- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెరీర్ ఫస్ట్.. లవ్ లాస్ట్..! మహిళల్లో పెరుగుతున్న నయా ధోరణి!!
కెరీర్‌కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, ప్రేమ, పెళ్లికి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్న మహిళల్లో వివాహాలు 20 ఏళ్ల వరకు నిలబడే అవకాశం 78% పెరుగుతోంది.

దిశ, ఫీచర్స్ : పదిరవై ఏండ్ల కిందట మహిళల ప్రయారిటీస్ వేరు.. ప్రస్తుత ఆధునిక మహిళల ప్రయారిటీస్ వేరు అంటున్నారు నిపుణులు. ఒకప్పటితో పోలిస్తే, సాంకేతిక, సామాజిక పరిస్థితుల్లో, అవసరాల్లో చాలా మార్పులు వచ్చాయి. స్త్రీలు వంటగదికే పరిమితమని, వారికి చదువువెందుకని, ఉద్యోగాలు ఎందుకని ప్రస్తుతం ఎవరూ అనట్లేదు. పురుషాధిక్య సమాజపు ధోరణి తగ్గుముఖం పడుతూ సమానత్వ భావన రోజు రోజుకూ పెరుగుతోంది. స్త్రీ, పురుషులు సమానమని, ఎవరికి నచ్చిన కెరీర్ అండ్ లైఫ్ ప్రయారిటీస్ ఎంచుకోవచ్చునని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో కొత్త ధోరణి కూడా పెరుగుతోంది. ఏంటంటే.. చదువుకున్న మహిళలు కెరీర్‌కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ.. ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి వాటికి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు.
ప్రేమ, పెళ్లి కూడా అవసరమే కానీ..
కెరీర్‌కు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారంటే.. మహిళల్లో ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విషయాలపట్ల పూర్తిగా ఆసక్తి తగ్గుతుందని ఏమాత్రం కాదు. ఇక్కడ చాలామంది స్త్రీలు ఉద్దేశపూర్వకంగా లవ్ అండ్ మ్యారేజ్ వంటి వాటికి సెకండ్ లేదా లాస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా జీవితంలో ఆర్థిక, మానసిక స్థిరత్వం సాధించేందుకు ప్రేమను, వివాహాన్ని ఆలస్యం చేస్తే, తాము జీవిత భాగస్వాములను మరింత ఆలోచనాత్మకంగా ఎంచుకుంటామని, విడాకుల రేటు తగ్గుతుందని చాలామంది మహిళలు భావిస్తున్నారు.
ఆలస్యమే మంచిదా?
ఉదాహరణకు.. డిగ్రీ చదివిన తర్వాత లేదా ఏదో ఒక కెరీర్‌లో ప్రవేశించిన తర్వాత పెళ్లి చేసుకున్న మహిళల వివాహాలు 20 ఏళ్ల వరకు నిలబడే అవకాశం 78% ఉండగా, హైస్కూల్ వరకు చదివిన వారిలో, ఏ విధమైన ఉద్యోగాలు లేకుండా ఉంటున్నవారిలో అది 41% మాత్రమే ఉంటున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇటీవలి డేటా ప్రకారం.. అమెరికాలో విడాకుల రేటు 50 ఏళ్ల లోయెస్ట్‌కు చేరింది. ఎక్కువ చదువుకున్న వారు వివాహం చేసుకునే సమయంలో మరింత స్థిరత్వం కలిగి ఉండటం వల్ల ఇది సాధ్యమవుతోంది. మిగతా దేశాల్లోనూ ఈ ప్రభావం ఉందని నిపుణులు అంటున్నారు.
ఆర్థిక స్థిరత్వం- భావోద్వేగ పరిణతి
జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ సైకాలజీలో పబ్లిషైన లాంగిట్యూడినల్ అధ్యయనాలు(Longitudinal studies) కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. వాటి ప్రకారం.. 35 ఏళ్ల తర్వాత వివాహం చేసుకునే మహిళల్లో విడాకుల రిస్క్ 30% తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు కెరీర్‌కు ఫస్టు ప్రయారిటీ ఇస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం సాధిస్తున్నారు. దీంతోపాటు భావోద్వేగపరంగా పరిణతి చెంది, స్వయం అవగాహనతో ఉంటున్నారు. ప్రేమించే వ్యక్తి లేదా పెళ్లి చేసుకోబోయే భాగస్వామి విషయంలోనూ తమతో ఏకీభవించే వారిని, తమ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ విధంగా లక్ష్యాలపై స్పష్టత ఉండటం వల్ల ‘ఆందోళనాత్మక అటాచ్‌మెంట్ తగ్గుతున్నదని, తమకు నచ్చకపోయినా సామాజిక అంచనాల వల్ల గానీ, కుటుంబ సభ్యుల సెంటిమెంట్ వల్ల గానీ తప్పుడు వ్యక్తితో ‘సర్దుకుపోవాలి’ అనే ఒత్తిడి కూడా తగ్గుతుందని స్త్రీ వాదులు, నిపుణులు పేర్కొ్ంటున్నారు. అందుకే ఆధునిక అమ్మాయిలు/మహిళలు కెరీర్ ఫస్ట్.. లవ్ అండ్ మ్యారేజ్ లాస్ట్ అంటున్నారు!
ఇండియాలో..
‘కెరీర్ ఫస్ట్.. లవ్ లాస్ట్’ ట్రెండ్ ఇండియాలోనూ విస్తరిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. చదువు, ఉద్యోగం, నైపుణ్యాలు, ఆర్థిక స్వాతంత్ర్యంపై దృష్టి పెట్టడంతో చాలామంది వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు. జీవితంలో స్థిరపడనిదే ప్రేమ దోమ జాన్తానై అంటున్నారు. NFHS-5 (2019-21) డేటా ప్రకారం కూడా.. 18 ఏళ్ల వయసువారిలో వివాహాలు 47% నుంచి 23%కి తగ్గాయి. ఇది విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వంపై అవగాహనవల్లే సాధ్యమని నిపుణులు అంటున్నారు. అంటే మిలెనియల్స్, జెన్ Z మహిళలు వ్యక్తిగత వృద్ధి, ఆర్థిక స్థిరత్వం కోసం తమ వివాహాలను ఆలస్యం చేస్తున్నారు లేదా తిరస్కరిస్తున్నారు.






