- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదవండి.. చదివించండి.. చదవడాన్ని ప్రోత్సహించండి
పుస్తకాన్ని ఒడిలో పెట్టుకుని ఒక్కో పేజీ తిప్పుతూ చదివే అనుభవానికి చరమాంకం కనిపిస్తున్నది. పుస్తకాన్ని చదువుతూ చదువుతూ

పుస్తకాన్ని ఒడిలో పెట్టుకుని ఒక్కో పేజీ తిప్పుతూ చదివే అనుభవానికి చరమాంకం కనిపిస్తున్నది. పుస్తకాన్ని చదువుతూ చదువుతూ గుండెలకు హత్తుకుని నిద్రపోయిన రోజులకు చరమగీతం వినిపిస్తున్నది. చదవడమూ చదివింది అర్థం చేసుకుని అరిగించుకుని సాదృశ్యం చేసుకోవడంలోని ఆనందం అనుభవం ఇవాల్టి తరం కోల్పోతున్నారనిపిస్తున్నది. పుస్తకం పురావస్తువు, చదవడం చాదస్తం అనే స్థితికి వాళ్ళు దాదాపు చేరుకున్నారనిపిస్తున్నది.
సాంకేతికత, అభివృద్ధి ప్రధానమైన ఈ శతాబ్దంలో ఆధునిక తరం ‘చదివే’ సంస్కృతి నుంచి వేరై పోతూ ‘చూసే’ సంస్కృతికి దగ్గరవుతున్నారు. బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్‌కు మారిపోతున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలం నుంచి ఒక్క చదివే అలవాటు మినహా అన్ని మాధ్యమాలూ అలవాట్లూ పెరిగాయి. అంతా చూడడమే. టీవీ చూస్తారు, సినిమా చూస్తారు, కంప్యూటర్ చూస్తారు, స్మార్ట్ ఫోన్ చూస్తారు. ఫోన్ మాట్లాడానికంటే బొమ్మలు వీడియోలు చూడ్డానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒకటేమిటి అన్నే చూడ్డమే. ఆ చూసే సమయం కూడా తగ్గిపోయి క్షణాల్లో స్క్రోల్ చేయడమే.
స్క్రోల్ స్క్రోల్, వాట్ నెక్స్ట్
బొమ్మయినా. రీలయినా, ఏదయినా స్క్రోల్ స్క్రోల్ అంటూ ముందుకు పోవడమే. తర్వాతేమిటి ‘వాట్ నెక్స్ట్’ అన్నదే ఇవాల్టి తరం ఆలోచన. చిన్న పిల్లల నుంచి మొదలు అందరూ ఇలా చూసేందుకు అలవాటు పడిపోతున్నారు. అక్షరాలు రాయడానికి, చదవడానికి బదులు ఇమేజ్‌లనే వాడే సంస్కృతిని మనం చూస్తున్నాం. అయితే ఈ చూడడం అనే ప్రక్రియలో అంతా సరిగ్గానే ఉందా, చూస్తూ వున్న వాళ్ళపైన ఈ ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్‌కు సంబంధించిన ప్రభావాలు ఎలా వుంటున్నాయి వాటి ప్రతిఫలనాలు సమాజం పైన ఎట్లా వుంటున్నాయనే అవగాహన పెద్దవాళ్ళల్లో కూడా కొరవడడం విచారకరం.
పుస్తకం చదువుతూ నిద్రపోయే కాలం ఏదీ?
ప్రపంచంలోని వందలాది భాషల్లో భావాల పరిణామాల్నీ ఉద్యమాల్నీ, ఉద్వేగాల్నీ విలువల్నీ ఒకటేమిటి మనిషిలోని సమస్త మార్పుల్నీ పుస్తకం తనలో నిబిడీకృతం చేసుకొని సాక్షీభూతంగా నిలబడింది. యువకులు విద్యార్థులు తమ అకాడెమిక్ పుస్తకాలతో పాటు ఒక మంచి పుస్తకం చదువుతూ చదువుతూ గుండెల మీద వుంచుకొని నిద్రపోయినప్పటి ఆనందం ఇవాల్టి తరానికి తెలియకపోవడం ఒకింత విచారకరమే. వర్తమాన సాంకేతికతను దాని అభివృద్దిని కాదనలేం. మార్పుని నివారించలెం. సాంకేతికతను దాని వినియోగాన్ని కాదనకుండానే చదివే అలవాటును ఎట్లా పెంచాలో ఆలోచించి అమలు చేయాల్సి వుంది. పుస్తకాలు చదవడం వల్ల ఒనగూడే వ్యక్తిగత పరిణామం, వ్యక్తిత్వ వికాసాన్ని కొత్త తరానికి వివరించి చెప్పాల్సి వుంది. ఒక మంచి పుస్తకాన్ని చదివి జీర్ణించుకుని, మనసు పరిపక్వతను సాధించడంలోనూ మనసు లోపల ఇమిడించు కోవడంలోవున్న ఆనందాన్ని వాళ్లకు అర్థం చేయించాల్సి ఉంది. అది ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో, గ్రంథాలయాల్లో జరగాలి. అలాంటి ఓ రెండు మంచి ప్రయత్నాన్ని తెలుసుకుని వాటిని అభినందించాల్సి వుంది.
గురుకుల డిగ్రీ కళాశాలలో "రీడర్స్ క్లబ్"
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఒక మంచి ప్రయత్నం మొదలైంది. అక్కడి అధ్యాపకులు ప్రధానాచార్యులు, లైబ్రేరియన్ విద్యార్థినులకోసం "రీడర్స్ క్లబ్" ఏర్పాటు చేశారు. కళాశాల గ్రంధాలయంలో విద్యార్థినులకు అకాడెమిక్ పుస్తకాలతో పాటు కథ, నవల, కవిత్వం, వ్యక్తిత్వ వికాసం ఒకటేమిటి అనేక నాన్ అకాడెమిక్ పుస్తకాల్ని అందుబాటులో ఉంచారు. వారంలో మూడు రోజుల పాటు విద్యార్థినులకు ఒక క్రమబద్ధమైన సమయాన్ని కేటాయించి సాహిత్యం చదవడాన్ని ప్రోత్సహిస్తున్నారు. అట్లా కేవలం చదవడమే కాకుండా చదివిన పుస్తకాల మీద సమీక్షలు రాయించడం, ఉపన్యాసాల్ని ఇప్పించడం లాంటి కార్యక్రమాల్ని చేస్తున్నారు. ఫలితంగా కొందరు విద్యార్థినులు స్వయంగా కవితలు కథలు రాయడం ప్రారంభించారు. ఇదంతా వారి అకాడెమిక్ చదువులకు ఆటంకం కలుగకుండా చేయడం ముదావాహం. ఆ క్లబ్ ని నాతో ప్రారంభింప చేయడం నాకు చాలా ఆనందం వేసింది. ఆ కాలేజీ అమ్మాయిల్లో వున్న ఉత్సాహం అధ్యాపకులు చూపిస్తున్న శ్రద్ధ భవిష్యత్తు పట్ల ఎంతో ఆశని ఉత్సాహాన్ని కలిగించింది. గతంలో క్యాంపస్ ఫిలిం క్లబ్ కాన్సెప్ట్ ని నేను అనేక కాలేజీల్లో ప్రోత్సహించాను. ఇప్పుడీ రీడర్స్ క్లబ్.ఇలాంటి రీడర్స్ క్లబ్స్ అన్ని కాలేజీల్లో ఏర్పాటు చేసి చదవడాన్ని ప్రోత్సహిస్తే కొత్త తరంలో చదివే అలవాటును పెంపొంచిన వాళ్ళం అవుతాం. వేములవాడ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లావణ్య, లైబ్రేరియన్ డాక్టర్ శ్రీలత వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుమలతలని మనసారా అభినందించాలి.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కొత్త ప్రయోగం
ఇక మరో ప్రయత్నం ఖమ్మం ఎస్.ఆర్.బి.జి.ఎన్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగింది. అక్కడి తెలుగు విభాగం ఆధ్వర్యంలో రీడర్స్ క్లబ్ వుంది. కళాశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు జిజ్ఞాస అనే కార్యక్రమం లో భాగంగా తెలుగు విభాగం ప్రముఖ కవి సీతారాం సూచనలతో ఒక మంచి ప్రయత్నం చేశారు. కేవలం మాటలతో కాకుండా నిర్దుష్టమైన కృషి జరగడం ఎంతో సంతోషం కలిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా అయిదుగురు విద్యార్థులు ఒక్కక్కరి చేత పాతిక ముప్పై కథలు చదివించి వారి అభిప్రాయాలను రాయించాలన్నది వాళ్ళ లక్ష్యం. అందులో భాగంగా శృతి రాసిన సమీక్షల్లాంటి అభిప్రాయాల్ని క్రోడీకరించి ‘కథాంశం’ పేర సంకలనాన్ని తెచ్చారు. ఇది నిజంగా అద్భుత ప్రయోగం. విద్యార్థులతో కథల్ని చదివించడం అభిప్రాయాల్ని రాయించడం వాటిల్లో బాగా రాసిన శృతి రచనలతో సంకలనం తేవడం హాట్స్ ఆఫ్ టు శృతి. ఆమె తన అభిప్రాయాలు రాసిన కథల్లో ప్రముఖ కథకులు బి.వీ.ఎన్ స్వామి, దాట్ల దేవదానం రాజు, కటుకోఝ్వుల మనోహరాచారి లాంటి వారి రచనలున్నాయి. శృతి తన ముందు మాటలో ఇట్లా అంది ‘ విద్యార్థుల జీవితంలో ముఖ్యమైనది చదువు. ఆ చదువుకు అర్థాన్నిచ్చేది సృజనాత్మకత. ఆలోచనలను నైపుణ్యాలను జోడించడమే సృజనాత్మకత అంది’.
రీడింగ్ హాబిట్‌ని పెంచే అపూర్వ కృషి
35 కథల్ని తన అవగాహన మేరకు శృతి సమీక్షించింది. తనకి అభినందనలు. ఈ కృషిలో భాగం పంచుకున్న ఈస్తేటిక్ కమిటీ సభ్యులు ప్రసేన్, మువ్వా శ్రీనివాస రావు, వంశీకృష్ణ పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఫని మాధవిలతో పాటు రవి మారూత్ మొదలైన వారందరూ అభినందనీయులే. ఇలాంటి కార్యక్రమాలే కొత్త తరాన్ని సృజన వైపు, కళల వైపునకు మరలిస్తాయి. అన్ని స్కూళ్ళు కాలేజీలు విశ్వవిద్యాలయాలు ఈ దిశలో కృషి కొనసాగించాల్సిన అవసరం వుంది. కవులు రచయితలు కూడా రాసి చేతులు దులుపుకోకుండా రీడింగ్ హాబిట్‌ని పెంచేందుకు తమవంతు బాధ్యతను నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాను.
- వారాల ఆనంద్
94405 01281






