కథా-సంవేదన: చెరగని నంబర్లు

by Ravi |
కథా-సంవేదన: చెరగని నంబర్లు
X

కరి కోసం కాంటాక్ట్ లిస్ట్ తెరిచి చూస్తున్నప్పుడు మరొకరి పేరు కనిపిస్తుంది. ఎవరి కోసం వెతుకుతున్నామో కూడా మరిచిపోతాం. ఆ కనిపించిన మరొకరి గురించిన ఆలోచనలు పరుగెడతాయి. అలా కనిపించిన పేరు గల వ్యక్తి చిన్నప్పటి స్నేహితుడు కావొచ్చు. ఉద్యోగం చేసినప్పుడు కలిసి పనిచేసిన న్యాయమూర్తి కావొచ్చు. పరిచయం వున్న న్యాయవాది కావొచ్చు. క్లాస్‌మేట్ కావొచ్చు.కవి మిత్రుడు కావొచ్చు. ఆ వ్యక్తులు భౌతిక ప్రపంచంలో లేరు.

ఎప్పుడో వెళ్లిపోయిన వ్యక్తులు కొందరు. ఇటీవలే చనిపోయిన వ్యక్తులు మరికొందరు. వాళ్ల గురించిన ఆలోచనలు, జ్ఞాపకాలు వెంటాడుతాయి. ఒక చిన్న చిప్ లోని వాళ్ల పేర్లు నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తాయి. వాళ్లు చిన్న చిప్‌లోనే కాదు. నా మెదడు చిప్‌లో కూడా వుంటారు. ఈ చిన్న మొబైల్ ఫోన్‌లోని చిప్ వారిని ఎరుక పరుస్తుంది.

*

చాలా వాట్సాప్ గ్రూపులలో వుండటం వల్ల, ఎక్కువ కలవరపెడుతున్న సమాచారం మరణ వార్తలు. మా ఊరి గ్రూపులో వూరికి సంబంధించిన వ్యక్తుల మరణ వార్తలు కనిపిస్తాయి. చనిపోయిన కవుల వార్తలు కవుల గ్రూపులో, చనిపోయిన న్యాయమూర్తుల వార్తలు న్యాయమూర్తుల గ్రూపులో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కలవరపెడుతూ ఉంటాయి. వాళ్ల హావభావాలు, ప్రవర్తన, స్నేహ మాధుర్యం అన్నీ గుర్తుకొస్తాయి. ఈ మధ్య ఓ కవి మిత్రుడి పేరూ, నంబర్ కన్పించాయి. ఆయన భావావేశం, ఆయన కవిత్వంలోని పత్రికలు అన్ని గుర్తుకొచ్చాయి. ఇలా అందరి గురించి ఆలోచిస్తూ వెతకాల్సిన వ్యక్తి నంబరు మరిచిపోతూ ఉంటాను.

*

కరోనా కాలంలో మా చిన్నాన్న చనిపోయారు. రోజూ మరణాలు. బయటకు వెళ్లలేని పరిస్థితి. అన్నయ్య కొడుకు పిల్లలు అర్ధరాత్రి దహనం చేసిన ఫొటోలు. మనస్సు కూడా ఎడం అయిపోయింది. వెళ్లలేని పరిస్థితి కల్పించిన ప్రకృతి మీద కోపం. ఏమీ చేయలేని అసహాయత. చనిపోయిన వ్యక్తుల నంబర్లు నేను ఫోన్ నుంచి తొలగించను. అవి అలాగే వుంటాయి. మా చిన్నాన్న నంబరును తొలగించే ప్రశ్నే లేదు.

చాలా మంది చిరునామాలు చెరిగిపోయాయి. ఫోన్‌లో నంబర్లు వుంటాయి. ఆ నంబర్ నుంచి కాల్ రాదు. వచ్చినా ఆ గొంతు వినిపించదు. నా ఫోన్ నుంచి ఆ నంబర్లకి కాల్ వెళ్లదు. వెళ్లినా ఆ గొంతు వినిపించదు. వారి నంబర్లు ఫోన్‌లో కనిపించినప్పుడల్లా 'ఇక లేరు, ఇక లేరు' అన్న మాటలు ఎక్కడి నుంచో విన్పిస్తాయి. నా మనస్సులో వాళ్లు ఉన్నారని నా హృదయం ఘోషిస్తుంది. నా మనస్సులో వారి చిరునామాలే కాదు. వారి ఆనవాళ్లూ చెరిగిపోవు.

*

ఎవరో ఒకరి నంబరు కోసం వెతుకుతున్నప్పుడు పోయిన వ్యక్తుల నంబర్లు కన్పిస్తాయి. ఇంకా వాళ్లు బతికి ఉన్నారని అనుకుంటాను. ఆ విధంగా అనుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వారు తాము ఇంకా నా మనసులో వున్నారన్నట్టుగా సెల్ చెబుతుంది. మరణాన్ని అంగీకరించడానికి చాలా సమయం పడుతుంది. అది ఊహిస్తేనే ఒంటరితనం ఆవహిస్తుంది.

బహుశా మనం ఒంటరితనానికి భయపడినంతగా మరణానికి భయపడకపోవచ్చు. సన్నిహితులు మరణించినారని తెలిస్తే ఒంటరితనం ఆవహిస్తుంది. వాళ్లు వున్నారన్న భావన ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే నా సెల్‌ఫోన్‌లో వ్యక్తులు చెరిగిపోరు. వారి నంబర్లూ చెరిగిపోవు. మా చిన్నాన్న నెంబరు మాదిరిగా నా మనసులాగే నా ఫోన్‌లోని స్థలం కూడా విశాలమే.


మంగారి రాజేందర్ జింబో

94404 83001

Next Story