కథా-సంవేదన:డాబా

by Ravi |
కథా-సంవేదన:డాబా
X

సెప్టెంబర్ నెల వచ్చేసింది. కానీ, సూర్యుడు తన ప్రతాపాన్ని తగ్గించలేదు. సరికదా, విపరీతంగా మండిపోతున్నాడు. ఎన్ని వర్షాలు పడినా భూతాపం తగ్గడం లేదు. ఈ వేడిని చూస్తే నా చిన్నప్పటి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. వంటింటికీ, పెద్దింటికీ మధ్యన చాలా ఖాళీ స్థలం ఉండేది. అక్కడ మంచాలు వేసుకొని పడుకునేవాళ్లం. ఇంట్లో రెండు మూడు సీలింగ్ ఫ్యాన్లు ఉండేవి. వాటి కింద పెద్దవాళ్లు పడుకునే వాళ్లు. పిల్లలం మేం మాత్రం ఆరుబయట పడుకునేందుకే ఇష్టపడే వాళ్ళం.

*

ఇంటర్మీడియట్ దశకి వచ్చే వరకు ఆరు బయట కన్నా బంగ్లా మీద డాబాలో పడుకోవడం ఇష్టంగా వుండేది. బంగ్లా మీదకి పోవడానికి బయట నుంచే మెట్లుండేవి. మా దోస్తులు కూడా రాత్రి కాగానే ఇక్కడికి వచ్చేవారు. ఎండాకాలం సెలవుల్లో దాదాపుగా మా బంగ్లా మీదే వుండేవారు. బంగ్లాకి ముందు వెనక వైపు డాబాలు ఉండేవి. రెండు వైపులా నేను మా స్నేహితులు పడుకునేవాళ్లం. సూర్యుడు వచ్చి తీక్షణమైన ధృక్కులతో చూస్తూ నిద్రలేపే దాకా లేచేవాళ్లం కాదు. చాలా సేపు పొద్దెక్కే వరకు పడుకుందామనుకునే మిత్రులు వెనక వైపు దాబాలో పడుకునేవాళ్లు. నాలుగైదు పరుపులు, పక్క బట్టలు వుండేవి. రోజూ సాయంత్రం దాబాలపై నీళ్లు చల్లించడం మా అందరికీ ఒక డ్యూటీ. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పరుపులు పరుచుకొని మాట్లాడుకుంటూ పడుకునేవాళ్లం.

*

మా రాజేశ్వరుని సుప్రభాతం గానీ, పాలు పితకడానికి వచ్చిన మా మల్లయ్య గట్టి మాటలు గానీ మాకెవరికీ వినిపించేవి కావు. సూర్యుడు సుర్రుమనిపించేదాకా నిద్ర లేచేవాళ్లం కాదు. రాత్రిళ్లు ఆకాశంలో చంద్రుడు, చుక్కలు మమ్మల్ని పలకరించేది. చల్లగా వీచే గాలి మమ్మల్ని పరవశింపచేసేది. కొబ్బరాకులు సన్నగా గరగరమంటూ సంగీతం వినిపించేవి. యూనివర్సిటీకి వచ్చిన తరువాత మిత్రుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆరుబయట మిత్రులతో కలిసి పడుకోవడం కూడా పూర్తిగా తగ్గిపోయింది.

*

పెళ్లయిన తరువాత కూడా వేసవి రాత్రిళ్లు ఆరుబయటే పడుకునేవాళ్లం. అనుకోని వర్షపు జల్లులు అప్పుడప్పుడు మమ్మల్ని లోపలికి పరిగెత్తించేవి. ఆ రోజుల్లో ఆరుబయట పడుకోవడం ఎంత మాత్రమూ ఇబ్బందిగా అనిపించేది కాదు. ఇంటి ముందు పందిరికి అల్లుకున్న మల్లెతీగ దానికింద నుంచి నడిచినప్పుడల్లా మత్తును కలిగించేది. ఇప్పుడు కూడా టెర్రస్ వున్నప్పటికీ, వేడి మండుతున్నప్పటీకి ఆరు బయట మాత్రం పడుకోవడం లేదు. విశాలమైన నీలాకాశాన్ని చూసే యోగ్యత లేకుండా పోయింది. చుక్కలు, చంద్రులు అపరిచితులైపోయారు. మల్లెల వాసనలు రూం ఫ్రెష్‌నర్స్ మధ్యన నలిగిపోయాయి. చల్లగా వీచే ఏసీ, మెత్తటి పరుపులు అప్పటి ఆనందాన్ని ఇవ్వడం లేదు. అన్ని కృత్రిమమైపోయాయి. గాలి, వెలుతురు, పరిమళాలు కూడా.

*

ఎప్పుడైనా ఆరుబయట పడుకోవాలని అనుకుంటాం గానీ పడుకోలేం. నెపం దోమల మీదకి తోస్తాం. పురుగుల మీదకి తోస్తాం. కారణం వాతావరణంలో వచ్చిన మార్పులా? నాలోని మార్పులా? కారణాలేవైనప్పటికీ ఆరుబయట నిద్రించడం అనేది ఒక మంచి మధురమైన స్మృతిగా మిగిలిపోయింది. పెరుగుతున్న వయస్సురీత్యా ఆరుబయట పడుకోవడం లేదా అంటే ఇప్పటి పిల్లలు కూడా ఆరుబయట పడుకోవడం లేదు. మారిపోతున్న వాతావరణ కాలుష్య పరిస్థితులే కారణమా? ఏమో?

మంగారి రాజేందర్ జింబో

94404 83001

Next Story