అరిటాకు..

by Ravi |   (  Updated:2026-05-10 23:45:14  IST  )

Poem

అరిటాకు..
X

మొదట్లో లేతగా, మృదువుగా

సుకుమారంగా ముట్టుకుంటే

కందిపోయేంత నునుపుగా

మెరుస్తూ ఉండే

అరిటాకు దేహం

ముల్లు చేసిన గాయాలకు

తూట్లు పడిపోయింది

మానసిక గాయాలతో వడిలి

జీవ కళ కోల్పోయింది

అయినా ముల్లు నెదిరించటం తప్పనే

సాంప్రదాయక భావనతో

ముల్లులో మార్పు కోసం

మౌనంగా దశాబ్దాలు

ఎదురుచూసిన అరిటాకు

మార్పు చూసింది

మరింత వికృతమైన

హింసాత్మకమైన

అనుమానపు మాటల ముల్లులు

అవమానపు చేతల ముల్లులు

వేలవేల ముల్లులు ఒకేసారి

గుండెల్లో గుచ్చుతున్నట్లు!

అరిటాకు సహన హృదయం బద్ధలైంది

అరిటాకు తిరుగుబాటు, చైతన్యం

సామెతనే తిరగ రాసింది!

-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Next Story