సాగర తీరాన..

by Ravi |   (  Updated:2025-07-28 00:45:17  IST  )

Poem

సాగర తీరాన..
X

గగన వీధుల్లో తరుముకొస్తున్న

మేఘాలకు అందకుండా

చంద్రుడు ఆట పట్టిస్తూ

పరుగు తీస్తున్నాడు

ఆ పరుగు చూసి సముద్రం

విరగబడి నవ్వింది

తీరాన్ని తాకాలనే తహతహలతో

కెరటాలు తుళ్ళి తుళ్ళి

కదిలి వస్తున్నాయి

ఆ కెరటాల ఘోష భీకరంగా ఉంది

గాలి చిరునవ్వులు చిందిస్తూ

పిల్లతెమ్మెరలా నాట్యం చేస్తుంది

అలసిన నావ ఒడ్డున సేదతీరింది

సముద్ర రేఖపై నడుస్తున్న

నిశాంత కన్నె అరవిరిసిన

ఆశలతో నక్షత్రాలు పొదిగిన

కిరీటాన్ని అలంకరించుకొని

మురిసి మెరిసిపోతుంది

అలసిన మనసును

సృజిస్తూ అబ్బురపరుస్తూ

అంతరంగ లోతుల్ని తడిమిన

ఆ సాగర తీరాన

సృష్టి అద్భుతాల అపురూప ఘట్టాన్ని

నా మనోనేత్రం ధర్శించింది

నూతన భావోదయంతో

మనసు ప్రశాంత వదనమయింది

- సునీత నెల్లుట్ల

79894 60657

Next Story