- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.7000తో స్మార్ట్‌ఫోన్ కొనుక్కొని.. "మసాలా బ్రాండ్"కు ఓనర్ అయింది
స్మార్ట్‌ఫోన్ ఆంత్రప్రెన్యూర్.!

దిశ, ఫీచర్స్: స్మార్ట్‌ఫోన్ మోజులో పడి.. ఒకదిక్కు యువత భవిష్యత్‌ను పాడు చేసుకుంటుంటే.. కొందరు అదే స్మార్ట్‌ఫోన్‌తో కెరీర్‌ను డెవలప్ చేసుకుంటున్నారు. అలాంటివారిలో కౌసల్య చౌదరీ ఒకరు. ఆమె రూ.7000తో స్మార్ట్‌ఫోన్ కొనుక్కొని.. ఇవాళ "మసాలా బ్రాండ్"కు ఓనర్ అయింది.
రాజస్థాన్‌లోని "కురి" అనే చిన్నపాటి గ్రామం. సాంప్రదాయ ఆంక్షల మధ్యలో పెరిగిన కౌసల్య చౌదరి అనే ముప్పయేళ్ల యువతి యూట్యూబ్‌లో రాజస్థానీ వంటకాలను పంచుకొని 16 లక్షల ఫాలోవర్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతేకాదు.. "సిధీ మార్వాడీ" అనే సొంత మసాలా బ్రాండ్‌ను స్థాపించి 35కి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.
ఇంటర్ చదువుకొని..
కౌసల్యది వ్యవసాయ కుటుంబం. పొద్దున స్కూలుకెళ్లేది. మధ్యాహ్నం ఇంటికొచ్చి ఇంటి పనులన్నీ పూర్తిచేసుకొని సాయంత్రం పొలం కాడికి పోయేది. పొలంలో పనీ.. ఆవులకు గడ్డి వేయడం.. నీళ్లు తాపించడం ఆమె దినచర్య. నలుగురు తోబుట్టువుల్లో కౌసల్య పెద్దది. తల్లి తీరికలేకుండా పనిచేసేది. కాబట్టీ కౌసల్యే వంటింటి పనులు చూసుకునేది. అలా వంట పట్ల ఆసక్తి పెరిగింది. ఇంటర్లో బైపీసీ తీసుకుంది. ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసి.. ఎంబీబీఎస్ చేయాలని కలగన్న కౌసల్య ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతుంటేనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఉపాధి అవకాశఆలు లేకపోవడం.. సాంప్రదాయ ఆంక్షలు ఆమెను ఇంటికే పరిమితం చేశాయి. 12 ఏళ్లు చదువుకొని మళ్లీ పొలం పనే చేయాలా అనే ఆలోచనతో వేరే ఇంకేదైనా సాధించాలి అని నిశ్చయించుకుంది.
స్మార్ట్ ఐడియా
2017లో ఐదేళ్ల బాలుడొకరు యూట్యూబ్‌లో సంపాదిస్తున్న వార్త ఆమెలో ఆసక్తిని రేకెత్తించింది. అప్పటివరకు స్మార్ట్‌ఫోనే లేని వాళ్లత్తమ్మను ఫోన్ కొనివ్వమని అడిగింది. అప్పుడామె రూ.3000 ఇచ్చింది. అయితే కౌసల్య తన దగ్గరున్న డబ్బులను తోడుచేసి రూ.7000కి సామ్సంగ్ జే2ఎస్ ఫోన్ కొనుగోలు చేసింది. వంటగదిలో వీడియోలు చిత్రీకరించడం ప్రారంభించింది. మొదటి వీడియో "బేసన్ బర్ఫీ" వైరలైంది. ఆ తర్వాత "హల్దీకి సబ్జీ" కూడా వైరలయ్యింది. వీడియోలకు ఆదరణ లభిస్తోంది కానీ.. ట్రైపాడ్ లేక అల్యూమినియం తీగలతో స్టాండ్ తయారుచేసుకుంది. స్టూడియో లైట్లకు బదులు సాధారణ బల్బులను వేలాడదీసింది. ఇంటర్నెట్ సిగ్నల్ లేక.. రాత్రులు ఇంటి పైకప్పుపై గంటల తరబడి వీడియోలు అప్లోడ్ చేసేది. ఎడిటింగ్ నేర్చుకోవడానికి ట్యూటోరియల్స్ చూసేది.
ఒక్క నెలలో రూ.1లక్ష
సోషల్ మీడియాలో వీడియోలు చేయడం తమ సంస్కృతికి వ్యతిరేకం అని బంధువుల నుంచి క్రమంగా విమర్శలు రావడం మొదలయ్యాయి. అయినా తాను ఇవేవీ పట్టించుకోలేదు. తన భర్త వీరేంద్ర కుమార్ కౌసల్యకు అండగా నిలిచాడు. "అవన్నీ కాదు.. నువ్వయితే వీడియోలు తీయి. నేనున్నా కదా" అని సపోర్ట్ చేశాడు. మొదట్లో హిందీలో వీడియోలు చేసేది. ఒకసారి వాళ్లత్తమ్మ "వీడియోలో కొత్తిమీర అని ఎందుకంటవ్.. ధనియా అని మన భాషలో అనొచ్చు కదా" అని సలహా ఇచ్చింది. అప్పడర్థమైంది కౌసల్యకు.. స్థానిక భాషకున్న గొప్పదనం ఏంటో. ఇక అప్పటి నుంచి స్వచ్ఛమైన రాజస్థానీ భాషలో వీడియోలు చేయడం ప్రారంభించింది. ఫలితంగా ఒక్క నెలలోనే లక్షమంది సబ్‌స్క్రయిబర్స్ అయ్యారు. కోట్లలో వ్యూస్ వచ్చాయి. ఒక్క నెలలోనే రూ.1లక్ష ఆదాయం వచ్చింది.
35 మందికి ఉపాధి
2023లో "మాస్టర్ షెఫ్ ఇండియా" నుంచి ఆహ్వానం వచ్చినప్పుడు కౌసల్య మొదట తమాషా కాల్ అనుకుంది. జోధ్‌పూర్.. ఢిల్లీ.. ముంబైలో ఆడిషన్లు దాటి.. రాజస్థాన్ నుంచి టాప్ 12లో నిలిచిన ఏకైక పార్టిసిపెంట్‌గా నిలిచింది. కచ్చీ హల్దీకి సబ్జీ.. కుగా రోటీ.. మఖనీయ లస్సీ వంటి సాంప్రదాయ వంటకాలతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. సోషల్ మీడియా ఇచ్చిన పాపులారిటీతో 2024లో "సిధీ మార్వాడీ" బ్రాండ్‌తో మసాలాల తయారీని ప్రారంభించింది. మొదటి బ్యాచ్ అమ్ముడయ్యే నాటికి 15 ఔట్‌లెట్స్‌తో విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. కౌసల్య ఫ్యాక్టరీలో 35 మంది గ్రామీణ మహిళలు ఉపాధి పొందుతున్నారు. చూశారా కౌసల్య స్మార్ట్‌ఫోన్‌ను సద్వినియోగం చేసుకొని తనతో పాటు ఎంతమందికి ఆదాయ మార్గాలు చూపిస్తుందో.?






