కారణ ఫలం!

by Ravi |   (  Updated:2025-03-02 23:30:35  IST  )

Poem

కారణ ఫలం!
X

మృత్యువార్త చెవికి చేరినప్పుడల్లా

బతుకు బాట తడబడుతుంది.

ఎదురుగా కనిపించేఅద్దంలానో

వెనుకగా అనుసరించే నీడలానో

పక్కగా నడిచే అనుచరుడిలానో

అభిముఖంగా నడిచే అపరిచితుడిలానో

మృత్యుదేవత రూపాలు

ఒకటా రెండా?

కంటిపాప కదలికల మధ్య

అప్రయత్నంగా వేసే పాదముద్రల మధ్య

ధూసరం అలుముకున్న నింగి నేల మధ్య

కాస్తంత నిడివి వుంచావో అంతే..

మృత్యువు ఆక్రమణ సంగతి చెప్పక్కర్లేదు

నిజానికి మృత్యువు మిత్రువు

ఎంతో ప్రేమగా మనల్ని ఓదార్చుతుంది.

భరించలేని బాధను మోయలేనప్పుడు

జీవిత సారాంశం అంతా అర్థమయినప్పుడు

మనకంటూ ఎవరూ లేనప్పుడు

ఒడిలోకి తీసుకుని సేదదీర్చుతుంది..

అలా అని సరిపెట్టుకోలేము

మృత్యువు కట్ట శత్రువు కూడా..

ఒక్కోసారి పసిపిల్లలని కూడా చూడకుండా

కన్నెపిల్లలని కూడా గమనించకుండా

ఎన్నో ఆశలతో వున్నారని కూడా పట్టించుకోకుండా

అనుకున్నది సాధించకుండా

మృత్యు సంగీతాన్ని శ్రావ్యంగా పాడేసి

మైమరపించేసి లాక్కుపోతుంది.

ఇంతదానికి జననం ఎందుకు?

నిండునూరేళ్ళు చల్లగా వర్ధిల్లు

అనే దీవెనెందుకు?

కర్మఫలమో! పాపఫలమో!

ఏదైతేనేం? ఏదో ఒక కారణఫలం!

శైలజామిత్ర

92909 00879

Next Story