లో ఆయన తన ఆలోచనలను వ్యక్తం చేశారు. “దివిటి”, “భూమి స్వప్నం”, “సంభాషణ”, “ప్రాణహిత”, “ఒక బాధ కాదు”, “నది పుట్టువడి”, “ఇక్కడి చెట్ల గాలి” వంటి కవితా సంపుటాలు ఆయన రచనలలో ముఖ్యమైనవి. ఈ రచనలలో తెలంగాణ జీవన విధానం, సామాజిక అసమానతలు, మానవ సంబంధాలు, ప్రకృతి, ప్రజల బాధలు వంటి అంశాలు లోతుగా ప్రతిబింబిస్తాయి. ఆయన వ్యాసాలలో “ఇగురం”, “కుల వృత్తులు – తెలంగాణ సాహిత్యం”, “ఆవర్తనం” వంటి రచనలు తెలంగాణ భాషా సంస్కృతిపై విశ్లేషణాత్మక దృష్టిని అందించాయి.

తెలంగాణ మట్టి వాసనే కవిత్వంగా..

ఆయన కవిత్వానికి ప్రత్యేకత ఏమిటంటే అది పుస్తకాల భాషలో కాకుండా ప్రజల మాటలతో ముడిపడి ఉండటం. తెలంగాణ భాషలోని సహజత్వం, మట్టివాసన ఆయన కవితల్లో ప్రతిధ్వనిస్తుంది. అందుకే ఆయన కవిత్వం ప్రజల మధ్య విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచించిన “నాగేటి సాలల్లో నా తెలంగాణ” అనే పాట ప్రజల్లో అపార స్పందనను రేకెత్తించింది. తెలంగాణ జీవన విధానం, సంస్కృతి, భాషను ప్రతిబింబించిన ఈ కవిత ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. తరువాత ఈ కవిత సినిమా పాటగా వినిపించింది . రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. దీనికి ఆయనకు నంది అవార్డు కూడా లభించింది.

తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు!

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సిధారెడ్డి పాత్ర విశేషమైనది. ఆయన కవిత్వం కేవలం సాహిత్య సృష్టి మాత్రమే కాదు. అది ఒక సామాజిక ప్రకటన. తెలంగాణ ప్రజల స్వాభిమానం, వారి చరిత్ర, వారి బాధలను కవిత్వ రూపంలో ఆయన ప్రపంచానికి వినిపించారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో కవులు, గాయకులు, కళాకారులలో ఆయన ఒక ప్రముఖ స్వరంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆయన సేవలను గుర్తించి తెలంగాణ సాహిత్య అకాడమీకి ఆయనను తొలి అధ్యక్షుడిగా నియమించింది. ఈ అకాడమీ ద్వారా ఆయన తెలంగాణ సాహిత్య సంపదను వెలికితీయడం, పాత రచనలను ప్రచురించడం, కొత్త రచయితలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను ఆయన ముందుండి నిర్వహించారు. కొన్ని సంవత్సరాల్లోనే అకాడమీ ద్వారా వందకు పైగా పుస్తకాలను ప్రచురించడం ఆయన నాయకత్వానికి నిదర్శనం.

సమాజానికి అద్దం పట్టే దర్పణం

తెలంగాణ భాషను పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టడం, తెలంగాణ చరిత్రను విద్యా వ్యవస్థలో స్థానం కల్పించడం వంటి విషయాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర పాఠ్య పుస్తక సమీక్ష కమిటీలో సభ్యుడిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ కమిటీలో సభ్యుడిగా పనిచేసి తెలంగాణకు అనుగుణమైన విద్యా విధానాల రూపకల్పనలో సహకరించారు. ఇలా ఒక కవి, ఉపాధ్యాయుడు, ఉద్యమకారుడు, సాహిత్య నిర్వాహకుడు అనే విభిన్న పాత్రలను సమర్థంగా నిర్వహించిన వ్యక్తి నందిని సిధారెడ్డి. ఆయన రచనలు తెలంగాణ సమాజానికి అద్దం పట్టే దర్పణంగా నిలిచాయి. భాషకు, సంస్కృతికి, ప్రజల ఆత్మగౌరవానికి ఆయన కవిత్వం శక్తివంతమైన ఆయుధంగా మారింది.

తెలంగాణ భాష, సాహిత్యాలకు గౌరవం!

ఇలాంటి మహత్తర సాహిత్య ప్రస్థానానికి గుర్తింపుగా ఆయన రచించిన ‘అనిమేష’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం తెలంగాణ సాహిత్య ప్రపంచానికి గర్వకారణం. ఇది ఒక కవికి మాత్రమే కాదు. తెలంగాణ భాషకు, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాహిత్య సంప్రదాయానికి లభించిన గౌరవం. తెలంగాణ మట్టిలో పుట్టి, తెలంగాణ భాషలో మాట్లాడి, తెలంగాణ ఆత్మను కవిత్వంగా మలిచిన నందిని సిధారెడ్డి వంటి కవులు ఉన్నంతకాలం ఈ భూమి సాహిత్య పరంపర మరింత గొప్పగా విస్తరిస్తూనే ఉంటుంది.

(సిధారెడ్డి సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా)

-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Next Story