మహిళలు కేవలం పిల్లల్ని కనే యంత్రాలేనా..? ఆరోగ్యం వ్యక్తిగత హక్కు కాదా?

by Javid Pasha |

అనేక కుటుంబాల్లో మహిళల ఆరోగ్యాన్ని మాతృత్వం, శృంగార దృక్కోణంలోనే చూస్తున్నారని స్త్రీ వాదులు అంటున్నారు.

మహిళలు కేవలం పిల్లల్ని కనే యంత్రాలేనా..? ఆరోగ్యం వ్యక్తిగత హక్కు కాదా?
X

దిశ, ఫీచర్స్ : పెళ్లై కనీసం ఆర్నెల్లు కూడా కాలేదు. పని ఒత్తిడో, మరేదైనా కారణమో కానీ.. ఈ మద్య తరచుగా తనకు తలనొప్పి వస్తోందని చెప్పిన రిత్వికకు వాళ్లింట్లో వాళ్లు చెప్పిన జాగ్రత్తలు విని ఒకింత ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే.. వారు చెప్పిన దాంట్లో ఈమె తలనొప్పికి సంబంధించిన సమస్యకంటే.. ఆమె భవిష్యత్తులో గర్భధారణకు, తల్లి అయ్యేందుకు అది ఇబ్బందిగా మారుతుందేమోనన్న విషయంపైనే ఎక్కువగా చర్చిస్తున్నారు. ఇలా అయితే భర్తతో సాన్నిహిత్యం వేళ సంతోషంగా ఉండలేవేమో.. పిల్లల్ని కనడం కష్టమవుతుందేమో! అలా జరగకూడదంటే.. జర జాగ్రత్తగా ఉండు అని సలహాలిస్తున్నారు. చాలామందికి ఇందులో తప్పేముంది? అనిపిస్తుండవచ్చు. కానీ ప్రత్యక్షంగా అనుభవించే వారికి మాత్రం ఒక విధమైన బాధ, ఆవేదన వెంటాడుతుంది. ఎందుకంటే.. ఇక్కడ సదరు మహిళ తలనొప్పి తగ్గాలన్న ఆలోచన, ఆరాటం కంటే.. ఆమె మాతృత్వానికి పనికొస్తుందా లేదా అనే విషయంపైనే ఫోకస్ చేస్తున్నారు. ఒక్క రిత్వికనే కాదు.. ఆధునిక కాలంలోనూ అనేకమంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య ఇది.

ఈ రోజుల్లో వివక్ష లేదా?

ఈరోజుల్లో మహిళల పట్ల వివక్ష ఎక్కడిది? అంటుంటారు చాలామంది. అయితే ఇది వందశాతం నిజం మాత్రం కాదంటున్నారు స్త్రీ వాదులు. ఒకప్పటితో పోలిస్తే పలు విషయాల్లో వివక్ష తగ్గి ఉండవచ్చు. సమానత్వ భావన పెరిగి ఉండవచ్చు. కానీ బయటకు కనిపించని అనేక అంశాల్లో అసమానతలు, అణచివేతలు, మహిళలపట్ల వివక్ష ఏదో ఒక రూపంలో నేటికీ కొనసాగుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. పైగా వారు చులకన చేయబడుతున్నారు. కుటుంబాల్లో, సమాజంలో నిర్లక్ష్యం చేయబడుతున్నారు. అందుకు చక్కటి ఉదాహరణ అనేక కుటుంబాల్లో మహిళల ఆరోగ్యాన్ని కేవలం తల్లితనం(మాతృత్వం) దృక్కోణంలోనే చూడటం అంటున్నారు ప్రముఖ స్త్రీ వాద రచయిత ప్రీతి సింగ్. మహిళల శరీరాలను తరచూ భవిష్యత్ పునరుత్పత్తి కోసం ఉపయోగపడే స్థలాలుగా మాత్రమే చూస్తున్నామని ఆమె విమర్శిస్తారు. వారి ఆరోగ్యాన్ని వారి సొంత బాగోగుల కోసం కాకుండా, ఇంకా పుట్టని బిడ్డ కోసం ముందుగా జాగ్రత్త చేసే విధంగా పరిగణిస్తామని చెబుతారు. ఈ విధమైన పురుషాధిక్య లేదా మాతృస్వామ్య భావజాలం నుంచి సమాజం, మహిళలు పూర్తిగా బయటపడాలని సూచిస్తారు.

శృంగారం.. మాతృత్వమే ముఖ్యమా!?

మైగ్రేన్, తొలనొప్పి, పీరియడ్ పెయిన్, కడుపు నొప్పి, కాళ్లూ చేతులు లాగడం, కడుపులో ఉబ్బరం.. ఇలా అనేక సమస్యలు సాధారణంగా మహిళలు ఎదుర్కొంటుంటారు. ఆయా సందర్భాల్లో అవి ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల ప్రజలు, సమాజం బాలికలను, మహిళలను, ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన స్త్రీలను చూసే కోణంలో, పరామర్శించడంలో,, సానుభూతి చూపడంలో పురుషులతో పోలిస్తే చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మహిళల్ని భవిష్యత్ మాతృత్వానికి, భర్తతో శృంగార జీవితానికి ముడిపెట్టి చూసేవారే ఎక్కువ. అంటే ఆ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు సదరు మహిళ భర్తకు శృంగారంలో సరిగ్గా సహకరించదేమోనని, తద్వారా గర్భధారణ రాదేమోనని, పిల్లల్ని కనడంలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని.. ఇలా తల్లితనం(motherhood) కోణంలోనే అంచనా వేస్తుంటారు చాలామంది పెద్దలు. అదే పురుషుల విషయానికి వస్తే అలా చేయరు.

ఎందుకీ తేడాలు?

పురుషులకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు.. కుటుంబంలోని స్త్రీ, పురుషులందరూ అతని ఆరోగ్య పునరుద్ధరణపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. మహిళల మాదరి వారి అనారోగ్య సమస్యను సంతానం, మాతృత్వం, శృంగారంతో ముడిపెట్టి చూడరు. అదే స్త్రీల విషయంలో మాత్రం డిఫరెంట్. చిన్నప్పటి నుంచే బాలికలకు ‘ఆరోగ్యంగా ఉండు, గర్భధారణకు మంచిది’ అని నేర్పుతుంటారు. దీంతో ఆరోగ్యం వ్యక్తిగత హక్కుగా కాకుండా, తల్లితనం తయారీగా మారిపోతున్నదని, ఇది సామాజికంగా, సంస్థాగతంగా కూడా కనిపిస్తున్నదని స్త్రీ వాదులు అంటున్నారు. ఇది ఆధునిక కాలంలోనూ లింగ భేదాలను చిన్నప్పటి నుంచే ఎలా నేర్పబడుతున్నాయనేందుకు చక్కటి ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కుటుంబాల్లో, సమాజంలో పురుషాధిక్య లేదా పితృస్వామ్య భావజాలానికి స్వస్తి పలకాల్సిన అవసరాన్ని మహిళా లోకం గుర్తించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. చదువుకోవడం, ప్రశ్నించడం, ఎడ్యుకేట్ అవడం, ఎడ్యుకేట్ చేయడం వంటివి ఈ విధమైన పరిస్థితులను మార్చడంలో కీ రోల్ పోషిస్తాయని, మహిళలు ఆ దిశగా ఆలోచించాలని, పురుషులు సైతం సహకరించాలని సూచిస్తున్నారు.

Next Story