ఇల్లు..

by Ravi |   (  Updated:2026-03-23 00:30:34  IST  )

Poem

ఇల్లు..
X



కూలింది ఇల్లు కాదు,

పొద్దంతా రెక్కలు ముక్కలు

చేసుకొని కష్టపడి, రాత్రి మేము

తలదాచుకునే ఓ చిన్న పూరి గుడిసె!!

కూలింది ఇల్లు కాదు,

భర్త చనిపోయి చిన్న పిల్లలతో

రోడ్డున పడ్డ ఓ అక్క రెక్కల

కష్టం చేసి కట్టుకున్న గూడు!!

కూలింది ఇల్లు కాదు,

తన ఆడబిడ్డల రక్షణకోసం

ఓ నాన్న తన రక్తంతో రిక్షా తోలి

పైసా పైసా పోగేసి

కట్టిన సంరక్షణాలయం!!

కూలింది ఇల్లు కాదు,

ఇప్పుడిప్పుడే గంపెడు ఆశలతో

బాల్యంలోకి అడుగిడిన

చిన్నారుల కలల సౌధం!!

కూలింది ఇల్లు కాదు,

మా బలహీనుల బక్క పలచని

దేహంలోని బొక్కల గూడు,

ఆ గూడు వెనకాలే పుట్టెడు దుఃఖంతో

ఉన్న గుప్పెడు గుండె!!

ఒక్కొక్క ఇటుక పేర్చి

కట్టుకున్న ఇల్లును,

మా కళ్లముందే జేసిబీలు

మీద పడి రక్కుతుంటే,

కూలిన ఎర్రనిమట్టి గోడలు మా కళ్ల చేరి,

ఎర్రని రక్త కన్నీరు ధారలు అయ్యే!!

-జక్కుల శ్రీనివాస్

97019 38358

Next Story