- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాకట్టులో భరత దేశం: 50 ఏళ్ల తర్వాతా ప్రాసంగికమే..!
హైదరాబాద్ కుట్ర కేసులో తరిమెల నాగిరెడ్డి చేసిన కోర్టు ప్రకటన ఆధారంగా వెలువడిన ‘తాకట్టులో భారతదేశం’ గ్రంథం భారత రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై మార్క్సిస్టు-లెనినిస్టు విశ్లేషణను అందిస్తుంది. 50 ఏళ్ల తర్వాత కూడా ఈ రచన ప్రాసంగికత, విప్లవ దృక్పథం, భారత అభివృద్ధి నమూనాపై చేసిన విమర్శలు..

భారత కమ్యూనిస్టు విప్లవ ఉద్యమ చరిత్రలో ‘తాకట్టులో భారతదేశం’ ఒక సాధారణ పుస్తకం కాదు.. అది కోర్టు గదిలో వినిపించిన రాజకీయ ప్రకటన, భారత రాజకీయ-ఆర్థిక వ్యవస్థపై మార్క్సిస్టు విశ్లేషణ, విప్లవ ఉద్యమానికి సైద్ధాంతిక దిక్సూచి. హైదరాబాద్ కుట్ర కేసు విచారణ సందర్భంగా తరిమెల నాగిరెడ్డి చేసిన ఈ చారిత్రక ప్రకటన, స్వాతంత్ర్యం అనంతర భారత అభివృద్ధి నమూనా, సామ్రాజ్యవాదం, భూస్వామ్య వ్యవస్థ, విదేశీ పెట్టుబడుల పాత్రపై తీవ్రమైన విమర్శను ముందుకు తెచ్చింది.
ఐదు దశాబ్దాలు గడిచినా ఈ గ్రంథం చుట్టూ చర్చలు కొనసాగుతుండటం, దాని రాజకీయ-ఆర్థిక విశ్లేషణ ఇప్పటికీ ప్రాసంగికమనే వాదనకు బలం చేకూరుస్తోంది. 1972 ఫిబ్రవరి-మార్చి లో హైదరాబాద్ అదనపు సెషన్స్ జడ్జి ముందు నాగిరెడ్డి చేసిన ఆ ప్రకటనే ‘తాకట్టులో భారత దేశం’ పేర ఒక గొప్ప రాజకీయ ఆర్ధిక విశ్లేషణగా, భారత వ్యవస్థపై మార్క్సిస్ట్-లెనినిస్టు అవగాహనగా పుస్తక రూపంలో వెలువడింది.
ప్రామాణికమైన ఆర్థిక నమూనా రచన..
ఇది కోర్టులో సంప్రదాయ పరమైన న్యాయవాదులు చేసే రక్షణాత్మక వాదన కాదు. జైలులో శిక్ష అనుభవిస్తూనే విస్తృతమైన అధ్యయనం ద్వారా సేకరించిన ఆర్థిక, వాణిజ్య గణాంకాలు, ప్రభుత్వ నివేదికలు, కార్పొరేట్ డేటాను క్రోఢీకరించి భారతదేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా పరిశీలించి చేసిన ప్రకటనగా చరిత్ర ప్రసిద్దమయ్యింది. ఈ రచనలో, 1947 ఆగస్టులో అధికారికంగా ప్రకటించిన భారత దేశ స్వాతంత్ర్యం నిజమైన స్వాతంత్ర్యం కాదనీ అది ప్రజలకు నిజమైన విముక్తిని తీసుకురాలేదని, ఈ స్వాతంత్ర్యం భారత దేశంలోని దళారీ బూర్జువా వర్గం, భూస్వామ్య వర్గం కలిసి చేసిన గొప్ప ద్రోహమని తరిమెల నాగిరెడ్డి అభిప్రాయం. బ్రిటిష్ వలస పాలన కేవలం కొత్త రూపాన్ని సంతరించుకుందని, దేశ సార్వభౌమాధికారం సామ్రాజ్యవాద ఆధిపత్య శక్తులకు, ఆర్ధిక వ్యవస్థ వారి ప్రయోజనాలకు తనఖా పెట్టబడిందని ఆయన వాదించారు. ఒక రాజకీయ సిద్ధాంతం ఆధారంగానే కాకుండా అనేక వాస్తవాలను వెలికి తెచ్చిన ఈ గ్రంథం భారతదేశంలో మార్క్సిస్ట్-లెనినిస్ట్ ఆలోచనాపరుల అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటిగా పేరు పొందింది.
ప్రగతి శకం కాదు మృత యుగం..
“ఒక ‘మహాత్ముని’ ప్రత్యక్ష సారధ్యంలో, భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన అహింసా విప్లవం అని పిలవబడే ఉద్యమం, ఆయన అనుంగు అనుచరుడు జవహర్ లాల్ నెహ్రూ పాలన, భారతదేశాన్ని సజీవ ప్రగతి శకం లోకి కాకుండా నిస్తబ్దత అనే మృతయుగం లోకి దిగలాగాయి. రాజకీయ అధికారంలో పై పై మార్పులు జరిగినా మన సామాజిక వ్యవస్థలో గానీ, మన ఆర్థిక వ్యవస్థలో గానీ ఆవశ్యకమైనది ఏదీ మారలేదు. సామ్రాజ్యవాద దోపిడీ గతంలో వలెనే కొనసాగుతూనే ఉంది, బహుశా మరింత విస్తృతంగా. గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య దోపిడీ, హింసలు మరింత తీవ్రంగా మారాయి. అన్ని నియమ నిబంధనలతో ఈ పరిపాలనా వ్యవస్థ గతంలో లాగానే కొనసాగుతున్నది.” అని రచయిత వివరిస్తారు.
దశాబ్దాలుగా నిరూపితమైన రచన..
ఈ పుస్తకం ప్రధాన ఇతివృత్తాలలో ఒకటి స్వాతంత్ర్యం తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడి ఆధిపత్యం నిరాటంకంగా కొనసాగుతున్నదని, బహుళజాతి సంస్థలు తమ ప్రభావాన్ని విస్తరించుకుంటూ పోతున్నాయని నిరూపించటం. పంచవర్ష ప్రణాళికలలో అభివృద్ధి పేర -విదేశీ సహాయం, రుణాలపై ఎక్కువగా ఆధారపడి, ప్రొజెక్టులు, పరిశ్రమలు, ఫ్యాక్టరీ నెలకొల్పారు. వాటి నుండి వచ్చే ఆదాయంలో అధిక భాగం వడ్డీ చెల్లింపులు, లాభాల వాటాల రూపంలో విదేశాలకు తరలిపోయింది. ఈ ఆర్థిక నమూనా భారతదేశ స్వావలంబనను, అభివృద్ధిని ప్రోత్సహించడానికి బదులుగా అంతర్జాతీయ ఫైనాన్స్‌పై ఆధార పడటాన్ని మరింత పెంచింది. ఈ స్థితి ఈనాటికీ కొనసాగుతున్నది.
విప్లవాత్మకం కాదు సర్దుబాటు మాత్రమే
భూసంస్కరణలపై కూడా కా. నాగిరెడ్డి అంతే లోతైన విమర్శలు చేశారు. జమీందారీ వ్యవస్థ రద్దును అందరూ భావించినట్లు పెద్ద విప్లవాత్మక చర్యగా కాక ఆధిపత్య భూస్వాముల అధికారాన్ని కాపాడి, కొనసాగించేందుకు అవసరమైన ఒక సర్దుబాటుగా మాత్రమే చూశారు. ఇతర సంస్కరణలు కూడా వ్యవసాయ సంబంధాలను మార్చలేదు సరికదా.. కాలం చెల్లిన భూస్వామ్య వ్యవస్థను కాస్త ఆధునీకరించి మరింత శక్తివంతంగా చేశాయని ఆయన వాదించారు. దేశంలో జరిగిన మార్పుల్లో చాలావరకు గ్రామీణ ఉన్నత వర్గాల ఆర్థిక స్థితిని బలోపేతం చేసాయని, అదే సమయంలో లక్షలాది మంది చిన్న రైతులు, భూమిలేనివారు దోపిడీ చక్రాల కింద నలిగిపోయారని వివరించారు.
50 ఏళ్ల తర్వాతా ఈ పుస్తకం ప్రాసంగికమే!
భారత రాజ్యం భూస్వాములు, పెద్ద పెట్టుబడిదారులు, విదేశీ శక్తుల ప్రయోజనాలకు సేవ చేసే బ్యూరోక్రాటిక్ వర్గాలతో కలిసి నయా-వలసవాద సాధనంగా పనిచేస్తున్నది. భూ పునఃపంపిణీ చేసి భూస్వామ్య వర్గ పెత్తనాన్ని నిర్మూలించటం, సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని అంతం చేయడం అనే నిజమైన జాతీయవాద లక్షణాలు దానికి లేవు. అందువల్ల ఆయన వ్యవసాయ పోరాటాలతో ప్రభవించే జనతా ప్రజాస్వామ్య విప్లవాన్ని కోరుకున్నారు. ఈ పుస్తకం వెలువడ్డ 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ వ్యవస్థ స్వభావంలో చెప్పుకోదగ్గ మౌలిక మార్పు రాలేదు. 1960ల చివర్లో భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని కదిలించిన సైద్ధాంతిక పోరాటాల చర్చల సార భూతమైన విప్లవ పంథా మూలాల ప్రాతినిధ్యమే తాకట్టులో భారతదేశం గ్రంథం.
విప్లవ చరిత్రలో కీలక పత్రం
కా. నాగిరెడ్డి మరణం తర్వాత, సెషన్స్ కోర్టులో చేసిన డిఫెన్స్ ప్రకటనను సంకలనం చేసి ఇంగ్లీషులో ‘ఇండియా మార్టగేజెడ్’ పేరుతో 1978లో, ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో 1980లో తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ప్రచురించింది. అది భారత విప్లవ చరిత్రలో ఒక ముఖ్యమైన పత్రంగా నిలిచి పోయింది. ఈ కృషి విస్తృతమైన పరిశీలనకు, విశ్లేషణకు, అభివృద్ధిపై మార్క్సిస్ట్ లెనినిస్టు అవగాహనకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆర్థిక, సామాజిక పరివర్తన లేకుండా కేవలం రాజకీయ అధికారం గల స్వాతంత్ర్యం సరిపోదని భావించిన విప్లవ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం చారిత్రక గ్రంథం కాదు. ప్రజల విముక్తి పోరాటం అసంపూర్తిగా మిగిలిపోయిందని ఆ పోరాట కాగడా చేత బట్టి జనతా ప్రజాతంత్రం కోసం విప్లవించవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేసే దిక్సూచి. ‘భారత జనతా ప్రజాస్వామిక విప్లవం పురోగతి చెందుతుందని నేను నమ్ముతున్నాను. విప్లవ విజయం తధ్యం’ అన్నమాటతో నాగిరెడ్డిగారి కోర్టు ప్రకటన ముగుస్తుంది. ఆ విశ్వాసమే ప్రజలను విప్లవోన్ముఖులను చేస్తున్నది. అదే ఈ గ్రంథానికున్న ప్రాసంగికత.
(ప్రముఖ విప్లవ కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా)
పుస్తకం: తాకట్టులో భారతదేశం
రచయిత: తరిమెల నాగిరెడ్డి
ప్రచురణ: తరిమెల నాగిరెడ్డి ట్రస్ట్
వెల: రూ. 300
ప్రతులకు: మైత్రీ బుక్ హౌస్
70755 08270
సమీక్షకులు
-డాక్టర్ యస్. జతిన్ కుమార్
98498 06281






