- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మానకొండూరు నుండి
పలివేల్పుల దాకా
ఈ నాల్గు రోడ్ల హైవే
నా హృదయపు ముంగిట్లోనే
పసిబిడ్డలా రోజూ పెరిగి పెద్దదయ్యింది
ఈ దోవంట తిరగదోడిన మట్టిలోంచి
అవిశిన ఊరి కడుపులోని
రందంతా బయటపడేది
నరికేసిన ఊయల చెట్టు
నా అందన మెరమెరలాడేది
సగం కూలిన ఇంటి గోడల మీది
గిర గిర బ్లాక్ అండ్ వైట్ పాత ఫోటోలెవరివో
దగ్గరకెళ్ళి చూస్తే,
ఎడ్డిమనుషులంతా తెలిసినట్టే ఉండేవారు
శంకరపట్నం చెరువు దగ్గరకురాగానే
తామర పూవులు కొంటె కబుర్లు చెప్పేవి
సింగాపూర్ శిల్పశాల బయట
అంజన్న అభయమిచ్చేవాడు
మత్శ్య గిరీంద్రుడి దయ వలనేనేమో
కొత్తగట్టు గుట్టలింకా బతికి ఉన్నాయి
రాచబాటలెప్పటికీ
సాటిరాని పైరునేల ఆర్తగీతం
గట్టుదుద్దెనెపల్లె వద్ద ఆరబోసిన వొడ్లలో
తడి గొంతై వినిపించేది
తారుదేహపు భుజాలు
ఎన్ని బుల్డోజర్లనైనా మోయగలిగేవి గానీ
పంట బస్తాల బరువుకు మాత్రం
సతమతమయ్యేవి
కొత్తగా వేస్తున్న రోడ్లు
అల్లరి సోగ్గాళ్ళ నూనుగు మీసాలు
లేదా వగలమారి అల్లిన వొత్తైన వాల్జడలు
ఈ దుల్ల దుల్ల దుమ్ముధూళి వెనుక
నాకు లబ్ డబ్ మనే
తాయిమాయి గుండె కనిపిస్తుంది
రాదార్లక్కూడా సముద్రమంత కన్నీరుంటుంది
తొవ్వదీసుడు తెలుసు గనుకనే
ఎవ్వరి పాదముద్రలనైనా ఈ హైవేలు
వినమ్రంగా తలకెత్తుకుంటాయి కాబోలు
-శ్రీరామ్ పుప్పాల
9963482597
- Tags
- Poem






