- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Valentine's Day 2026 : ఏది ప్రేమ? ఏది భ్రమ?
ప్రేమకు కులం లేదు.. మతం లేదు. మనసుకు నచ్చితే చాలు. అయినా కుల మతాలనేవి మనిషి క్రియేట్ చేసుకున్న బందీఖానా లాంటివి. వాటినే పట్టుకొని వేలాడితే.. వాటి పరిధిలోనే ఉంటే.. సంతోషంగా ఉండలేం.

దిశ, ఫీచర్స్ : ‘ప్రకృతిలోని అందాలన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడినా కలగని ఆనందం నిన్ను చూస్తే కలుగుతుంది. కానీ.. నువ్వు చేసిందేమిటి?’’ ఓ భగ్న ప్రేమికుడి మనోవేదనిది. నీతో ఎన్నో చెప్పాలని కంప్యూటర్ కీ బోర్డుమీదికి చేతులను పోనిచ్చాను. కానీ ఫింగర్స్ ముందుకు కదలడం లేదు. వాలెంటైన్స్ డే రోజు ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలనుకున్న కానీ.. డైలమా వీడట్లేదు. ఏవేవో ఆలోచనలు, మరేవో సందేహాలు. ఒక వేళ నువ్వు కాదంటే ఏమై పోతానోననే భయం వెంటాడుతోంది.. అందుకే అలా..’’ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఓ యువతి జ్ఞాపకాల డైరీలో నిక్షిప్తమైన ప్రేమ మధురిమలివి. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు.. ఎన్ని హృదయాలను కదిలిస్తున్నదో ప్రేమ.. ఎన్ని గుండెలను తట్టిలేపుతున్నదో ప్రేమ. ఎన్ని జ్ఞాపకాలను పోగేసుకున్నదో ప్రేమ.. అందుకేనేమో వాలెంటైన్స్ డే నేపథ్యంలో ఏది ప్రేమ.. ఏది భ్రమ అనికొందరు ఆలోచిస్తుంటే.. ప్రేమా.. ఏది నీ చిరునామా? అంటూ వెతుక్కుంటున్నాయి మరికొన్ని యువ హృదయాలు.
సందేహాలు.. ఆనంద పారవశ్యాలు
యెస్.. ప్రేమలో విరహ వేదనలు.. ఆనంద పారవశ్యాలు కామన్. అక్కడ సందేహాలు, సమస్యలు, సవాళ్లు, భావోద్వేగాలు ఉంటాయి. వేదనలు, విషాదాలు కూడా వెంటాడుతుంటాయ్. ఒక్కొక్కరి విషయంలో ఒక్కో అనుభవాన్నో, అనుభూతినో మిగిల్చి ఆటాడుకుంటుంది ఇష్క్. ప్రేమలో పడితే మండు వేసవి కూడా పండు వెన్నెలైనట్లు ఫీలైతరు కొందరు. అదే ప్రేమలో విఫలమైతే..? పండు వెన్నెల కూడా మండు వేసవై దహిస్తున్నట్లు బాధపడతారు మరి కొందరు. అందుకే ప్రేమల విషయంలో జర జాగ్రత్త.. అంటుంటారు పెద్దలు. ఆచితూచి అడుగేయాలని చెప్తుంటారు అనుభవజ్ఞులు. కొన్నాళ్ల అవసరం కోసమో, కోరికలు తీర్చుకోవడం కోసమో ప్రేమను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయించవద్దనే ప్రేమ పాఠాలు కూడా ‘వాలెంటైన్స్ డే’ చరిత్రలో కోకొల్లలు.
అనుకూలమా.. ప్రతికూలమా?
ప్రేమికుల రోజు.. వాలెంటైన్స్ డే.. పేరేదైనా దీని చుట్టూ అనేక అంశాలు ముడివడి ఉన్నాయి. వాలెంటైన్ జీవితానుభవాల ఆధారంగా పుట్టుకొచ్చిన ఈరోజు కొందరికి ఆమోదం యోగ్యమైతే.. మరి కొందరికి వికృత చేష్టగా తోస్తుంది. విచిత్రం ఏమిటంటే.. ప్రేమ, ప్రేమ సంబంధిత విషయాలు, వాలెంటైన్స్ డే గురించి కనిపించే.. వినిపించే అన్ని వాదనలకూ సమాజంలో బలం చేకూర్చే ఆధారాలుంటాయి. అనుకూల, ప్రతికూల అభిప్రాయాలకు తగిన సందర్భాలు, సంఘటనలు, సన్నివేశాలు సినిమాల్లో, సమాజంలో, నిజ జీవితాల్లో మస్తు కనిపిస్తుంటాయి. అందుకే ప్రేమించడం, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, నచ్చినా నచ్చకపోయినా పెద్దలు కుదుర్చిన వివాహాలే చేసుకోవడం వీటిలో ఏది బెటర్? అనే సందేహాలకు సమాధానాలు చాలానే ఉన్నప్పటికీ ఎవరి కోణం వారిది! ఎవరి అభిప్రాయం వారిది.
ప్రేమిస్తే తప్పేంటి?
సామాజిక కోణంలో ఆలోచించినప్పుడు.. సామాజిక స్పృహ కలిగి ఉన్నప్పుడు దాదాపు ప్రేమను, ప్రేమికుల రోజును వ్యతిరేకించడంలో అర్థం లేదని కూడా నిపుణులు చెబుతుంటారు. మేజర్లు అయిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వారు పరస్పరం అర్థం చేసుకుంటారు. జీవితంపట్ల అవగాహన కలిగి ఉంటారు. అలాంటప్పుడు కలిసి జీవించాలనుకోవడంలో తప్పేముంది? ఇలాంటప్పుడే.. సమాజం, పెద్దలు అర్థం చేసుకోవాలి. కుల, మతాలకతీతంగా ప్రేమను, ప్రేమికుల అభిప్రాయాలను గౌరవించాలి. ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహించాలి. ఎందుకంటే.. ప్రేమకు కులం లేదు. మతం లేదు. మనసుకు నచ్చితే చాలు. ‘అయినా కుల మతాలనేవి మనిషి క్రియేట్ చేసుకున్న బందీఖానా లాంటివి. వాటినే పట్టుకొని వేలాడితే.. వాటి పరిధిలోనే ఉంటే.. సంతోషంగా ఉండలేం.. మెరుగైన సమ సమాజాన్ని సాధించలేం’ అంటుంటారు సామాజికవేత్తలు. అందుకే వాటిని బద్దలు కొట్టి బయటకు రావడం ఆధునిక సమాజానికి అవసరమని చెబుతుంటారు. వాలెంటైన్స్ డేను కూడా అందుకు ఒక అవకాశంగా మల్చుకోవడంలో, జరుపుకోవడంలో తప్పులేదు. సో.. హ్యాపీ వాలెంటైన్స్ డే !






