- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలకు విలువలు నేర్పే కథలు..
బాలలలో నైతిక విలువలు, మానవతా భావాలు, కుటుంబ అనుబంధాలను పెంపొందించడంలో బాలసాహిత్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

బాలలలో నైతిక విలువలు, మానవతా భావాలు, కుటుంబ అనుబంధాలను పెంపొందించడంలో బాలసాహిత్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తెలుగు బాలసాహిత్యంలో ప్రముఖ స్థానం కలిగిన డా. దాసరి వెంకటరమణ రచించిన ‘అమ్మ మనసు’ కథాసంపుటిలోని కథలు మానవ సంబంధాల ప్రాధాన్యాన్ని చక్కగా ప్రతిబింబిస్తాయి. తల్లి ప్రేమ, కుటుంబ బంధాలు, దయ, కృతజ్ఞత వంటి విలువలను ఈ కథలు పిల్లలకు సులభంగా చేరవేస్తాయి.
కల్మష మెరుగని స్వచ్ఛమైన మనస్సు గల బాలలకు చక్కని జీవితాన్ని ప్రసాదించగల సాహిత్యం ఎంతో అవసరం అని చెబుతారు బాల సాహిత్యకారుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. దాసరి వెంకట రమణ. ఈయన బాలల కోసం వందల కథలను రాశారు. మారుతున్న కుటుంబ జీవన గమనం, సంస్కృతి సాంప్రదాయాలు, మానవతా విలువల వినాశనం, ఆధునిక విద్యా విధానం వంటి వాటి మధ్య నలిగిపోతున్న పిల్లలకు ఉపయోగపడేలా సాహిత్యం సృష్టించారు. ఈయన రాసినవి ఎక్కువగా చందమామ పత్రికలో ప్రచురితమయ్యాయి. అలా వివిధ పత్రికలలో ప్రచురితమైన బాలల కథాసంపుటియే అమ్మ మనసు ఇందులోని కథలలో ఉండే మానవ సంబంధాలను పరిశీలిద్దాం.
అమ్మ మనసు కథలో..
కిశోర్ అనే విద్యార్థి తరచూ బడికి ఎగ్గొట్టి బయట ఆడుకుంటూ ఉండేవాడు. ఒక రోజు అతనిని చూసిన ఓ ముని, “నువ్వు భవిష్యత్తులో గొప్పవాడివి అవుతావు” అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు. “ప్రచండమైన వేడిని తానే భరించి, తనను ఆశ్రయించిన వారికి చలువను పంచేది ఎవరు?” అని అడిగి, సమాధానం ఆలోచించమని చెప్పాడు. కిశోర్ ఆ ప్రశ్నకు జవాబు కోసం ఎంతో ఆలోచించాడు. కొందరు మర్రిచెట్టు అని చెప్పారు. రాత్రి చందమామను చూసి అదే సమాధానం కావచ్చని అనుకున్నాడు. కానీ తన జీవితాన్ని మార్చే జవాబు అది కాదని భావించాడు. అప్పుడే అతని తల్లి తన కోసం పడుతున్న కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి లేని తన కుటుంబంలో తల్లే అన్నీ అయి, ఎన్నో కష్టాలను భరిస్తూ తనను పెంచుతోందని కిశోర్ గ్రహించాడు. వెంటనే ముని ప్రశ్నకు సరైన సమాధానం “అమ్మ మనసు” అని అర్థమైంది. తన బాధలను తానే భరిస్తూ, పిల్లలకు సుఖం, ప్రేమ, రక్షణను అందించేది తల్లేనని తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి కిశోర్ బాగా చదివి, తల్లి ఆశయాన్ని నెరవేర్చి గొప్పవాడయ్యాడు. ఈ కథలో తండ్రి లేని పిల్లలు బాధ్యత లేకుండా తయారవుతారని, తల్లి ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. తల్లి ప్రేమ, పిల్లల భవిష్యత్తు కోసం పడే తపన ఇందులో కనిపిస్తాయి. సమాజంలో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అని కథలో దాగివున్న సారాంశం.
మాట నేర్పరి కథలో..
మనిషికి సంపద పెరిగే కొద్దీ గుణం ఎలా మారిపోతుందో తెలిపే కథ ఇది. పేదవాడైన శరభయ్య, తనకన్నా పేదవాడు యాచించగా “నా దగ్గర ధనం ఉంటే తప్పకుండా సహాయం చేసేవాడిని” అని చెప్పేవాడు. అతని మాటలు విని యమధర్మరాజు అతడిని స్వర్గానికి పంపాలని అనుకుంటాడు. అయితే నారదుడు, “వాడికి సంపద ఇచ్చి పరీక్షిస్తే అసలు స్వభావం తెలుస్తుంది” అని సూచిస్తాడు. దాంతో శరభయ్యను భూమిపై రైతుగా పుట్టిస్తారు. యాచకుడు సహాయం అడిగితే, “నేనూ సామాన్య రైతునే” అంటాడు. తర్వాత ధనిక రైతు అయినప్పుడు అప్పులున్నాయని చెబుతాడు. వ్యాపారి అయిన తర్వాత ఇల్లు, పిల్లల చదువుల ఖర్చులు ఉన్నాయని తప్పించుకుంటాడు. కోటీశ్వరుడైన తర్వాత తీరిక లేదని, తర్వాత రమ్మని పంపిస్తాడు. మూడు నెలల తర్వాత యాచకుడు మళ్లీ వెళ్లగా, “ఎవరు నీవు?” అని అడిగి గుర్తుపట్టనట్లు ప్రవర్తిస్తాడు. చివరకు అతడిని కలిసే అవకాశమూ ఇవ్వడు. ఈ పరీక్షలన్నీ గమనించిన యమధర్మరాజు, శరభయ్య మంచి మనిషి కాదని గ్రహించి అతడిని నరకంలోనే ఉంచుతాడు. ఈ కథ ద్వారా సంపద పెరిగిన కొద్దీ కొందరిలో దయ, వినయం తగ్గిపోతాయని, ధనవంతులైనా అందరినీ సమభావంతో ఆదరించాలని తెలుస్తుంది.
అత్తగారి జబ్బు కథలో..
కుటుంబ బంధాలు, ఆప్యాయతల విలువను తెలియజేసే కథ “అత్తగారి జబ్బు.” ఒక వృద్ధురాలైన అత్తకు జబ్బు చేయడంతో కోడలు ఆమెను ఇంట్లో కాకుండా పశువుల పాకలో ఉంచుతుంది. కాలక్రమంలో ఆ కోడలికీ కోడలు వస్తుంది. ఆమెకు ఈ విషయం తెలిసి జాలిపడుతుంది. ఒకరోజు అత్త ఊరికి వెళ్లిన సమయంలో, తన వైద్యుడైన అన్నతో వృద్ధురాలికి చికిత్స చేయించి ఇంట్లోకి తీసుకువస్తుంది. తర్వాత దగ్గు వచ్చే మాత్రను నీటిలో కలిపి తన అత్తకు ఇస్తుంది. ఆమెకు విపరీతంగా దగ్గు రావడంతో, “ఈ జబ్బు అందరికీ వస్తుంది కాబట్టి పాకలో ఉంచుదాం” అని చెబుతుంది. దీంతో ఆమెను కూడా పశువుల పాకలో ఉంచుతారు. అక్కడి దుర్గంధం, అసౌకర్యం అనుభవించిన ఆమె, “పాపం! మా అత్త ఇన్నాళ్లు ఇవన్నీ ఎలా భరించిందో!” అని పశ్చాత్తాపపడుతుంది. కొద్ది రోజుల తర్వాత కొడుకు, కోడలు తీసుకెళ్లడానికి రాగా కోపంగా తిరస్కరిస్తుంది. అప్పుడు కొడుకు, “నిన్ను ఇక్కడే ఉంచాలని అనుకున్నాం. కానీ మా నాన్నమ్మ, అంటే నీ అత్తగారు, నిన్ను తీసుకురావాలని పట్టుబట్టి అన్నం కూడా తినడం లేదు” అని చెబుతాడు. ఆ మాటలు విన్న ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తాను అన్యాయం చేసినప్పటికీ తన అత్త తనపై చూపిన ప్రేమ, క్షమాగుణం ఆమెకు అర్థమవుతుంది. ఈ కథ మనుషుల మధ్య ఆత్మీయత, ప్రేమ, క్షమాగుణం ఎంత గొప్పవో తెలియజేస్తూ, కుటుంబ సంబంధాలను ప్రేమతో కాపాడుకోవాలని సందేశం ఇస్తుంది.
మొత్తం 22 కథలతో..
ఇక సన్మార్గం” అనే కథలో తండ్రి కొడుకుల బాంధవ్యం గురించి చెప్పడం జరిగింది. తండ్రిని చూసి పిల్లలు అనుసరిస్తారని ఈ కథను పరిశీలిస్తే తెలుస్తుంది. అమ్మ మనసు బాలల కథా సంపుటిలో మొత్తం 22 కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ విలువలతో కూడిన మానవ సంబంధాలుండాలని హితబోధ చేస్తాయి. పిల్లలకు విలువలను తెలియజేయడంలో డా. దాసరి వెంకటరమణ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు.
పుస్తకం: అమ్మ మనసు
పేజీలు: 98; వెల రూ.100
ప్రచురణ: బాలసాహిత్య పరిషద్
వనస్థలిపురం, హైదరాబాద్
ప్రతులకు: 9000572573
సమీక్షకులు
-ఆవుల చక్రపాణి యాదవ్
99633 50973






