- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Haka : ఉద్వేగం.. యుద్ధ తంత్రమే.. హాకా నృత్యం!
హాకా అనేది మావోరి ఆదివాసీ సంస్కృతికి గుండెలాంటిదని చెబుతారు. ఇది శక్తివంతమైన, ఉద్వేగభరితమైన యుద్ధ నృత్య ప్రదర్శన.

దిశ, ఫీచర్స్ : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో అక్కడ ప్రదర్శించిన ఆదివాసీ సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు ఎంతో మందిని ఆకర్షించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆకట్టకుంటున్నాయి. అలాంటి వాటిలో న్యూజిలాండ్‌కు చెందిన మావోరి ఆదివాసీ సమూహం ప్రదర్శించిన ఉద్వేగ భరితమైన హాకా నృత్యమైతే చూసేవారికి గూస్ బంప్స్ తెప్పించింది. ఇంతకీ అదేం నృత్యం? దాని వెనుకున్న సాంస్కృతిక కోణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హాకా అంటే?
హాకా అనేది మావోరి ఆదివాసీ సమూహం ప్రదర్శించే శక్తివంతమైన, ఉద్వేగభరితమైన నృత్య ప్రదర్శన. కొంతమంది గుంపుగా నిలబడి, గట్టిగా అరుస్తూ, చాంట్ (కవితాత్మక గీతం) పాడుతూ చేస్తారు. కాళ్లు బలంగా నేలకు తాకిస్తూ (stamping - waewae takahia), చేతులతో ఛాతీపై, తొడలపై, జబ్బలపై కొట్టుకుంటూ, కళ్లు పెద్దవిగా చేస్తూ, నాలుక చాచుతూ శరీరాన్ని భిన్నమైన రీతుల్లో కదిలిస్తూ భయంకరమైన భావాలను ప్రదర్శిస్తుంటారు. ఇది శత్రువులను భయపెట్టడానికి, స్వంత శక్తిని ప్రదర్శించడానికి ఉపయోగపడే యుద్ధ నృత్యంగా పేర్కొంటారు. ఇందులో మొత్తం శరీరం ఒక సింఫనీలా పనిచేస్తుంది. చూసేవారికి వింతగా, విచిత్రంగా అనిపిస్తూ ఆకట్టుకుంటుంది.
సంస్కృతి, సంప్రదాయం
హాకా (Haka) అనేది మావోరి ఆదివాసీ సంస్కృతికి గుండెలాంటిదని చెబుతారు. ఇది శక్తివంతమైన, యుద్ధ తంత్రంతోకూడిన ఉద్వేగభరితమైన ప్రదర్శన. పూర్వ కాలంలో అడవుల్లో నివసించే క్రమంలో శత్రువులు, జంతువుల నుంచి ప్రాణభయం ఉండేది. అలాగే శత్రవులతో యుద్ధానికి ముందు ధైర్యం నింపడానికి, సవాలు చేయడానికి, అలాగే సంతోషం, స్వాగతం, దుఃఖ సందర్భాల్లో కూడా దీనిని ప్రదర్శిస్తారు. మొత్తానికి సమూహ ఐక్యత, శక్తి, గౌరవాన్ని ఇది సూచిస్తుంది. దీంతో పాటు పోయ్ (Poi) వంటి ఇతర నృత్యాలు కూడా ప్రదర్శిస్తారు. ఇక మావోరి పురాణాల ప్రకారం.. ప్రసిద్ధమైన ‘కా మాటే’ (Ka Mate) హాకా నాయకుడు తే రావుపరాహా (Te Rauparaha) రచనలు పేర్కొంటున్నాయి. అంతేకాదు హాకా అనేది మరణంపై జీవిత విజయాన్ని కూడా సూచిస్తుంది. ఇందులో యుద్ధ హాకా (peruperu)తో పాటు, స్వాగతం , సంతోషం, దుఃఖ సందర్భాలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు, వివిధ కార్యక్రమాల్లో ప్రదర్శించే భిన్నమైన నృత్యాలు కూడా ఉంటాయి. ఆధునికంగా అల్ బ్లాక్స్ రగ్బీ జట్టు ప్రపంచవ్యాప్తంగా హాకాను ప్రదర్శిస్తూ మావోరి సంస్కృతిని ప్రపంచానికి చాటుతోంది. తే మటటిని (Te Matatini) వంటి ఉత్సవాల్లో వివిధ హాకాలు పోటీగా ప్రదర్శిస్తారు.
ఆధ్యాత్మిక వ్యక్తీకరణ
హాకా కేవలం నృత్యం మాత్రమే కాదు, అది వారి సంస్కృతి, గుర్తింపు, ఆధ్యాత్మికతకు సంబంధించిన శక్తివంతమైన వ్యక్తీకరణ కూడా. హాకా మూలాలు మావోరి పురాణాల్లో కూడా ఉన్నాయని చెబుతారు. సూర్య దేవుడు తమా-నుయి-తే-రా (Tama-nui-te-rā), అలాగే వేసవి దేవత హినే-రౌమతి (Hine-raumati) కుమారుడు తానే-రోరే (Tāne-rore) నుండి హాకా ఉద్భవించిందని వారి సంప్రదాయం చెబుతుంది. వేసవి రోజుల్లో వేడి వల్ల గాలి వణుకుతున్నట్టు కనిపించడాన్ని తానే-రోరే నృత్యంగా భావిస్తారు. ఈ వణుకు (quivering) చలనాలు హాకాలో చేతులు, శరీరం వణకడంలో ప్రతిబింబిస్తాయి అంటారు.
జీవన విధానం
మావోరి (Maori) అనేది న్యూజిలాండ్‌కు చెందిన స్థానిక ఆదివాసీ (Indigenous) సమూహం. వీరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్కృతి, సంప్రదాయాలు కలిగినవారు. ముఖ్యంగా ప్రకృతి ఆరాధన, పూర్వీకుల గౌరవం, సమూహ ఐక్యతపై ఇది ఆధారపడి ఉంటుంది. వారి జీవన విధానం విషయానికి వస్తే.. సాంప్రదాయికంగా అడవులు, సముద్రం మధ్యలో భూమితో మమేకమై ఉంటుంది. వీరు వంశపారంపర్యంగా హాకా (Haka) అనే శక్తివంతమైన నృత్యం, గీతాలు, కథలు, టాటూ (Ta Moko) సంప్రదాయాలను కాపాడుకుంటారు. వారి సమాజం గోత్రాలు (Iwi), ఉపగోత్రాలు (Hapu) ఆధారంగా నడుస్తుంది. హాకా అనేది వీరి సంస్కృతికి గుండెలాంటిదని చెబుతారు.






