శ్రీ నందిశాల.. పశు ఆశ్రయ పాఠశాల.!

by Daayi Srishailam |

అవన్నీ ఒకేచోట చేరితే అదే శ్రీ నందిశాల

శ్రీ నందిశాల.. పశు ఆశ్రయ పాఠశాల.!
X

దిశ, ఫీచర్స్: వ్యవసాయం పండగలా ఉన్నప్పుడు.. రైతు రాజులా బతికినప్పుడు.. ఎద్దు.. ఇంటి పెద్దకొడుకు. ఒక్కోసారి.. వాళ్లు ఉపాసముండి కూడా మంచి మేత పెట్టేవాళ్లు. తర్వాత.. ఎద్దేడిసిన ఎవుసమైంది. ఎద్దును "వద్దు" అనాల్సి వచ్చింది. అటు అమ్ముకోలేక.. ఇటు పెంచుకోలేక.. ఊరిమీద వదిలేయాల్సిన పరిస్థితులు చాలానే చూస్తుంటాం. అవన్నీ ఒకేచోట చేరితే అదే శ్రీ నందిశాల.

వదిలేసినవే లక్ష్యంగా

ఆవులంటే పాలిస్తాయి. ఇంకా గోమాత అనే సెంటిమెంట్. సహజంగానే ఆవుపట్ల మనకు అభిమానం.. గౌరవం ఎక్కువ కాబట్టీ బాగా చూసుకుంటాం. అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకుంటాం. మరి ఎద్దులు పాలియ్యవు కదా.? వాటినీ ఆవులను చూసినట్లు చూసుకోగలమా.? లేదు. మనం దినాం రోడ్లమీద చూస్తుంటాం. మార్కెట్లో.. వీధుల్లో.. బస్టాండ్లలో.. ఇలా ఎక్కడపడితే అక్కడ ఎద్దులు కనిపిస్తుంటాయి. కొన్ని అమాయకంగా ఒకచోట పడుకొని ఉంటే.. కొన్నేమో భీభత్సాలు సృష్టిస్తుంటాయి. ఇలాంటి వేలాది ఎద్దుల జీవితాలను మార్చేశాడు బికనీర్‌కు చెందిన విఘ్నేష్ ఓజా.

2500పైగా ఆశ్రయం

వాస్తవానికి వ్యవసాయం బాగున్నప్పుడు.. రైతు ముఖమ్మీద చిరునవ్వు కనిపించినప్పుడు ఎద్దులకున్న గౌరవం వేరు. రైతు ధైర్యం.. ధీమా ఈ ఎద్దులే. ఎప్పుడైతే వ్యవసాయం కుంటుపడిందో.. ఉన్న ఆ కొద్దిపాటి సాగులో యంత్రాలు చొరబడ్డాయో అప్పుడు ఎద్దు అనాథయ్యింది. దీనిని లోతుగా అధ్యయనం చేసిన విఘ్నేష్ ఓజా బికనీర్‌లో 50 ఎకరాల విస్తీర్ణంలో "శ్రీ నందిశాల" ఏర్పాటుచేశాడు. వదిలేసిన.. గాయాల పాలైన ఎద్దుల సంరక్షణకు అంకితమైన పవిత్ర ఆశ్రయం ఇది. 2500కు పైగా ఎద్దులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. వైద్య సంరక్షణ.. గౌరవంతో ఎద్దులు పునర్జన్మ దక్కినవాటిలా బతుకుతున్నాయి.

కార్పొరేట్ కెరీర్ వదిలేసి

విఘ్నేష్ ఓజా కార్పొరేట్ ఎంప్లాయ్. మంచి జీతం. కెరీర్‌కు ఢోకాలేదు. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్.. టప్పర్ వేర్ ఇండియా వంటి సంస్థల్లో బ్రాండింగ్.. మార్కెటింగ్ రంగంలో పనిచేశాడు. అలాంటి లైఫ్‌ను వదిలేసి ఎద్దును బతికించేందుకు కృషి చేస్తున్నాడు. తన ఈ ప్రయత్నానికి విఘ్నేష్ మేనమామ అనిల్ కుమార్ ఓజా సహకారం మరువలేనిది. ఎవరైనా ఉద్యోగం వదిలేసి.. ఆవులూ.. ఎద్దులూ అని తిరుగుతానంటే ఊకుంటరా.? అలాంటి పరిస్థితే విఘ్నేష్ ఇంట్లో ఎదురైనప్పుడు అనిల్ కుమార్ అండగా నిలిచాడు. ఆర్థికంగా సపోర్ట్ చేసి.. శ్రీ నందిశాల ఏర్పాటులో ప్రోత్సహించాడు.

ఎద్దు ఏడవొద్దని

పొలానికి పనికిరాకుండా పోయిన ఏ ఎద్దూ ఏడవొద్దనే తాపత్రయం విఘ్నేష్‌ది. ఎందుకో కొందరికి ఎద్దును చూస్తే ఊకూకెనే కోపమొస్తుంటది. ఉత్తగనే వాటిమీద రంగులు.. యాసిడ్లు చల్లుతుంటారు. కొడుతుంటారు. తరుముతుంటారు. "శివుని నంది"గా పరిగణించినా ఎద్దును పెద్దగా లైక్ చేయరు. తిండి.. ఆదరణ లేక రోడ్లమీద ఉండే చెత్త.. ప్లాస్టిక్‌ను తింటాయి అవి. వాటి కడుపులో 15 కిలోల ప్లాస్టిక్ ఉంటుందట. కొన్నింట్లో 45 కిలోల ప్లాస్టిక్ కవర్లు.. డైపర్లు.. గాజు ముక్కలు వంటివి ఉంటాయి. వీటన్నింటినీ శ్రీ నందిశాలలో తొలగించి వాటి కొత్త జీవితానికి ఒక పాఠశాలగా మార్చుతున్నారు.

Next Story