- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

అనుకోకుండా ఆత్మీయుల్ని కోల్పోయి
అదేపనిగా ఏడుస్తున్న కళ్ళల్లో
వర్షఋతువుని చూస్తాను
ఆకలితో అలమటించి ఎండిపోయిన డొక్కల్లో
కత్తివేటుకు నెత్తురుచుక్క లేక
పాలిపోయిన బుగ్గల్లో గ్రీష్మాన్ని గమనిస్తాను
జీవనవృక్షానికి ఉన్న
ఆశల ఆకులన్నీ రాలిపోవటం చూసి శిశిరాన్నీ,
ఏ ఆచ్ఛాదనా లేక కటికనేలపై నింగికప్పు కింద
గజగజా వణికిపోతూ నిద్రిస్తోన్న
దిసమొల శరీరాల్లో హేమంతాన్నీ కనుగొంటాను
మేఘాల నగల ఊసే లేని బోసి మెడల్లో
ముక్కూ చెవులూ, చేతుల్లోనూ శరత్తునీ,
తాము పస్తులుండి తమ పిల్లలకు
పండగపూట కడుపు నిండా తిండి పెడుతూ
సంబరపడే నిరుపేదల్లో కాస్త వసంతాన్ని చూస్తాను
సూర్యబింబం తన చుట్టూ
భూమిని తిప్పుకుంటూ
ఋతుచక్రం కలిగిస్తోంది
అశ్రుబిందువు తనే స్వయంగా
కవి చుట్టూ తిరిగి తిరిగి
ఋతుషట్కం కలిగించి
దుర్భరమైన దుఃఖభారం ఓపలేకే
కాగితమ్మీద పడిపోయి భోరున విలపిస్తూ
కడకు సిరాచుక్కలా మారిపోతోంది
నలిమెల భాస్కర్
- Tags
- Poem






