- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

బాల్యమంటే ఏమిటని
ప్రశ్నించాడో తమ్ముడు నన్ను..
బాల్యమంటే
చందమామను చూపిస్తూ అమ్మ తినిపించే
గోరుముద్దలూ, పాడే జోల పాటలూ
వళ్లో కూర్చోబెట్టుకొని బుజ్జగిస్తూ
నాన్న చెప్పే మాటలూ, అక్షరాలు
పక్కలో చేర్చుకొని నాన్నమ్మ చెప్పే
కథలూ, నేర్పే పాటలూ
అన్నా, చెల్లితో కల్సి ఆటలూ, చిలిపి చేష్టలూ
చెప్పాన్నేను బాల్యానికి నిర్వచనంలా
వాడి మొహం చిన్నబోయింది.
కూలిపని చేసి అలసి సొలసి
ఇంటికొచ్చే అమ్మ
విసుక్కుంటూ నోట్లో
రెండు ముద్దలు కూరుతుందే కానీ
చందమామను చూపించదూ,
జోలపాటా పాడదు
ఆమె నోరు తెరిస్తే వచ్చేది వేదనా గీతమే..
పగలంతా రెక్కలు ముక్కలు చేసుకొని
అలుపు తీర్చుకుందుకు తప్పతాగి
ఇంటికొచ్చే నాన్నకు కసిరింపులు,
విసిరింపులే తప్ప బుజ్జగింపులు తెలీవు
అక్షరాలు అసలే తెలీవు
అతను నోరు తెరిస్తే వచ్చేవి సారా బూతులే
అస్తమానం కుక్కి మంచంలో
పడి ఉండే నాయనమ్మకు
భళ్లు, భళ్లుమని దగ్గటం తప్ప
కథలు చెప్పటమే రాదు
ఇంకా పాటలు నేర్పడం కూడానా!
ఆమె నోరు తెరిస్తే వచ్చేవి చావు ప్రేలాపనలే
అన్నా, చెల్లితో అన్నం కోసం పోటీనే తప్ప
ఆటలు ఎప్పుడూ లేవు,
ఇంకా చిలిపి చేష్టలు కూడానా!
పలక పట్టే వయసు రాక ముందే
బాధ్యతల్ని మోస్తున్న
భావి భారత పౌరుడు వాడు
బాల్యమంటే తెలియని వాడు
అందుకే అడిగాడు సందేహంగా
మరి, నా బాల్యమేమయిందని!?
దోచి వేయబడింది
ఎవరు? దోచిందెవరు?
వాడి కళ్లు ప్రశ్నార్థకాలయ్యాయి.
ఇంకెవరు, ఈ వ్యవస్థ!
నేడు నీ బాల్యాన్ని దోచేసింది
రేపు నీ బతుకునీ దోచేస్తుంది
చెప్పాన్నేను కచ్చితంగా
వాడి కళ్లు అగ్ని గోళాలయ్యాయి.
వాడి పిడికిలి కసిగా బిగుస్తోంది
ఎర్రని వెలుగుల్ని తెచ్చే
రేపటి సూర్యుడు వాడు!
- మిడ్కో (రేణుక)
- Tags
- Poem






