'పల్లె' గెలుపు నల్లేరు మీద నడకేనా?

by Disha Web Desk 12 |
పల్లె గెలుపు నల్లేరు మీద నడకేనా?
X

దిశ ప్రతినిధి, అనంతపురం/పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఒకప్పుడు చిన్న కుగ్రామమైన పుట్టపర్తికి ఆ స్థాయి గుర్తింపు రావడానికి, జిల్లా కేంద్రంగా మారడానికి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా చేసిన కృషే ప్రధాన కారణం. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు ఎమ్మెల్యేగా పల్లె రఘునాథరెడ్డి గెలుపొంది మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ తరఫున తిరిగి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ కూటమి తరపున పల్లె రఘునాథ రెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే పల్లె సింధూరా రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకేనని చెప్పవచ్చు.

టీడీపీ నేతలంతా ఏకతాటిపైకి..

టీడీపీలోని పలువురు నేతలు టికెట్ ఆశించారు. ముఖ్యంగా మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న, సామకోటి ఆదినారాయణ, సిమెంట్ పోలన్న వంటి వారు పార్టీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే, ఈ ఒక్కసారీ తనకే టికెట్ ఇవ్వాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పట్టుబట్టారు. దీంతో మధ్యేమార్గంగా ఆయన కోడలు పల్లె సింధూరా రెడ్డికి పార్టీ అధినాయకత్వం టికెట్ కేటాయించింది. దీన్ని జీర్ణించుకోలేని కొందరు పార్టీ నేతలు అసమ్మతి రాగం ఆలపించారు. ముఖ్యంగా వడ్డెర్లకు ఈసారి టికెట్ లభిస్తుందని అంతా భావించారు. అలా కాకుండా పల్లె కుటుంబానికే తిరిగి టికెట్ కేటాయించడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. సిమెంట్ పోలన్న అయితే రెబల్ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. రోజులు గడిచే కొద్దీ పార్టీలో పరిస్థితులన్నీ సర్దుకుంటూ వచ్చాయి. సిమెంట్ పోలన్న కూడా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అందరూ ఏకతాటి పైకి వచ్చి పల్లె సింధూరారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. దీంతో ఆమె గెలుపు అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి.

పార్టీలోకి వెల్లువలా వలసలు

నియోజకవర్గ టీడీపీలోకి నిత్యం వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీని వీడి రామలక్ష్మణ్ సోదరులు టీడీపీలో చేరడం పల్లె సింధూరాకు కలిసి వచ్చే అంశం. అలాగే మాజీ ఎమ్మెల్యే పాముదుర్తి రవీంద్రారెడ్డి కుమారుడు ఇంద్రజిత్ రెడ్డి వర్గీయులు, లోచర్ల విజయభాస్కర్ రెడ్డి వర్గీయులు వైసీపీని వీడి టీడీపీలో చేరడం పల్లె సింధూర గెలుపు అవకాశాలను మరింత మెరుగుపరిచిందని చెప్పవచ్చు. అలాగే 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సోమశేఖర్ రెడ్డి వర్గీయులు కూడా టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర విజయం కోసమే పరోక్షంగా కృషి చేస్తున్నారు. దాదాపు ప్రతిరోజూ టీడీపీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తమ్మీద తన కోడలి గెలుపు కోసం మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెరవెనుక చక్రం తిప్పుతున్నా రని చెప్పవచ్చు.

ఓటమి భయంలో వైసీపీ అభ్యర్థి

వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఐదేళ్లుగా.. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఆయన పెద్దగా చేసిందేమీ లేదనే అభిప్రాయాలే ప్రజల్లో ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. పైగా, పంచభూతాలనూ స్వాహా చేశారనే విమర్శలున్నాయి. అందుకే యువగళం పాదయాత్ర సమయంలో 'దోపిడీకుంట' అని ఆయనకు నారా లోకేష్ పేరు పెట్టారు. భూకబ్జాలు, ఇసుక, మట్టి దోపిడీ, సెటిల్మెంట్లు వంటి పలు అంశాలు దుద్దుకుంట పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. దీనికి తోడు పార్టీలోనూ పలువురు నాయకులు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా శ్రీధర్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుం టున్నారు.

అందుకే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రత్యర్థి పార్టీకే సహకరిస్తున్నారు. ఇదంతా అధికార వైసీపీకి నష్టం కలగజేస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా బేల పలుకులు పలుకుతోంటే, పార్టీ శ్రేణుల్లో మాత్రం ఆత్మవిశ్వాసం ఎక్కడ నుంచి వస్తుందనే ప్రశ్న ఉదయిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు దుద్దుకుంటను ముంచబోతోందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా కొన్ని ఓట్లు చీల్చే అవకాశముంటుంది. ఇన్ని సమీకరణల మధ్య పల్లె సింధూరా రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది.

Next Story