తెలంగాణ సాహిత్య జీవధార

by Ravi |   (  Updated:2025-02-24 00:30:48  IST  )

నలిమెల భాస్కర్ సాహిత్య ప్రపంచంలో ఒక అద్భుతమైన పర్యాయం. ఆయన భాషా పరిపూర్ణత, అనువాద కృషి, సమాజంపై తార్కిక దృష్టిని

తెలంగాణ సాహిత్య జీవధార
X

నలిమెల భాస్కర్ సాహిత్య ప్రపంచంలో ఒక అద్భుతమైన పర్యాయం. ఆయన భాషా పరిపూర్ణత, అనువాద కృషి, సమాజంపై తార్కిక దృష్టిని వ్యాప్తి చేసిన గొప్ప రచయితగా పేరుపొందారు. ఆయన ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు, పరిశోధకుడు. ఆయన 1956, ఏప్రిల్ 1న తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, నారాయణపూర్ గ్రామంలో బుచ్చమ్మ, రాంచంద్రం దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే ఆయన సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ సామెతలపై ఎం.ఫిల్ పూర్తిచేసి, తెలుగు, మళయాళ కుటుంబ సామెతలపై పీహెచ్‌డీ పట్టా పొందారు. తన పరిశోధనలో ఆంధ్ర, తెలంగాణ, కేరళ ప్రాంతాల భాషా, సాహిత్య సంపదలను విశ్లేషించారు.

14 భాషల్లో ప్రావీణ్యం

భాషా పరిపూర్ణతలో నలిమెల భాస్కర్ నైపుణ్యం అద్భుతం. 14 భాషల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషల్లో ఆయనతో చర్చించవచ్చు. ఈ భాషల్లో ఆయన సాహిత్యాన్ని అర్థం చేసుకొని, సాంస్కృతిక వైవిధ్యాలను విశ్లేషించగలడు. అనువాద కృషితో భారతీయ భాషా సాహిత్యాన్ని సమాజం ముందుకు తీసుకొచ్చారు. 2011లో తన ఉపన్యాసక బృందంలో పదవీ విరమణ చేసినా, సాహిత్య ప్రపంచంలో కొనసాగారు. ఆయన తెలంగాణ పదకోశం రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు, ఇది భాషా శాస్త్రానికి మంచి దారిని నిర్ధారించింది. ఆయన అనేక తెలుగు కథలు, కవితలు ఇతర భాషల్లోకి అనువదించి భారతీయ సాహిత్యాన్ని మరింత సమగ్రంగా ప్రజలకు అందించారు. 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్య పురస్కారం అందుకున్నారు.

సాహిత్య ప్రస్థానం

నలిమెల భాస్కర్ తన జీవితంలో అన్యాయాలను ఎదుర్కొంటూనే, సమాజంలో మార్పు కోసం రచనలు చేశారు. తన రచనలు, సాహిత్య ప్రస్థానంలో మార్క్సిజం, కమ్యూనిజం పుస్తకాల పఠనంతో తన దృక్పథాన్ని విస్తరించారు. ఆయన అనేక రచనలు, వ్యాసాలు, నాటకాలు రచించారు. "అద్దంలో గాంధారి", "మట్టి ముత్యాలు", "సుద్దముక్క" వంటి 17 సంకలనాలు ఆయనకు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఆయన 1998-99 లో ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుబంధంలో ‘సాహితీ సుమాల’ పేరిట వ్యాసాలు రాశారు. ఆయన రచనలు సమాజంలోని అన్యాయాలను, అసమానతలను చర్చిస్తూ వాటికి సమాధానాలను సూచించాయి. ఆయన అనువాదకునిగా కూడా ఆయన గొప్ప ఘనత సాధించారు. మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన "స్మారక శిశిగల్" నవలను "స్మారక శిలలు" పేరిట తెలుగులోకి అనువదించారు.

ఆయన ప్రతిభ, కృషి, భాషా పరిజ్ఞానం, అనువాద కృషి, మరియు సామాజిక దృష్టి తన రచనలను మరింత విలువైనవి చేస్తాయి. "పసి మనసు కోల్పోవద్దు" అనే ఆయన మాటలు, ఆయన రచనా విధానాన్ని ప్రతిబింబిస్తాయి. నలిమెల భాస్కర్ గారు సాహిత్య ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కృషులు చేసి, భారతీయ భాషా సాహిత్యాన్ని సమాజానికి చేరదీసేలా చేశారు.

(మగ్దూం మోయినుద్దీన్ జాతీయ పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా)

-డా. రవి కుమార్ చేగొని,

98669 28327

Next Story