స్మృతులు

by Ravi |   (  Updated:2025-01-20 00:46:03  IST  )

Poem

స్మృతులు
X

కొన్ని పాద ముద్రలు

ఆదర్శ చరిత్ర ఆనవాళ్ళుగా నిలిచిపోతాయి

పుట్టుక మొదలు గిట్టే వరకూ

ఆటుపోటుల సంద్రంలో

ఈదులాడక తప్పదు

ప్రతీ ప్రయాణంలో

మైలు రాళ్ళు వున్నట్లుగా

బ్రతుకు గమనం లోనూ

ఎన్నో గీటురాళ్ళు

మన స్వచ్ఛతను లిఖిస్తుంటాయి

కదిలి పోయే కాలం వెంట

ఎన్ని స్మృతులు తచ్చాడుతాయో

ఓ ఆశయం కోసం ఆవిరైన బ్రతుకులు

అమృత స్మృతుల్ని మిగిల్చి పోతాయి

భద్రంగా కూడేసుకున్న బ్రతుకు తాలూకు

కలలు ముక్కలవ్వటం

ఎవ్వరూ తీర్చలేని వెలతి

బాధలు ఎప్పుడూ

వందశాతం గ్రంథస్థం కావు

దృశ్యాలను చూసే కళ్ళు

మనసును తొడుక్కున్నప్పుడే

స్వప్నాలు శిథిల మవ్వటం కనిపిస్తాయి

భౌతికంగానో మానసికంగానో

గాయపడ్డ ప్రాణాలు తెరిపిన పడాలంటే..

అనివార్యంగా మరుపు లేపనాలు

మళ్లీ మళ్లీ రాసుకుంటూ వుండాలి

ఎవ్వరైనా ఇప్పుడు చెయ్యాల్సింది ఒక్కటే..

హృదయ కుహరం అహరహం

కొత్తదనాలు తొడిగెట్టు

ఆనందాల్ని పోగు చేసుకోవాలి

పెద్దలు మనకు మిగిల్చి వెళ్లిన

స్మృతుల దొంతరుల నుంచి......

డా. కటుకోఝ్వల రమేష్

994903327

Next Story