పరాభవా! నీకు స్వాగతం

by Ravi |   (  Updated:2026-03-23 00:45:37  IST  )

Poem

పరాభవా! నీకు స్వాగతం
X

పరాభవ నామ సంవత్సరం

ఈసారి మైసి మీద వస్తున్నది

ఏమేమి ఘనకార్యాలు పరాభవాలు

వెంట తీసుకువస్తుందో చూడాలి

అంతా అయిపోయిందని

చేతులు ఎత్తేస్తున్నారు

రాజ్యాంగాన్ని కాదన్న వారు

చట్టపరిధిలో పనిచేస్తామని

శుభ సూచకం చెప్తుతున్నారు

ఇప్పుడు ఏడుస్తున్న పిల్లలకు

తల్లులు చందమామను చూపిస్తూ

గోరుముద్దలు తినడం లేదు

అమ్మలు సెల్ ఫోన్ ఇచ్చి తినిపిస్తున్నారు

నిద్ర తిండి వేళలు అన్నీ మారిపోయాయి

రుతువులన్నీ శీర్షాసనం వేశాయి

కాలం కానీ కాలంలో

సమయం కాని సమయంలో

పౌల్ట్రీ ఫారం కోళ్లు కూస్తున్నాయి

అంతా ప్రైవేట్ మయం

కాదంటే స్వేచ్ఛ వాణిజ్య భయం

కూర్చున్న కొమ్మను నరుక్కోవడాన్ని

అభివృద్ధి అందలం అంటున్నారు

ఓటుకు ఉచితాల లంచం

ఎవరికీ అరికీసు తలవంచం

ఈ ఏడు 8 పాళ్లు రాజయోగం

16 పాళ్లు అవమానం

ఆదాయం నాలుగు పాళ్లు

వ్యయం ఎనిమిది పాళ్లు

పరాభవ నామ సంవత్సరం

దున్నపోతు మీద వస్తున్నది

చూడాలి బండిని

ఎటు గుంజుకుపోతుందో

నాగలిని ఎటు

ఎత్తుకు పోతుందో చూడాలి

రమ్మన్నా రాకుమన్నా ఊకుంటావా చెప్పు

పరాభవా ! నీకు స్వాగతం చెప్పడమే ఒప్పు

-జూకంటి జగన్నాథం

94410 78095

Next Story