జ్ఞాపకాల పండుగా .. 'జాతర'

by Disha edit |
జ్ఞాపకాల పండుగా .. జాతర
X

జాతర” బతుకు పాటల కోరస్ ట్యాగ్ లైన్‌తో ఈ కవితా సంకలనం శ్రీనివాస్ వాసుదేవ్ నుండి వచ్చిన రెండవ సంకలనం. శ్రీనివాస్ మంచి కవి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఏపీ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. పరిచయం అక్కరలేని సాహితివేత్త. మానవతా దృక్పథం గల మంచి మనిషి. సందర్భం ఏదైనా, దానికి తగ్గ కవిత్వం తన కలం నుండి జాలువారుతుంది. ఈ కవితా సంపుటిలో విభిన్న కోణాలకు సంబంధించిన కవితా వస్తువు కనబడుతుంది. నగలో కంసాలి ఓర్పుగా వజ్రాల్ని పొదిగినట్టుగా తన కవిత్వాన్ని పేర్చుతాడు. సందర్భం, సంఘటన జరిగినప్పుడు అక్షరాల్ని మూటగట్టుకుని అక్షర సైన్యంతో ఒకడుగా ప్రవాహంలో కలిసిపోతాడు. ఎంతో ఆర్ధతతో తన కవిత్వాన్ని అక్షరీకరిస్తాడు ఈ కవి.

జీవితమే ఓ జాతరయితే ఆఖరికి.. బతికుండడమే ఓ జాతర (జాతర). నిజమే జాతర అనగానే అన్ని రకాల సమ్మేళనాలు మిళితమై ఉంటాయి. ఉత్సాహం కేరింత, సంబురం, ఆట, పాట, ఆనందమే తప్ప మరేది కానరాదు. ఒక్కరోజు లేదా రెండు రోజులు జరిగే ఉత్సవం. ఆ రెండు రోజులు అందరితో కలిసి ఊరు ఊరంతా జరుపుకునే వేడుక. ఆనందానికి రంగులు పూసేదే జాతర. జీవితం కూడా అంతే… కష్టం, సుఖం, సంతోషం, బాధ అనేకనేక కోణాల్లో దర్శనమిస్తుంది. అన్నిటినీ అనుభవిస్తూ. అన్నిటినీ ఎదుర్కొంటూ బతికి ఉండడమే జీవితపు జాతర.

కవి భావన ఎంత లోతుగా ఉంటే ఊహలు కూడా అంతా లోతుగా వస్తాయి. ఆధునిక కవిత్వానికి ఆత్మ ఏదంటే ఓ కొత్త ఊహ భాష, శబ్ద సౌందర్యం లయ ఇవన్నీ కలగల్సినప్పుడే మంచి కవిత్వం కవిత్వీకరించబడుతుంది. శ్రీనివాస్ కవిత్వం కూడా ఈ కోవకే చెందినది. తన చుట్టూ ఉన్నా ప్రపంచాన్ని గమనిస్తూ, పరిస్థితులను అర్థం చేసుకుంటూ కవితలన్నీ రాస్తుంటారు. A Teacher introduces us to a new vision of life to make us as sharp as a knife __Mridulika Ganguly అన్నట్టు శ్రీనివాస్ కవి గాను గురువుగాను తన అనుభవ సంపదతో కొత్త తలుపుల తలుపులను తెరిచి, జీవిత దృక్పధాన్ని సుగమం చేస్తూ సానబెట్టిన కత్తిగా తన కవితలు రాస్తున్నారు. కవితలోకి వెళ్ళితే

ఎప్పుడూ ఉండే నిట్టూర్పులతో/ అప్పుడప్పుడూ వచ్చే ఓదార్పులతో/ ఇంతేనేమో ఈ జీవితం/ గుండె నిండుగా శ్వాస తీసుకుని/ మళ్లీ ప్రారంభిద్దామా/ మన నడకని/ పునరావృతమయ్యే పర్వాలలోకి/ మోనాటనీ వీడని రొటీన్ లోకి. కోరుకున్న జీవితం సాధించాలంటే ఎన్నో ఇష్టమైనవి వదులుకోవాల్సిందే. మనం ఊహించింది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. జీవితం ఎప్పుడూ నిట్టూర్పులతో, ఓదార్పులతో సాగుతూనే ఉంటుంది. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సంతోషం వచ్చినప్పుడు పొంగి పోకూడదు, జయపజయాల గురించి ఆలోచించక ముందుకు సాగుతూనే ఉండాలి. అప్పుడే మనం కోరుకున్న జీవితాన్ని, గమ్యాన్ని పొందగలుగుతాం.

తన కవితలు చదువుతుంటే ఉద్విగ్నంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది ఈ సమాజం మారాలని ఉన్నతం కావాలనే కాంక్ష తన కవితలో కనిపిస్తుంది. ఇంకొక కవితలో… అమ్ముకోలేని కన్నీళ్లు,/ కొనుక్కోలేని వర్షపు చుక్కలూ/ అవిశ్రాంత సాలెగూళ్ళ నుంచీ/ ఓ పాఠం అవగతమయ్యాక/ ఇక చెప్పడానికే ఏముండదు/ కెరటాలేం చెప్పవు-ప్రయత్నించమని తప్ప నదులే చెప్పవు/ ప్రవహించమని తప్ప బొమికల గూడు ఆశ్రమం/ బంతుల కూడు ఆశ్రమం.

శ్రీనివాస్ కవిత్వం చదువుతున్నంత సేపు మనలను ఆలోచింపజేస్తుంది. తన కవిత్వంలో నిండైన గుండె చప్పుడు అందంగా ధ్వనిస్తుంది. అమ్మ! బతుకుతానే,/ బుల్లెట్ లేని బ్రెడ్ ముక్క కోసమో/ రక్తమంటని రోటి ముక్కకోసంమో…

నేడు జరుగుతున్న జాత్యహంకార మారణ హోమంలో అభం శుభం తెలియని ఓ చిన్నారి మనోవేదన, అక్రందనలను చూస్తూనే ఉన్నాం. మానవత్వం మంటగలిపి కొట్టుకుపోతున్న మానవీయ విలువల్ని తన కవితలలో సమాజ దృష్టి సాహిత్య సృష్టి సమాంతరంగా సాగి మంచి కవిగా రూపొందాడు శ్రీనివాస్. ప్రజా సమస్యల పట్ల, ప్రజా గొంతుకగా తన కలం ద్వారా నిలదీస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి అంశాల మీద సంకెళ్ళ మీదా కవి తన గోతును విప్పుతున్నారు . గాజాలో ఎన్నో మారణహోమాలు జరిగి, ఎంతో మంది దిక్కులేని ,దీన స్థితిలోకి నెట్టివేయబడ్డారు . కవి ఎప్పుడు ప్రజా శ్రేయస్సు కోరుతూ సమాజ హితుడై ఉండాలి , సమాజాన్ని మేల్కొల్పు కల్పిస్తుండాలి, ఆ లక్షణాలు శ్రీనివాస్ కవిత్వంలో పుష్కలంగా కనిపిస్తాయి .

మనిషి జీవితం ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది . కొద్ది కాలం తర్వాత తన పేరు లోకం లో కనుమరుగవుతుంది. మనిషి మాట్లాడిన మాటకు మాత్రం మరణం లేదు , అలాగే కవి రాసిన వాక్యానికి ఏ వాక్యమూ కూడా నశించకుండా తరతరాలకు నిలిచిపోతుందని శ్రీనివాస్ వాసుదేవ్ తాను చెప్పదలుచుకున్న విషయాల్ని సూటిగా చెప్పుతారు . తాను రాసిన కవితా సంకలనం జాతర కూడా తెలుగు కవిత్వాకాశంలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు .

ప్రతులకు

జాతర

పుటలు 120 కవితలు 50

కవి శ్రీనివాస్ వాసుదేవ్

99019 91363


సమీక్షకులు

గాజోజి శ్రీనివాస్

99484 83560



Next Story

Most Viewed