అదృష్టవంతులంటే వీళ్లే బాస్.. కేవలం 4 గంటలు నిద్ర సరిపోతుందట!

by Yella Dhawani Reddy |

మెదడు చురుగ్గా పని చేయాలంటే పూర్తి నిద్ర తప్పనిసరి.

అదృష్టవంతులంటే వీళ్లే బాస్.. కేవలం 4 గంటలు నిద్ర సరిపోతుందట!
X

దిశ, వెబ్ డెస్క్: మెదడు చురుగ్గా పని చేయాలంటే పూర్తి నిద్ర తప్పనిసరి. అందుకే ప్రతి మనిషికి కనీసం 7 గంటల నిద్ర (Sleep) అవసరం అని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. సరైనా నిద్రలేకపోతే శరీరం తీవ్ర అలసట, ఒత్తిడికి గురవుతుందని అనేక దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతాయని హెచ్చరిస్తుంటారు. కానీ, కొంతమంది నాలుగైదు గంటలు నిద్రపోయినప్పటికీ చాలా చురుగ్గా ఉంటారు. ఎలాంటి ఒత్తిడులు, చిరాకులు లేకుండా పనిచేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. అందుకు కారణాలను తాజా అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సాధారణంగా నిద్ర చక్రం అనేది ప్రతి ఒక్కరిలో మారుతుంటుంది. అందుకే కొందరు రాత్రిళ్లు 10 గంటల పాటు నిద్రపోయినా పగటి పూట నిద్రమత్తుతో తూగుతూ ఉంటారు. మరికొందరికి రాత్రి 4 గంటల నిద్ర దొరికినా సరిపోతుంది. అందుకు అరుదైన జన్యు పరివర్తనమే (Genetic mutation) కారణమని పరిశోధకులు తాజా అధ్యయనాల్లో వివరించారు. మనుషుల్లో ఈ జన్యుమార్పును మానవ సూపర్-స్లీపర్‌ SIK3-N783Yగా గుర్తించారు. ఈ జన్యుపరమైన మార్పులే నిద్ర-మేల్కొనే చక్రాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే దీనికారణంగా ఆయా వ్యక్తులు తక్కువ గంటల్లోనే డీప్‌ స్లీప్‌లోకి వెళ్లిపోతారు.

పరిశోధకులు ఈ మ్యూటేషన్‌ని తొలుత ఎలుకలలో ప్రవేశపెట్టగా అవి కూడా తక్కువ గంటలే నిద్రపోతున్నట్లు గుర్తించారు. అంతేగాదు ఈ మ్యుటేషన్‌ ఉన్న ఎలుకలు 31 నిమిషాలే నిద్రపోతే..ఈ మ్యుటేషన్‌ లేని ఎలుకలు 54 నిమిషాలుపైగా నిద్రపోవడాన్ని గమనించారు. ఇక ఈ జన్యుమార్పు కారణంగా ప్రొటీన్లలో కొన్ని మార్పులు కనిపిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ఫాస్ఫేట్‌ను బదిలీ చేసే సామర్థ్యంలో మార్పు కనిపిస్తుందని అంటున్నారు. అంతిమంగా ఇది జీవగడియారం, నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. నిద్రలేమితో సతమతమయ్యే వారి చికిత్సలో ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story