అమావాస్య పున్నమయి రాదా

by Ravi |   (  Updated:2025-02-03 01:00:42  IST  )

Poem

అమావాస్య పున్నమయి రాదా
X

అమ్మ కడుపున పుట్టి

అమ్మ ఒడిలో పెరిగి

పెరిగాక నీ గుండెను

అమ్మకు గుడిగా చేయలేవా!

అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్లు

ఒకే చెట్టు కొమ్మలు

మట్టిలోని అమ్మ తనాన్ని

నింగిలోని నాన్న గుణాన్ని

అంటిపెట్టుకొని బ్రతకాలి!

కత్తి దూసి మనిషిని

గెలువాలని అనుకోకు

పూల గుత్తితో

మనసులెన్నో గెలువవచ్చు!

గుడిలో

భజనలంటూ ఊగిపోతావు

జనం మదిలో

ఉండిపోయేలా ఊతమవ్వరాదా!

తలరాత, తలరాత అంటూ

తల పట్టుక రోదిస్తావు

తలచి నీవు నీరాత రాసుకో

పట్టుదలతో అనుకున్నది సాధిస్తావు!

త్యాగం లో ఉన్న ఫలితం

ఎన్ని యాగాలు చేస్తే వస్తుంది

గాయ మయిన హృదయమే

గేయాలను పలికిస్తుంది!

మలిన పడిన దేహానికి

రంగులద్దుట కాదు

అద్దం లాంటి మనసు

మనిషికి మంచి అత్తరులు కదా!

ధనం ధనం అంటూ

దాహంతో తల్లడిస్తావు

జ్ఞాన సంపద నీకు

ఎల్లలు లేని కీర్తి నివ్వదా!

రంగు మారుతుందని తెలిసి

రాలిపోతానని తెలిసి

ఆకు చిన్నబోతుందా

రాలిన ఆకు చిగురుటాకై

చిరునవ్వు చిందిస్తుంది!

సాగుతున్న నదికి

ఎన్ని అవరోధాలు దారిలో

ఆగకుండా సాగిపోదా

సాగర గర్భం చేరేదాకా!

నేడు నెల వంకని బెంగ ఏల

పక్షమయితే నిండు చంద్రుడు పండుగే

అలవి కానిది నేడు

రేపు అందకుండా పోతుందా!

ఆగిచూస్తే అమావాస్య

పున్నమయి తిరిగిరాదా

ఓర్చుకుంటే, నేర్చుకుంటే కన్నీటి చుక్క

ఆనంద భాష్పమై పలుకరించదా!

జగ్గయ్య.జి

98495 25802

Next Story