ప్రసవం తర్వాత ఏడాదికిపైగా.. స్త్రీ శరీరంలో జరిగే మార్పులివే !

by Javid Pasha |

ప్రసవం తర్వాత ఏడాదికిపైగా.. స్త్రీ శరీరంలో జరిగే మార్పులివే !
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా గర్భధారణ, సంతానం వంటివి స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన దశగా భావిస్తారు. అయితే ఇక్కడ సానుకూలతలతో పాటు అధిగమించాల్సిన కొన్ని ప్రతికూల దశలు సైతం ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అధ్యయనాలు సైతం అదే పేర్కొంటున్నాయి. ప్రసవం తర్వాత ఒక స్త్రీ మెదడు, హార్మోన్లు, శరీరం పూర్తిగా ‘రీసెట్’ అవ్వడానికి ఏడాది నుంచి రెండేండ్లు పడుతుందని, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చునని చెబుతున్నాయి. దీనినే ‘పోస్ట్ పార్టమ్ రికవరీ’ స్టేజ్‌గా పేర్కొంటున్నాయి.

హార్మోన్లలో మార్పులు

సాధారణ సమయాల్లోకంటే ప్రసవం తర్వాత స్త్రీల శరీరంలో జరిగే పరిణామాలు భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా హార్మోన్లలో తీవ్రమైన మార్పులు సంభవిస్తుంటాయి. కొన్ని హార్మోన్లు నెలల వ్యవధిలోనే స్థిరపడతాయి. కానీ మరికొన్నింటికి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.

హార్మోన్ల ఆకస్మిక పతనం

గర్భధారణ తర్వాత ప్రసవ సమయంలో ప్లాసెంటా బయటకు వచ్చిన వెంటనే స్త్రీ శరీరంలో ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్టెరాన్ స్థాయిలు వేగంగా పడిపోతాయి. ఇవి గర్భధారణ సమయంలో అత్యధిక స్థాయిల్లో ఉంటాయి. కాబట్టి సడెన్‌గా తగ్గడం అనేది ‘బేబీ బ్లూస్’కి దారితీస్తుంది. అంటే ప్రసవం తర్వాత మొదటి 2 వారాల్లో చిరాకు, ఆందోళన, లోన్లీనెస్, డిప్రెషన్ వంటి తాత్కాలిక మూడ్ స్వింగ్స్‌కు కారణం అవుతాయి.

ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ ప్రభావం

ప్రసంవం తర్వాత తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ప్రొలాక్టిన్ (Milk producing hormone), అలాగే ఆక్సిటోసిన్ (bonding hormone) స్థాయిలు నెలల తరబడి ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్ల మార్పులు అండోత్సర్గాన్ని (Ovulation) అణచివేస్తాయి. దీంతో యోని పొడిబారడం, లిబిడో తగ్గడం వంటి మార్పులు సంభవిస్తాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది.

స్ట్రెస్ హార్మోన్ ఎఫెక్ట్

ప్రసవం తర్వాత మూడ్ స్వింగ్స్ సహజంగానే ఒత్తిడికి గురిచేస్తుంటాయి. దీంతో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఆందోళన, అలసట, ఒంటరితనం, డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడం, నియంత్రించడాన్ని నిరోధిస్తుంది. దీనిని కోలుకోవడానికి సమయం పడుతుంది.

థైరాయిడ్‌ ప్రభావం

కొంతమంది స్త్రీలు.. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యల చరిత్ర ఉన్నవారు. ప్రసవం తర్వాత థైరాయిడ్ డిస్‌ఫంక్షన్‌ను నెలల తరబడి అనుభవిస్తారు. ఇది మానసిక స్థితిని, శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌ను ప్రభావితం చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను మరింత దెబ్బతీస్తుంది. అయితే వైద్య నిపుణుల సలహాలు పాటించడం, సంతోషకరమైన కుటుంబ వాతావరణం, సానుకూల ఆలోచనలు ప్రసవం తర్వాత ఏర్పడే మూడ్ స్వింగ్స్ నుంచి త్వరగా కోలుకోవడంలో కొంత వరకు సహాయపడతాయని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది. ఇది వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు. Link

Next Story