చరిత్రలోకి తీసుకెళ్ళే ఆత్మకథ

by Disha edit |
చరిత్రలోకి తీసుకెళ్ళే ఆత్మకథ
X

ఏ ఒక్కరి ప్రయాణం ఒంటరిగా సాగదు. వారి అడుగుజాడల్లో కాలం, సమకాలీన సమాజం పాదాల్లో రేఖలుగా ముద్రితమై వుంటాయి. దీనికి జీవితచరిత్రలు, ఆత్మకథలు ఉదాహరణ రూపాలు. ఎత్తుపల్లాలు చూసిన ఆత్మకథలైతే సాహిత్యంతో పాటు చరిత్రకి కూడా ఎంతో ఉపయోగం. అటువంటి ఆత్మకథల కోవకు చెందినదే అల్లూరి సోమరాజు రాసుకున్న ‘నా జీవన యానం’.

.కలిగినోళ్ళ ఇంట్లో పుట్టినా ఊహ తెలిసేపాటికి పరిస్థితులు ‘నిలువు దోపిడీ’ చేసి రోడ్డుమీద నిలబెట్టేశాయి. ‘శ్రద్ధగా చదువుకో! కష్టపడి చదువుకో! చదువే మనిషి భవిష్యత్తును తీర్చిదిద్దేది! ఈ విషయం నీ జీవితాంతం గుర్తుంచుకో’ అని బోధించిన తండ్రి వాక్యం వేదంలా భావించి కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా కష్టపడి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యి సొంతంగా ఒక హాస్పిటల్ స్థాపించి పిల్లలను కూడా అదే బాటలో నడిపి ఉమ్మడి కుటుంబానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చి తండ్రి స్థానాన్ని బాధ్యతగా భర్తీ చేసిన డెబ్బై ఐదేళ్ళ సోమరాజు అనే వ్యక్తి జీవిత ప్రయాణమే ఈ ‘నా జీవన యానం’(ఆత్మకథ).

సోమరాజు గారి ఆత్మకథలో ఎక్కువ భాగం తండ్రి అల్లూరి సత్యనారాయణరాజు చుట్టూ తిరుగుతుంది. తండ్రి స్వాతంత్ర్య, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలలో కీలక భూమిక పోషించిన వారిలో ఒకరు. ఈయన నిస్వార్థ రాజకీయం ఎలాంటిదంటే “నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంటి ముందు ఎప్పుడూ ఎద్దుల బళ్ళు ఆగివుండేవి. నాన్నగారు ఓపిగ్గా వచ్చిన వారి సమస్యలు విని తగు సహాయం చేసేవారు. వారికి భోజనాలు కూడా మా ఇంట్లోనే! రోజుకు కనీసం నలభై యాభై మందికి భోజనం! మా నాన్నగారికి ఎమ్మెల్యేగా వచ్చే జీతం తప్ప ఏ ఆదాయం లేద”న్న(పుట:9) వాక్యాలు నాటి రాజకీయ నాయకుల నిస్వార్థతకు సాక్ష్యాలు.

ఇవే కాక చల్లపల్లి జమీందారు జగన్నాథరావు పేదలకు సంబంధించిన 7,500 ఎకరాలు స్వాధీనం చేసుకొంటే తిరిగి రైతులకు ఇప్పించడానికి జైలుకెళ్లడం, బ్రిటీషువారు కమ్యూనిస్టు నాయకుడైన పరకాల శేషావతారం గారికి(పరకాల ప్రభాకర్ తండ్రి) కాల్చివేత ఉత్తర్వులను ధిక్కరించి మరి ఆయనను కాపాడడం, చల్లపల్లి జమీందారుపై సామాన్యుడైన మండలి వెంకట కృష్ణారావును (మండలి బుద్ధ ప్రసాద్ గారి తండ్రి) నిలబెట్టి మచిలీపట్నం నుంచి గెలిపించడం(1957), అయన పిల్లలకు స్వాత్రంత్య సమరయోధుల పేర్లు(సుభాష్ చంద్రబోస్, జితేంద్ర నాథ్, ఝాన్సీ, విజయకుమారి...) పెట్టడం వంటి విషయాలు ఆయనలోని గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. అంతేకాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలకమైన పెద్ద మనుషుల ఒప్పందంలో సత్యనారాయణ రాజు గారు ఒకరు. ఈ ఆత్మకథలో తండ్రి గురించి ఎక్కువగా చెప్పడానికి అయనది ప్రజా జీవితం అన్న కారణంతో పాటు రచయితపై చూపిన ప్రభావము, ప్రేమ కూడా కారణమే.

సోమరాజు చదువు కొనసాగుతున్నప్పుడే తండ్రి మరణం కుటుంబ ‘కేంద్రాన్ని’ దెబ్బతీసింది. నిస్వార్థ రాజకీయాల ద్వారా ఉన్నదీ నిలబెట్టుకోకపోగా పోగొట్టుకోవడం జరగడంతో సామాన్యుల కుటుంబంలా ఇబ్బందులు ఎదుర్కోవలసివచ్చి పక్క రాష్ట్రంలోకి వలస పోవలసివచ్చింది. సోమరాజు చదువుకొన్న డాక్టర్ వృత్తి ద్వారా గంగావతిలో(కర్ణాటక) చిన్న క్లినిక్ పెట్టి చిత్తశుద్ధి, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడుతూ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతగా ఎదిగారు. తన పిల్లలను కూడా అదే వృత్తిలోకి తీసుకొచ్చి మరింత ప్రజాసేవను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలా అన్నదమ్ములతో కలిసి ఒక్కొక్క పరిస్థితిని చక్కబెట్టుకొన్నారు. సోమరాజు వివాహమాడిన శంకరకుమారి అనెగొంది సంస్థాన వంశీయులైన అమ్మాయి కావడం ఓ విశేషం.

సోమరాజు వైద్యం ద్వారానే కాకుండా సాహిత్య పోషణ, పేద విద్యార్థులకు ప్రోత్సాహం, జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ, లయన్ క్లబ్స్ ఏర్పాటు, ఆరోగ్య సదుపాయాల కల్పన, గ్రామీణుల ఆరోగ్య పరిరక్షణ, స్వాత్రంత్య సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు... మొదలైన సేవలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియజేస్తాయి. తండ్రి వారసత్వ ప్రజాసేవను మరో రూపం ద్వార కొనసాగించడం గానే భావించవచ్చు.

సాగుతున్న కాలం చరిత్రకు పురుడు పోస్తూ ఉంటుంది. ఈ ఆత్మకథలో అలనాటి స్వాత్రంత్య పోరాటపు అణచివేతలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసిన సామాజిక పరిస్థితులు, పెద్దమనుషుల ఒప్పందం, ముఖ్యమంత్రి కావడంలో ఉండే లాబీయింగ్ విధానాలు, తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్యని పదవీత్యుచుడిని చెయ్యడంలో జరిగిన హస్తిన చదరంగం, కొందరి నిస్వార్థ రాజకీయ త్యాగాలు... మొదలైన అంశాలు వెనకటి 50 ఏళ్ల తెలుగు రాజకీయ చరిత్ర లోకి తీసుకెళ్తాయి.

ఈ ఆత్మకథలో చివరిలోని విదేశీ, స్వదేశీ యాత్రలంటూ సాగే రెండు అధ్యాయాలు మనల్ని గ్లోబ్ ని తిప్పి చూపించినట్టు పేజీల మధ్య ప్రపంచాన్ని పరిచయం చేయిస్తాయి. అలాగే అనుబంధంగా సాగే ‘యువతకు సూచనలు’లో ‘క్లాసు పుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలు చదవాలి... ఎప్పుడూ పుస్తకాల పురుగు కారాదు గ్రౌండ్ లోకి కూడా దిగాలి... దినపత్రికలు విషయ పరిజ్ఞానం పెంచుతాయి... సొంత ఆదాయం ఉంటేనే సంసారం బడి ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కోదు... ఏ పెళ్ళైనా అభిరుచులు కలిస్తేనే హాయిగా సాగుతుంది...’(పుట:168) అన్న వాక్యాలు ‘పడిలేచిన 75 ఏళ్ళ వ్యక్తి జీవితానుభవం’గా చెబితే తప్పక యువపాఠకులకు వాస్తవికతపై దృష్టి సారించేలా దోహదం చేస్తుంది. తాతల అనుభవాలకు, తండ్రి విలువైన నిర్ణయాలకు దూరంగా ఉంటున్న సమాజం నాటినాటికి విస్తరిస్తున్న తరుణంలో ఆ లోటును, ఆ బాధ్యతను నాణ్యతగల ఆత్మకథలే తీర్చగలవు. ఆ కోవకు చెందినదే. ఈ ఆత్మకథ.

ఈ ‘జీవనయానం’లో సుమారు పావు శాతం చిత్రాలు ఉండడం తప్ప మిగిలిన అన్ని విషయాలు పాఠకులకు కేటాయించిన సమయానికి సంతృప్తికరమైన ప్రతిఫలమే దక్కుతుంది. ఈ ఆత్మకథ సోమరాజుగారి ‘బతుకు’ భావాల్ని పాఠకులకు అందించడంలో అజీజ్ గారిది(కర్నూలు) విలువైన ఉడత సహకారం. ఒకరకంగా చెప్పాలంటే పాఠకులకు ఒక పెద్దాయనతో ‘బతుకు గురించి మాట్లాడుతూ బువ్వ తింటున్నట్టే’ ఉంటుంది.

(అల్లూరి సోమరాజు రచించిన ‘నా జీవన యానం’ ఆత్మకథపై సమీక్ష వ్యాసం)

పుస్తకం: నా జీవన యానం

రచయిత: డా. సోమరాజు

పుటలు: 300

వెల: రూ. 300

ప్రతులు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు


సమీక్షకులు

మదన మోహన్ రెడ్డి బుగడూరు,

పరిశోధక విద్యార్థి,

99898 94308



Next Story

Most Viewed