డప్పుల దండోరా

by Ravi |   (  Updated:2025-02-03 01:30:53  IST  )

Poem

డప్పుల దండోరా
X

దడ్డెనుక... డన్... దడ్డెనుక... డన్

పొద్దు పొద్దుగాల్నే

నాలుగు బజార్ల కాడ

చాటింపు చప్పుడు

అన్నిటిలో అంతటా

కులం నిజమైన చోట

నీళ్ళ మీద దెబ్బ కొట్టినట్టు

అంతా ఒకటే అని వినసొంపు కుట్ర

నోటితో మాట్లాడి

నొసలుతో వెక్కిరించే

కారెడ్డాల మాటలు వినలేను

కలంకారీ కలలు కనలేను

"నా మాదిగ జాతి జనులారా

చెప్పలేదంటనక పోయేరు

రానున్న ఏడో తారీఖు అచ్చే శుక్రారం

పట్నంపోయి గుండె చప్పుడు

లక్ష డప్పుల దండోరా వినిపించాలె

ఇప్పటినుంచే పాలుకు ఒక్కరి చొప్పున

మన ఇస్సా పంచుకోను తయారు కాండ్రి

గిది మన మాదిగ కిష్టన్న మాటగా

చెప్పమన్నడు ఓహోయ్ "

మాదిగ పోచాలు

జీరబోని మాట జబర్ గానే ఉన్నది

గోడ మూలకు తలిగేసిన డప్పును

కడుపు మంట సెగకు కాగబెట్టి

చిర్రా చిటికెతో డప్పు కొడుతూ

ఊరూరా చాటింపేస్తున్నడు

అసలు మీకు పొల్లు మాకా

ఇక చెల్లదు గ్రామ దేవత నొల్లదు

పరికి కంప మాటలు తొండి ఆటలు

వేలు అంకర పెడితే నెయ్యి వస్తదనే

వంకరటింకర రాతలు

దాగవు గాక దాగవు

సాగవు గాక సాగవు

ఇంకో నాలుగు బజార్లో కాడికి

నడి ఎండ సూర్యునిలా

చాటింపు నిటారుగా నడిచిపోతున్నది

-శబరి

94410 78095

Next Story