- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బహుజనుల హితం కోసం..
Buddha Dharma Saram (Essence of Buddhism) Book Review

ఇటీవల కాలంలో బౌద్ధ ధర్మం పట్ల తెలుగు ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. జపనీస్ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు తెలుగులో ముద్రితమై ఎక్కువగా అమ్ముడు పోవడం దీనికి ఓ నిదర్శనం. జెన్, ఇచిగో ఇచి, వాబి సాబీ, డోంట్ వర్రీ, ఆనందంగా జీవించడం ఎలా.. వంటి పుస్తకాల అమ్మకాలు ముందువరుసలో ఉన్నాయి.
జపనీస్ వ్యక్తిత్వ వికాస పుస్తకాల మూల సారాంశం భారతదేశంలో పుట్టి ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరించిన బౌద్ధ ధర్మమే. మనిషి కేంద్రంగా, నైతిక ప్రవర్తనే ప్రధాన అంశంగా బౌద్ధ ధర్మం ఉంటుంది.
సత్యం కానిది.. బుద్ధుని బోధ కాదు!
కుల వ్యవస్థను విభేదించి సర్వమానవ సమానత్వాన్ని అందించేదే బౌద్ధం. హేతుబద్ధం కానిది సత్యం కానిది ఏది బుద్ధుని బోధ కాదు. అందుకే, విశాల దృక్పథాన్ని అత్యున్నత జీవన విధానాన్ని కోరుకునేవారు వివిధ ధర్మాలతో పాటు బుద్ధుని బోధనల పట్ల ఆకర్షితులవుతున్నారు. బౌద్ధులు కానివారు బౌద్ధాన్ని అర్ధం చేసుకోవడం కష్టమైన విషయమే. బుద్ధుని బోధనల పట్ల ఆసక్తి కలిగి బౌద్ధాన్ని సులభంగా అర్థం చేసుకునే వారికోసం తెలుగులో బుద్ధ ధర్మ సారం అనే పేరుతో ఒక మంచి పుస్తకం అందుబాటులోకి వచ్చింది. బౌద్ధ సారాంశం మొత్తం ఈ చిన్న పుస్తకంలో ఉంటుంది.
వందేళ్ల నాటి పుస్తకం.. నేడు తెలుగులో..
మద్రాసు క్రైస్తవ కళాశాల భౌతికశాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ పి. లక్ష్మీ నరసు 1907లో The Essence of Buddhism పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఆమె అసాధారణ మేధావి, గొప్ప సంఘసంస్కర్త. ఆయనకు బౌద్ధం పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. బౌద్ధాన్ని లోతుగా అధ్యయనం చేసి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. దక్షిణ భారతదేశ పత్రికల్లో వ్యాసాలు ప్రచురించారు. ఈ వ్యాసాలన్నిటినీ కలిపి The Essence of Buddhism పేరుతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చాయి. బౌద్ధ ధర్మంలోని ప్రధానమైన విషయాలను ఒకచోట కూర్చి, వాటిని ఆధునిక విజ్ఞానం వెలుగులో వివరించటం ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశం అని ఆమె తన ముందుమాటలో చెప్పారు.
అంబేద్కర్ ప్రశంసలు పొందిన పుస్తకం!
ఈ పుస్తకాన్ని 1948లో పునర్ముద్రించారు. పునర్ముద్రణ పుస్తకానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముందుమాట రాస్తూ.. ఈ మధ్యకాలంలో భారత దేశంలో వివిధ ప్రాంతాలకు చెందినవారు బౌద్ధంపై ఒక మంచి పుస్తకం సూచించమని అడుగుతున్నారు. అటువంటి వారికి నేను ఏమాత్రం తటపాయించకుండా ఈ పుస్తకాన్ని సూచిస్తాను.. బుద్ధిజంపై ఇంతవరకు వెలువడిన పుస్తకాల్లో ఇది అత్యుత్తమం అని నేను అనుకుంటున్నాను అని అన్నారు. ఈ పుస్తకానికి దక్కిన అత్యున్నత ప్రశంస ఇది. ఇంత మంచి పుస్తకాన్ని డి. చంద్రశేఖర్ తెలుగు అనువాదం చేసి పాఠకుల ముందు ఉంచటం గొప్ప విషయం.
బౌద్ధ ధర్మ సారమంతా ఒక్క పుస్తకంలో..
బౌద్ధంలో నైతికత వ్యక్తి కేంద్రమైంది. మానవుని నైతిక ప్రవర్తన సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. పరిపూర్ణత సాధించిన మానవజాతి మనిషికి స్వర్గం, మానవజాతి పతనమే మనిషికి నరకం. అందుకే సత్ప్రవర్తన, మానసిక నిబద్ధత బౌద్ధానికి మూల స్తంభాలు.. బుద్ధుడు బోధించిన సత్యాలు ఆయన మూర్తిమత్వ సారాంశం తప్ప మరేదీ కాదంటారు ఈ పుస్తకంలో రచయిత. నేను బోధించే ధర్మం అందరి పట్ల సమాన ఆధార ఆదరణ కలిగిన ధర్మం. ఇది మంచివారిని చెడ్డవారిని సంపన్నులను పేదలను ఒకే విధంగా విముక్తి చేస్తుంది అంటారు బుద్ధుడు. బహుజనుల హితం కోసం.. బహుజనుల సుఖం కోసం కరుణామయులై ధర్మాన్ని బోధించండి అంటూ తన శిష్యులను ఆదేశించారు. మనిషి నిరంతరం మంచి ఆలోచనలు చేయాలి. ఈ ఆలోచనలు ఎలా సాధన చేయాలో బుద్ధ ధర్మసారం చెబుతుంది. పదమూడు అధ్యాయాలతో కేవలం 144 పేజీల ఈ పుస్తకంలో జీవితాన్ని సమూలంగా మార్చగలిగే శక్తివంతమైన ఎన్నో పదాలు కనిపిస్తాయి.
పుస్తకం: బుద్ధ ధర్మ సారం
రచయిత: పి. లక్ష్మీ నరసు (ఆంగ్ల మూలం) ,
అనువాదం: డి. చంద్రశేఖర్
పేజీలు 144, వెల రూ. 150
ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు,
సమీక్షకులు
శిఖా సునీల్ కుమార్
99081 93534






