వారెవ్వా.. వాటర్ డ్రోన్.!

by Daayi Srishailam |

ఆపద సమయంలో ఆదుకునే నేస్తమే వాటర్ డ్రోన్

వారెవ్వా.. వాటర్ డ్రోన్.!
X

వానాకాలం ముందుగానే పలకరిస్తోంది.

వర్షాలు విస్తారంగా కురిస్తే..

వరద భీభత్సం తప్పదు.

హైదరాబాద్.. బెంగళూరు.. చెన్నయ్ వంటి నగరాల్లో అయితే..

కాలనీలు కమ్మేస్తాయి.

ఇండ్లలోకి నీరు చేరుతుంది.

వరదల్లో జనాలు చిక్కుకుపోతారు.

అలాంటి ఆపద సమయంలో ఆదుకునే నేస్తమే వాటర్ డ్రోన్.

- దిశ, ఫీచర్స్

డ్రోన్స్ అన్ని రంగాల్లోనూ పనిచేస్తున్నాయి. వ్యవసాయం.. వైద్యం.. ఇరిగేషన్ ఇంకా ఎన్నింట్లోనూ డ్రోన్స్‌ను వాడుతున్నారు. ఇక ఇటీవల చూసినం కదా.. యుద్ధంలో డ్రోన్లదే పెద్ద హడావిడి. ఇక ఇప్పుడు వాటర్ డ్రోన్ల గురించి బాగా వినిపిస్తోంది. వరదల్లో చిక్కుకున్నవారిని కూడా రక్షించే డ్రోన్సూ ఉన్నాయి.

వరదల్లో ఒక వరం

"ఇండియన్ రెస్క్యూ అకాడమీ" రూపొందించిన "ఐటీయూఎస్ వాటర్ డ్రోన్" ఇండియాలో వరద రక్షణ కార్యక్రమాలను విప్లవాత్మకంగా మార్చేస్తోంది. బెంగళూరు.. మహారాష్ట్ర.. గుజరాత్.. హైదరాబాద్ వంటి వరద ప్రభావిత నగరాల్లో అత్యవసర సహాయాన్ని అందించడానికి దీని సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. వరదలొచ్చే ప్రాంతాల్లో ఇదొక వరంగా మారింది. అద్భుతమైన సాంకేతి విధానంతో దీనిని తయారుచేశారు.

ఇదొక ఆశాకిరణం

బెంగళూరు.. మహారాష్ట్ర.. గుజరాత్‌లో కుండపోత వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తు్న్నాయి. వీధులు వాగులుగా మారాయి. ఇండ్లు నీటమునిగాయి. వేలాదిమంది సహాయం కోసం ఎదరుచూశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రతి సెకను విలువైనది. ఇక్కడే ఇండియన్ రెస్క్యూ అకాడమీ రూపొందించిన ఐటీయూఎస్ వాటర్ డ్రోన్ ఆశాకిరణంగా అవతరించింది. వేగం.. బలం.. విశ్వసనీయతలతో కూడిన ఈ డ్రోన్.. వరదలు.. సముద్ర అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కార్యకలాపాలకు బలమైన సహాయకారిగా నిలుస్తోంది. 100 కిలోల బరువును మోసే సామర్థ్యంతో అత్యవసర సామాగ్రిని అందించడమే కాకుండా వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఖాళీ చేయడంలోనూ ఇది సహాయపడుతుంది.

కల్లోల జలాల్లోనూ..

ఈ వాటర్ డ్రోన్‌లోని అద్భుత లక్షణం ఏంటంటే.. అది కల్లోల జలాల్లో తలకిందులైనా స్వయంగా సరిచేసుకొని నిలబడుతుంది. జెట్ పంప్ శక్తితో నడిచే ఈ డ్రోన్ గంటకు 20 నాట్ల వేగంతో దూసుకెళ్తుంది. చిక్కుకున్న వారిని త్వరగా చేరుకోవడంలో రక్షక బృందాలకు సహాయపడుతుంది. దీనిని నియంత్రించడం సులభం. ఇది అత్యవసర సమయంలో సమర్థవంతంగ పనిచేస్తుంది. 0.5 నుంచి 1.25 మీటర్ల ఎత్తుగల అలల్లో కూడా స్థిరంగా పనిచేస్తుంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిన్న నీటి నౌకలు తడబడినా, ఐటీయూఎస్ డ్రోన్ తన సామర్థ్యంతో వరద రక్షణ, తీరప్రాంత సంక్షోభాల్లో అజేయంగా నిలుస్తుంది.

ప్రజలు.. పర్యావరణం

ఐటీయూఎస్ డ్రోన్.. "డ్రోన్ ఫర్ గుడ్" కార్యక్రమంలో భాగం. ఈ కార్యక్రమం మానవ సహాయం, పర్యావరణ పర్యవేక్షణ, సమాజ సాధికారత కోసం డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. నష్టాన్ని అంచనా వేయడం, సహాయ సామగ్రి అందించడం, అటవీ నిర్మూలనను గమనించడం, స్థానికులకు శిక్షణ ఇవ్వడం వటి కార్యకలాపాల ద్వారా ఈ డ్రోన్ సంక్షోభాలకు స్పందించడంతో పాటు సురక్షితమైన.. దృఢమైన భవిష్యత్‌ను నిర్మించడంలో తోడ్పడుతుంది.

Next Story