సిరివెన్నెల..ఓ అక్షర అనంత విశ్వం..!

by Ravi |   (  Updated:2026-05-18 00:45:53  IST  )

Sirivennela... an infinite universe of words!

సిరివెన్నెల..ఓ అక్షర అనంత విశ్వం..!
X

సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాట/ ఆట ఆట నువ్వు నిలబడి చూడకు ఏ చోట/ ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట'ఇలాంటి బతుకు తాత్వికతకు, జీవిత మార్మికతను జోడించి తెలుగు పాట వైభవాన్ని విశ్వ యవనికపై ఆవిష్కరించారు సీతారామశాస్త్రి.

వీలైనంత వినోదానికి..కాసింత విజ్ఞానాన్ని జోడించే సినిమా పాటలకు నోబెల్ స్థాయి వచన కవిత్వపు రంగులద్ది కోట్లమంది ప్రజల జీవితాల్లో స్ఫూర్తి వెన్నెలను కురిపించారు. లక్షలాది యువతకు ఫిలాసఫర్‌గా, మెంటార్‌గా, టీచర్‌గా, ఆచార్యుడి‌గా..మార్గదర్శి అయ్యారు. దాదాపు 2500కు పైగా సినిమా పాటలు రాశారు. ప్రతిదీ ప్రత్యేకమే. కొన్ని పాటలయితే భవిష్యత్ తరాలకు జీవిత పాఠ్యాంశాలే. ఇంకొన్ని పాటలైతే జీవన విలువలను చాటిచెప్పే భగవద్గీత శ్లోకాలే.

రాసిన అక్షరాలకే పట్టం కట్టిన కవి..

1955 మే 20 న చేంబోలు సీతారామ శాస్త్రిగా అనకాపల్లిలో ఉదయించిన ఓ అక్షర విశ్వం.. సిరివెన్నెలగా ప్రకాశిస్తూ.. "పద్మశ్రీ"గా ఎదిగింది. ఈ పురస్కారం పొందిన ఏకైక తెలుగు సినీ రచయితగా ఆయన పాటలకు ప్రపంచం ప్రేరణ పొందింది. విధాత తలపున ప్రభవించిన ఈ జీవన వేదం 11 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది, 4 సార్లు ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు, దేశ విదేశాల్లో ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకొని..'అయినవాడే అందరికీ... ఐనా అందడు ఎవరికీ..' అనేలా చరిత్ర సృష్టించారు. దర్శకనిర్మాతల కష్టాల్ని గమనించి... ఎన్నో సందర్భాల్లో డబ్బులు తీసుకోకుండా పాటలు రాసి కరెన్సీ కట్టల కంటే తన కలం రాసిన అక్షరాలకే పట్టం కట్టారు శాస్త్రి. తన వృత్తిలో బ్రతుకుతెరువు కంటే...కోట్లాది మందిని బాగుపరచడానికే ప్రాధాన్యమిచ్చారు.

నిప్పు తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని..

ఎం.బి.బి.యస్ చదువును మధ్యలో ఆపేసిన శాస్త్రి సమాజంలోని అసమానతలపై, అన్యాయాలపై, అక్రమాలపై, అజ్ఞానంపై, అనాగరిక అమానుష ఘటనలపై నిత్యం అక్షర యుద్ధం చేస్తూ.. నిప్పు తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని/అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! వంటి రాతలతో ఎన్నో శస్త్ర చికిత్సలు చేశారు. బతుకాటలో టెలిఫోన్స్ శాఖలో ఉద్యోగంలో చేరినప్పటికీ.. ఆ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమంటూ మూడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో అన్ని జోనర్ పాటలు తనదైన విలువల శైలిలో రాసి.. విశ్వాసాలతో, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల మేధావులకు, సామాన్యులకు చేరువైన మానవతావాదిగా "సినీవాలి" గా ప్రభవిస్తూనే ఉన్నారు. సినిమా పాటలే కాక సిరివెన్నెల కలం నుండి శివ దర్పణం, సిరివెన్నెల తరంగాలు, నంది వర్ధనాలు, ఎన్నో రంగుల తెల్ల కిరణం, కళ్యాణ రాగాలు అనే గ్రంథాలు వెలువడ్డాయి. సీతారామశాస్త్రి సినీ, సినీయేతర సాహిత్యం మొత్తాన్ని సిరివెన్నెల సమగ్ర సాహిత్యంగా ఆరు సంపుటాలలో ప్రచురింప చేశారు.

ఎవరెస్టు వ్యక్తిత్వ శిఖరమై నిలిచిన సాహిత్యం!

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసమంటూ రాసినా.. మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి అని చెప్పినా... రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం/ రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం అని విమర్శించినా... పదవులు కోరని పావన మూర్తి.. హృదయాలేలిన చక్రవర్తి అంటూ గాంధీ స్ఫూర్తిని కీర్తించినా... సాహసం నా పథం/ రాజసం నా రథం వెడితే లేడి ఒడిచేరుతుందా.. వేట సాగాలి కాదా అంటూ గర్జించినా... జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదంటూ బోధించినా...శాస్త్రి సాహిత్యం ఎవరెస్టు వ్యక్తిత్వ శిఖరమై నిలిచింది. ప్రతిదీ ప్రశ్నిస్తూనే.. మది లోతుల్లో అన్వేషిస్తూనే.. పరిష్కారం చూపెడుతుంది.

ట్రెండింగ్ లో నిలిచిన మాటలు..

శాస్త్రి జీవన తత్వం గురించి, ఆయన నుంచి స్ఫూర్తి పొందిన విధానం గురించి ప్రముఖుల మాటలైతే నేటికి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే కొనసాగుతూ గూస్ బంప్స్‌గా నిలుస్తున్నాయి. 2026 జనవరి 25న అనకాపల్లిలోని గాంధీ నగర్‌లో సిరివెన్నెల కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. శాస్త్రి మీద ప్రముఖుల అభిప్రాయాలతో "సిరివెన్నెలకో నూలుపోగు" పేరిట ప్రతీ సంవత్సరం పుస్తకావిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న సిరివెన్నెల పాటలకు ప్రభుత్వ జాతీయ ఉత్తమ గేయ రచయిత పురస్కారం వరించకపోవడం ఇప్పటికీ ..ఎప్పటికీ మిలియన్ డాలర్ల క్వశ్చన్.

ఆరుపదులు దాటిన నవ యువగానం

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు అని రాసిన ఆరు పదుల వయస్సు దాటిన యువకుడిగా... కొంతకాలం నేలకొచ్చాం, అతిథులై ఉండి వెళ్ళగా.. కోటలైనా, కొంపలైనా ఏవీ స్థిరాస్తి కావుగా అంటూ రాయగలగడం మన "సీతారామునికే " చెల్లింది. శాస్త్ర సాంకేతికతతో ఫిలాసఫీని వెంటేసుకుని ఆధునికతలో కూడా ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంప్రదాయాలను కలబోస్తూ, సాహితీ బహుముఖ ప్రజ్ఞతో నిరంతరం తనలో తను జ్వలిస్తూ, రచిస్తూ, జీవిస్తూ సాగిన సీతారామశాస్త్రి సినిమా పాట జీవన ప్రయాణం అసామాన్యం, అనితర సాధ్యం, ఓ అద్భుతం, తరతరాలకు ఓ స్ఫూర్తి చరితం..! తన పాటలతో దశాబ్దాలుగా.. సగటు స్థాయి ప్రేక్షకుడిని అలరించడమే కాకుండా సమాజాన్ని సైతం ఎడ్యుకేట్ చేసిన కాలాతీత వ్యక్తి, ప్రపంచం గుర్తించని ఓ శాస్త్రవేత్త, కారణజన్ముడు సీతారామశాస్త్రి.

-ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Next Story