- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పబ్లిక్ ప్లేస్‌లో సొల్లు కబుర్లు..! ఫోన్ స్పీకర్ ఆన్‌చేసి న్యూసెన్స్!!
ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడేటప్పుడు ఆ శబ్దం చుట్టూ 5-10 మీటర్ల వరకు వ్యాపిస్తుంది. ఇది ఇతరుల సంభాషణ, ఆలోచనలు, పనులను ఆటంక పరుస్తుంది.

దిశ, ఫీచర్స్ : ప్రశాంతమైన ప్లేస్. అందులోనూ పబ్లిక్ ప్లేస్. రకరకాల మనుషులు.. రకరకాల పనుల మీద వెళ్తుంటారు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. సంతోషంగా ఉన్నవాళ్లుంటారు. సమస్యలతో ఉన్నవాళ్లూ ఉంటారు. వాళ్లను డిస్టర్బ్ చేసే.. అసౌకర్యానికి గురిచేసే.. హక్కు, అధికారం ఎవరికీ ఉండదు. కానీ ఇండియాలో ఇదొక ఫ్యాషన్. ఎదుటివాళ్లను డిస్టర్బ్ చేసి.. ప్రశాంతతను పాడుచేసే జనాలు అడుగడుగునా కనిపిస్తుంటారు. వాళ్లు చేసే అలాంటి న్యూసెన్స్‌లో ‘పబ్లిక్ ప్లేస్‌లో ఫోన్ స్పీకర్లో పెట్టి’ మాట్లాడటం ఒకటి.
పబ్లిక్ ప్లేస్‌లో పనికిమాలిన ముచ్చట్లా?
ఒక వాస్తవ సంఘటన. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ బిజినెస్ లాంజ్. ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు. మామూలుగానే అక్కడ సైలెన్స్ ఉంటుంది. ముచ్చట పెట్టుకున్నా.. బిజినెస్ సంభాషణలు కొనసాగినా.. ఫోన్‌లో సంభాషించినా.. చాలా నెమ్మదిగా పక్కవాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మాట్లాడతారు. అలానే బిజినెస్ సంభాషణలు నడుస్తున్నాయి. ఒకతను క్రిస్ప్ లెనిన్ షర్ట్ వేసుకున్నాడు. చూడటానికి చాలా సొగసైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇంకా ఎక్కువ ప్రయాణాలు చేసే వ్యక్తి ఉన్నట్టున్నాడు. ఖరీదైన హెడ్‌ఫోన్స్ మెడలో వేలాడుతున్నాయి. అంతబాగానే ఉందిగానీ తన ఫోన్‌ను స్పీకర్లో పెట్టి మాట్లాడుతున్నాడు. అది కూడా ఐదు పది నిమిషాలు కాదు. సుమారు 50 నిమిషాల పాటు లౌడ్ స్పీకర్లోనే పెట్టి ఫోన్ మాట్లాడాడు. అదీ కిలోమీటర్ దూరం వినిపించేంత గట్టిగా.
ఫుల్ వాల్యూమ్ పెట్టి వీడియో కాల్సా?
అతడు అలా స్పీకర్లో పెట్టి ఫోన్ మాట్లాడుతుంటే ఎవరూ ఏమీ అనలేదు. కొందరు మాత్రం ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో ‘మనం ఎందుకిలా ఉన్నాం. ఇది సరైన పద్ధతేనా?’ అనే ప్రశ్న దాగివుంది. తర్వాత మళ్లీ అందరూ వారి స్క్రీన్లవైపు తిరిగారు. ఒకరకంగా లాంజ్‌ను అతడికి వదిలేశారు. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ బిజినెస్ లాంజ్‌లోనే కాదు.. ఇలాంటి ఘటనలు ప్రతినిత్యం మన చుట్టూ చాలా జరుగుతుంటాయి. మనమేదో మంచి ఫుడ్ ఆర్డర్ చేసి ప్రశాంతంగా తిందామని రెస్టారెంట్‌కి వెళతాం. ఫుడ్ రాగానే ఆస్వాదిస్తూ తింటుంటాం. ఇంతలోనే పక్కనవాళ్లెవరో ఫుల్ వాల్యూమ్‌లో వీడియో కాల్స్ చేస్తుంటారు. మెట్రోలో, లాంజ్‌లలో రీల్స్ పెద్దగా ప్లే చేస్తుంటారు. ఇలా వ్యక్తిగత స్పేస్ అనేది మనకు ఇంకా అన్యదేశ భావనగానే మిగిలిపోయింది.
పర్సనల్ స్పేస్ మన హక్కు కాదా?
పర్సనల్ స్పేస్ అనేది ఒకరి హక్కు. కానీ అలా ఉందా పరిస్థితి? ఇందులో మన సొసైటీ లోతైన సమస్య దాగి ఉంది. మనం బాగా చదువుకున్నాం. గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం. పెద్ద వ్యాపారాలను నడుపుతున్నాం. విదేశాలు తిరుగుతున్నాం. కానీ.. ఇతరులతో కలిసి ఉండాల్సిన చోట్ల మాత్రం మన ప్రవర్తన మారడం లేదు. ప్రశాంతమైన ఏరియాలో.. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లో లౌడ్‌గా లేదంటే లౌడ్ స్పీకర్లో మాట్లాడతాం. ఇదొక న్యూసెన్స్ అని మాత్రం గ్రహించం. ఎంతసేపూ మన అత్యవసర సంభాషణను సాకుగా చూపి పక్కవాళ్ల ప్రశాంతతను భగ్నం చేసే ప్రయత్నాలే చేస్తుంటాం. తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో గానీ ఈ న్యూసెన్స్ వల్ల చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అటు భరించలేక.. ఇటు ఏమీ అనలేక.. సప్పుడు జేయకుండా సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఆ మాత్రం సామాజిక స్పృహ ఉండదా?
అవసరం లేకున్నా కొందరు గట్టిగా ‘హల్లో.. ఆ హల్లో.. తిన్నవా? ఏం చేస్తున్నవ్? ఏంకూర చేసిండ్రు. కూరలో కలేమాకేసిండ్రా? హల్లో హల్లో’ అని ఏదో సోది మాట్లాడుతుంటారు. వాళ్లు మాట్లాడే విధానానికి లెక్కకైతే ఫోనే అవసరం ఉండదు. ఫోన్ స్పీకర్లో పెట్టి కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్లకు వినిపించేంత గట్టిగా మాట్లాడుతుంటారు. అంత గట్టిగా మాట్లాడేదానికి ఇంకా స్పీకరెందుకో అర్థం చేసుకోరు. అది గూడా ఇప్పుడు మొదలు పెడితే గంట దాక అలాగే సొల్లు వాగుతూనే ఉంటారు. అదేం అత్యవసర సంభాషణ కాదు. మాట్లాడకపోతే ఇప్పటికిప్పుడు కొంపలేం మునిగిపోవు. కానీ.. దానినే ఒక అలవాటుగా మార్చుకొని పబ్లిక్ ప్లేస్ అని చూడకుండా.. ఇతరులకు అసౌకర్యం కలుగుతుందేమోననే కనీస సామాజిక స్పృహ లేకుండా మాట్లాడుతుంటారు.
సొల్లు మాటల బ్రాండ్ అంబాసిడర్లా?
ఇంకా కొందరుంటారు చూడండీ.. అదేమంత సీరియస్ మ్యాటర్ కాదు. ఖుల్లంఖుల్లా చెప్పాలంటే టైం పాస్ బేకార్ ముచ్చట్లు.. బేకార్ పంచాయితీలు. కానీ దేశం కాలిపోతున్నట్లు ఫోన్ స్పీకర్లో పెట్టి అవతలివాళ్లకు వినిపించేలా మాట్లాడతారు. తీరా చూస్తే ‘దావతెక్కడ నడుస్తోంది? ఏం బ్రాండ్ తెచ్చుకున్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎన్ని బాటిల్స్ అయిపోయాయి’ అంటూ పనికిమాలిన ముచ్చట్లు మాట్లాడుతుంటారు. స్పీకర్ పెట్టి మాట్లాడటంలో వాళ్ల ఉద్దేశం ఏంటంటే వాళ్లు చేస్తున్న దావతి.. తీసుకున్న బ్రాండ్ల వల్ల తామెంత గొప్పనో అందరికీ తెలిసేలా చెప్పాలనుకుంటారు. దీనివల్ల వాళ్ల గొప్పలేమోగానీ.. ఉన్న వ్యక్తిత్వం గంగలో కలిసి నసగాళ్లు.. తాగుబోతులు.. వదరుబోతులు అనే ముద్ర బలంగా పడిపోయి సొల్లు పురాణానికి బ్రాండ్ అంబాసిడర్లుగా పేరు తెచ్చుకుంటారు.
నిబంధనలు పాటిస్తే ఏమవుతుంది?
మనవాళ్లతో వచ్చిన చిక్కేంటంటే.. పబ్లిక్ స్పేస్ అనేది ప్రభుత్వ ఆస్తి అనుకుంటాం. అంటే ఇది అందరి ఆస్తి కాబట్టి ఇక్కడెవరూ బాధ్యతగా ఉండరు. నిబంధనలు పాటిస్తే ప్రయోజనం ఉండదు అనుకుంటారు. వాటిని అతిక్రమిస్తే మనల్ని అడిగేవాడు ఉండడు.. ఒకవేళ అడిగినా వాటికి శిక్షలేమీ ఉండవు.. మన ఇచ్ఛా మన రచ్చా అనే భావనతో ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇదే భావనతో పెరిగాం మనమంతా. జనాలు ఎక్కువగా ఉన్నచోట ఎలా మాట్లాడినా నడుస్తుందనే అభిప్రాయంతో ఉంటారు జనాలు. ఎట్ల మాట్లాడినా అడ్జస్ట్ చేసుకుంటార్లే అనే ఒక లాపర్వా మనసులో బలంగా నాటుకుపోయి ఉంటుంది. ఏముందిలే ఒకసారి అలవాటు పడితే వాళ్లే గమ్మునుంటారు.. ఇక్కడెవరూ చూడరు.. ఆపరు.. పట్టించుకోరు అనే భావనను బలంగా ఏర్పరచుకున్నారు.
స్పీకర్ పెట్టి మరీ మొత్తుకోవాలా?
పబ్లిక్ స్పేస్‌లో మనం ఎందుకు ఇంత అనాసక్తంగా ఉంటాం? అనే విషయం మనోళ్లు పట్టించుకోరు. ఎంత అనాసక్తితో ఉంటే అంత గొప్పోళ్లం అనుకుంటాం. ఎవడెంత ఎక్కువగా రూల్స్‌కి విరుద్ధంగా వెళితే వాడు అంత తోపు అనుకుంటాం. నీతులు బాగా చెప్తాం. సూక్తులు చాలా వల్లిస్తాం. గొప్ప గొప్ప మాటలు చెప్తాం. గొప్పవాళ్లతో పరిచయాలు ఉన్నాయని సొంత డబ్బా కొట్టుకుంటాం. మాది మాట తప్పని వంశం.. మడమ తిప్పని వంశం అని ప్రగల్భాలు చాలా చెప్తాం. కానీ ఇతరులతో కలిసి ఉండాల్సిన చోట్ల మాత్రం మన ప్రవర్తనను మార్చుకోం. పైగా వాడు అలా.. వీడు ఇలా.. అని వాడి గురించీ వీడి గురించీ చెవులు తూట్లుపోయి రక్తాలు కారేలా స్పీకర్‌పెట్టి మరీ చెప్పుకుంటాం. మనం చేసేది సక్కగ చెయ్యక వేరేవాళ్ల గురించి ఎన్ని మాట్లాడితే ప్రయోజనమేంటో అర్థం చేసుకోరు.
అన్నీ వదిలేసి ఆ మోత మోగిద్దామా?
సామాజిక శాస్త్రవేత్త ఎర్వింగ్ గాఫ్‌మన్ ‘సివిల్ ఇన్-అటెన్షన్’ అనే భావనను ప్రవేశపెట్టాడు. ఇదేంటంటే అపరిచితుల మధ్య ఒక అనుబంధం అన్నమాట. ఒకరినొకరు గుర్తించి.. ఒక క్షణం చూసి తర్వాత కళ్లకు కనిపించకుండా ఉండటం. ‘నీ ఉనికిని గుర్తించాను.. కానీ నా ఉనికిని నీపై రుద్దను’ అనే సందేశం ఇవ్వడం అన్నమాట. అంటే అందరినీ గౌరవించాలి. కానీ మనదేశంలో పబ్లిక్ స్పేస్ ఇంకా భావనాత్మకంగా అభివృద్ధి చెందలేదు. ఫోన్ స్పీకర్లో పెట్టి లౌడ్‌గా అరుస్తాం. అదే మనకు ప్యాషన్. లైఫ్ స్టైల్ కావచ్చు. కానీ దాని వెనక ఉన్న సమస్యేంటో గ్రహించం. నైతిక విలువలు.. ఇతరులకిచ్చే గౌరవం.. సంయమనం.. సహనం అన్నీ వదిలేసి స్పీకర్లు పెట్టి మోత మోగిస్తాం. అంటే ఎర్వింగ్ గాఫ్‌మన్ చెప్పిన సివిల్ ఇన్- అటెన్షన్ అనేది పట్టదన్నమాట.
మనది మనకు సోయి ఉండదా?
మనం గ్లోబల్ సిటిజన్లమే అయుండొచ్చు. కానీ మన చుట్టున్న వాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి కదా? ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడకూడదు.. ఇతరులకు అసౌకర్యం కలిగించొద్దు.. పబ్లిక్ స్పేస్‌ను గౌరవించాలి అనేవి తెలుసుకోవాలి కదా? మన ఫోన్ స్పీకర్లో పెట్టొద్దు.. న్యూసెన్స్ చేయొద్దు అనేది వేరేవాళ్లు మనకు చెప్పాలా? మనది మనకు సోయి ఉండదా? ఇదేమన్న పెద్ద విషయమా? అంతర్జాతీయ అంశమా? ఒక ప్రత్యేకమైన నిపుణుడు వచ్చి ఇలా చేయకండయ్యా అని చర్చ పెట్టాలా? ఎంత చిన్న విషయం ఇది? పట్టించుకోలేనంత.. పరిహారం చెల్లించలేనంత.. చిన్నదే అయుండొచ్చు. కానీ స్పీకర్లో పెట్టి మాట్లాడొద్దనే స్పృహ ఉంటే మాత్రం దీని ద్వారా పెద్ద మార్పునే సాధించే అవకాశాలున్నాయి. లేకపోతే ఈ చిన్న విషయం మన రోజువారీ జీవితాన్ని అసౌకర్యానికి గురిచేస్తుంది.
జరిమానా లేదనే చిన్నచూపా?
మనం సామాజిక స్పృహతో ఉండాలంటే సౌకర్యాలతో పాటు మనస్తత్వాన్ని కూడా మార్చుకోవాలి. దానికి చక్కటి ఉదాహరణే ఫోన్ లౌడ్ స్పీకర్ సంభాషణ. ఇక్కడ జనాలకున్న లాపర్వా ఏందంటే ‘లౌడ్ స్పీకర్ సంభాషణ’ నిషేధం కాకపోవడం. నిషేధం కాకపోయినా ఇతరులకైతే ఇబ్బంది కలిగిస్తుంది కదా? దీనికి కఠిన నిబంధలేవీ లేకపోయుండొచ్చు. కానీ చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశమైతే ఉంది. పబ్లిక్ న్యూసెన్స్ కింద.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 268 ప్రకారం పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్‌గా భావించి కేసు పెడతారు. గరిష్టంగా రూ.200 జరిమానా పడుతుంది. జరిమానా తక్కువే అయుండొచ్చు కానీ జరిమానా పడిందనే అపరాధభావం తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది.
పదిమందిలో గౌరవం అనిపిస్తుందా?
పబ్లిక్ కమ్యూనిటీస్‌లో తరుచూ ఇలా అసౌకర్యానికి గురిచేసే సందర్భాలూ ఉన్నాయి. ఐతే ఇక్కడేమవుతోందంటే.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు వార్నింగ్ ఇస్తారు. ‘స్పీకర్ ఆఫ్ చేసి ఇయర్‌ఫోన్ ఉపయోగించండి’ అని చెప్పి పంపేస్తారు. పునరావృతం అయితే జరిమానా లేదా కేసు నమోదు చేయవచ్చు. కానీ చాలా అరుదు. దీనినే ఆసరాగా చేసుకొని రైల్వే స్టేషన్, బస్, మెట్రో, హాస్పిటల్, లైబ్రరీ, కోర్టు వంటి ప్రదేశాల్లో జనాలు స్పీకర్ల సంభాషణతో రెచ్చిపోతున్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం ‘నాయిస్ పొల్యూషన్ రూల్స్’ ప్రకారం రూ.2000 వరకు జరిమానా విధిస్తారు. అది ఏ రాష్ట్రమైనా కావచ్చు. వాళ్లెంత తీస్మార్కాన్లయినా ఉండొచ్చు పబ్లిక్ ప్లేస్‌లో ఫోన్ స్పీకర్ వాడకుండా ఇయర్‌ఫోన్ ఉపయోగించి మాట్లాడితే పదిమందిలో గౌరవం అనిపిస్తుంది.
అమెరికాలో మనలాగే చేస్తారా?
పబ్లిక్ ప్లేస్‌లో ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడితే అమెరికాలో నగరాలవారీగా లోకల్ నాయిస్ ఆర్డినెన్స్‌లు వర్తిస్తాయి. ఇతరులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తే ‘పబ్లిక్ న్యూసెన్స్’ కింద చర్య తీసుకుంటారు. రైలు, బస్‌లలో క్వయిట్ కార్స్ ఉంటాయి. అక్కడ ఫోన్ కాల్స్ నిషేధం. ఒకవేళ మాట్లాడితే హెడ్‌ఫోన్స్ తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే సామాజికంగా చాలా అసహ్యించుకుంటారు. దీంతో అమెరికన్ జనాలు ఇలా స్పీకర్ పెట్టి మాట్లాడరు. యూకేలో తీవ్రమైన వార్నింగ్ ఇస్తారు. శృతిమించితే జరిమానా తప్పదు. జపాన్‌లో సామాజిక నియమాలు చాలా కఠినం. ట్రైన్‌లు, బస్‌లు, ఇతర పబ్లిక్ ప్లేస్‌లలో ఫోన్ మాట్లాడటం, స్పీకర్ ఉపయోగం అసభ్య ప్రవర్తన కింద పరిగణిస్తారు. చైనాలో బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో కఠిన చర్యలు తీసుకుంటారు.
ఇంకెన్నాళ్లు ఈ స్పీకర్ల ఇరిటేషన్?
పబ్లిక్ ప్లేస్‌లో ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడే అలవాటు ఇతరులకు చాలా రకాల ఇబ్బందులు కలిగిస్తుంది. ఒక్కసారి ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే చుట్టూ 5-10 మీటర్ల వరకు శబ్దం వ్యాపిస్తుంది. ఇది ఇతరుల సంభాషణ, ఆలోచనలు, పనులను భంగపరుస్తుంది. విద్యార్థులు, పనిలో ఉన్నవాళ్లు, ఆలోచనలో మునిగినవారికి చాలా ఇబ్బంది. ముఖ్యంగా బస్సు, రైలు, కేఫ్, లైబ్రరీ వంటి వాటిలో. ఇంకా వ్యక్తిగత విషయాలు ఇతరుల చెవుల్లో పడతాయి. దీనివల్ల అసౌకర్యం కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆందోళన, కోపం, ఇరిటేషన్ పెరుగుతాయి. ప్రపంచం తన చుట్టూ తిరుగుతుందని భావించాల్సి వస్తుంది. ఆధునిక స్మార్ట్ ఫోన్ సంస్కృతి వల్ల స్వీయ ప్రాధాన్యత పెరిగింది. దీంతో గుంపులో నేనొక్కడినే టాప్ అనే భావన ఏర్పడి చట్టాలకు భయపడకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు.
తప్పు అంతే: జంగయ్య లాలగారి, యాక్టివిస్ట్
పబ్లిక్ ప్లేస్‌లో స్పీకర్ ఫోన్ ఉపయోగం ఇతరుల మానసిక శాంతిని చాలా ఎక్కువగా దెబ్బతీస్తుంది. మన మెదడు సంభాషణను పూర్తిగా వినాలని ప్రయత్నిస్తుంది. కానీ ఒక్క వైపు మాత్రమే వినిపిస్తే అది మరింత ఎక్కువ ఏకాగ్రతను డిమాండ్ చేస్తుంది. ఫలితంగా ఆందోళన, ఇరిటేషన్, కోపం పెరుగుతాయి. ఇది ముఖ్యంగా విద్యార్థులు, ఆఫీస్‌కు వెళ్లేవారు.. మానసిక సమస్యలు ఉన్నవారికి.. వృద్ధులకు చాలా హానికరం. మన సౌకర్యం కోసం ఇతరుల సౌకర్యాన్ని పట్టించుకోకపోవడం చాలా తప్పు.
విలువల క్షీణత : దయాకర్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పీఆర్వో
నేను తరగతి గదులు, లైబ్రరీలు, బస్సు, రైలు వంటి ప్రదేశాల్లో ఎన్నోసార్లు ఈ సమస్యను చూశాను. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాల్సిన సమయంలో ఎవరో స్పీకర్‌లో బిజీగా మాట్లాడితే వారి ఏకాగ్రత పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. ఒక్కసారి శబ్దం వచ్చిందంటే మళ్లీ ఫోకస్ తిరిగి రావడానికి 5-10 నిమిషాలు పడుతుంది. ఒక వ్యక్తి తన స్వార్థం కోసం వందల మంది శాంతిని దెబ్బతీస్తున్నాడు. మన సమాజంలో ఇతరుల ప్రైవేట్ స్పేస్‌ను గౌరవించడం వంటి విలువలు క్షీణిస్తున్నాయనడానికి ఇది ఉదాహరణ.






