సమీక్ష:అంతరించిన కైతికలు

by Disha edit |
సమీక్ష:అంతరించిన కైతికలు
X

తెలంగాణ యాసలో మంచిర్యాలకు చెందిన అల్లాడి శ్రీనివాస్ రాసిన 'గున్కపూలు' కవితాసంపుటి నిండా అద్భుత మధుర స్మృతులు మనకు దర్శనమిస్తాయి. ఆయన బాల్య జ్ఞాపకాలు ప్రతి ఒక్కరిని తమతమ చిన్ననాటి రోజులను తట్టి లేపుతాయి. అందరికీ అర్థమయ్యేలా పదచిత్రాలతో బాల్యాన్ని కవితారూపంలో చిత్రీకరించిన విధానం అబ్బురపరుస్తుంది. శ్రీనివాస్ తన 'గున్కపూల'ను గోస్కుల రమేశ్ సాహిత్య రంగానికి పరిచయం చేసిన కైతికాల ప్రక్రియలో మన ముందుకు తీసుకు వచ్చారు.

వ్యంగ్యాత్మకంగా, కవితాత్మకంగా, మెరుపులతో, కొన్ని మకుటంతో, కొన్ని మకుటం లేకుండా, జాతీయాలతో, సామెతలతో కైతికాలన్నీ దేనికదే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన ప్రముఖ సాహితీకారులు దాస్యం సేనాధిపతి 'జ్ఞాపకాల మువ్వలను కైతికాలలో బంధించి తన భావాలకు అక్షర రెక్కలు తొడిగిన' జ్ఞాపకాల సమాహారంగా' పేర్కొన్నారు. 'ప్రజల భాషలో పదనిసలు పలికించి, సజీవ సాహిత్యాన్ని సృష్టించిన కవి అల్లాడి శ్రీనివాస్' అని రమేశ్ గోస్కుల అభివర్ణించారు. ఇంతకీ ఈ కైతికాలలో ఏమున్నయి?

'బండెడు పుస్తకాలు / చదువు'కొనే' కాలం / సంచెడు పైసలకై / పోరగాండ్లకు గాలం / వారెవ్వా సదువులు / కొలువులు సూపని నెలవులు' అంటూ మొదటి కైతికంలో చదువు'కొనే' ప్రస్తుత కాలాన్ని కండ్లముందు నిలిపారు. 'లక్షలాది డబ్బుంటే / దోస్తారని భయం / అక్షరం అలా కాదు / ఇస్తుంది అభయం /అక్షరాన్ని నమ్ముకుంటే / లక్ష్మీ సరస్వతులు మీ ఇంటే' అంటూ చదువు గురించి మంచి నమ్మకాన్ని కలిగించారు. 'పొలాల్లో అపార్ట్‌మెంట్లు / ఎన్నో మొలుస్తున్నాయి / నేటి బంధాలేమో / అంబరాన కలుస్తున్నాయి /వారేవ్వా కలికాలం / ఆత్మీయతల 'బలి' కాలం' అంటూ నేటి బంధాల బలహీనతకు అద్దం పట్టారు.

'సదువు రాక నాడు / ఏలి ముద్రలాయే / సదువుకున్నా నేడు / ఏలి ముద్రేనాయే / ఓహో కలికాలమా / నీది చక్ర గమనమా' అంటూ టెక్నాలజీ ఎంతో పెరిగినా కూడా వేలిముద్ర నేడు కూడా అవసరమైందనడం బాగుంది. తన బాల్యాన్ని గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఇలా అన్నారు 'లాగులు సినిగే దాంక / జారుడు బండ జారిన /మూతిలకచ్చేదాంక / ముక్కు సీమిడి కారినా / సెరు కట్టకు తిరుక్కుంటా / ఈత పండ్లు తెంపిన / గౌండ్లోల్ల మామ రాకె గట్టి / ముంజలు పంపిచ్చిన /గమ్మత్తే సిన్నప్పుడు' అంటూనే ఇంకా రేడియోలో జనరంజని, టీవీలో చిత్రలహరిని కైతికాలతో గుర్తు చేశారు. 'గున్కపూలు' చదువుతున్నంత సేపు రచయిత అల్లాడి శ్రీనివాస్ సాహిత్యాభిరుచి, తెలంగాణ యాసపై గల అభిమానం, అభిరుచి, భాషపై గల పట్టు, సామాజిక స్పృహ తొణికిసలాడుతూ దర్శనమిస్తాయి. ఇలాంటి గ్రంథాలు వారి నుంచి మరిన్ని రావాలని అభిలషిస్తూ అల్లాడి శ్రీనివాస్‌గారికి అభినందనలు.

ప్రతులకు:

వైద్య సుజాత, 3-408/16-12

హైటెక్ కాలనీ, మంచిర్యాల్-695208

834166982

నవోదయ, నవ తెలంగాణ, నవ చేతన పుస్తక కేంద్రాలు

పేజీలు - 55, వెల - 50/-

పాలపిట్ట బుక్స్

16-11-20/6/1/1, 403, విజయశ్రీ రెసిడెన్సీ

సలీంనగర్, మలక్‌పేట్

హైదరాబాద్-500036

984878 7284

[email protected]

సమీక్ష


శ్రీలతారమేశ్ గోస్కుల

హుజురాబాద్

70139 43368


Next Story

Most Viewed