ఆమె బ్రతికే వుంటుంది..!

by Ravi |   (  Updated:2025-02-24 01:00:29  IST  )

Poem

ఆమె బ్రతికే వుంటుంది..!
X

అందరూ అంటున్నారు

స్టెతస్కోప్‌తో ఆమె లేదని..!

ఆమె మృత్యు గుహలోకి

మళ్ళీ రాలేని చీకటిలోకి

ఎవ్వరికీ చెప్పకుండానే

వెళ్ళిందని ఏకధాటిగా

ఏడుస్తూనే వున్నారు

ఆమె తల్లిదండ్రులు..!

ఓ భయంకర రోడ్డు ప్రమాదం

ఆమె గుండె లయ ప్రవాహాన్ని ఆపేసి

"ఊపిరిని"శాశ్వతంగా చంపేసింది..!

బాల్యం నుంచే

బలమైన కలలుగనేది

భవిష్యత్తు కోసం..!

బ్రతికిస్తూ.. డాక్టరయ్యింది..!

మరణం మనల్ని ఓడించిన

"మన ప్రాణం"పదిమంది

జీవితాల్ని గెలిపించాలంది..!

చిన్న వయసు...

కానీ...ఎంత పెద్ద మనసు..!

ఆమె ప్రాణం ప్రపంచానికి

ఓ విలువైన పాఠమయ్యింది.

ఐదు జీవితపు రూపాల్లో

గుండె స్పందనగా కొట్టుకుంటూనే

బ్రతుకు దీపాలను వెలిగిస్తుంది..!

ఇప్పుడు అందరూ అంటున్నారు

ఆమె బ్రతికే వుందని..!

భూమికా రెడ్డి చావలేదని

ఆమెకు ఇక చావులేదని..!

ప్రతిభలోనే కాదు..

వ్యక్తిత్వంలోనూ ఆమె డాక్టరే..!

ఆ రోడ్డు ప్రమాదం..

ఆమె స్ఫూర్తి ప్రకాశంలో

పోరాడుతూ ఓడిపోయింది..!

"ఆమె"అవయవ దానానికి

దిక్సూచిగా నిలిచిపోయింది..!!

(రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించిన డాక్టర్ భూమికా రెడ్డి అవయవదానంపై)

ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Next Story