Health : క్యాన్సర్ చికిత్సలో మరో కొత్త పద్ధతి.. ఫొటో థర్మల్ థెరపీ!

by Javid Pasha |   (  Updated:2026-05-21 08:12:41  IST  )

ఫొటోథర్మల్ థెరపీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే నాశనం చేస్తుంది. ఆరోగ్యకరమైన కణాలకు ఎటువంటి హానీ చేయదు.

Health : క్యాన్సర్ చికిత్సలో మరో కొత్త పద్ధతి.. ఫొటో థర్మల్ థెరపీ!
X

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్ నివారణలో భాగంగా మరో కొత్త చికిత్సా పద్ధతిని అభివృద్ధి చేశారు పరిశోధకులు. ఇది ఎల్ఈడీ కాంతి, అలాగే టిన్ ఆక్సైడ్ (Tin oxide)ఆధారిత నానోఫ్లెక్స్‌(SnOx nanoflakes)ను సమ్మేళనం చేయడం ద్వారా స్కిన్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని చెబుతున్నారు. యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టిన్ (University of Texas at Austin) & యూనివర్సిటీ ఆఫ్ పోర్చుగల్ పరిశోధకులు కలిసి దీనిని డెవలప్ చేశారు. దీనివల్ల క్యాన్సర్ చికిత్సలో ఎటువంటి ఫలితాలు వచ్చాయి? ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

92% క్యాన్సర్ కణాల నాశనం..

రీసెర్చ్‌లో భాగంగా కొత్త క్యాన్సర్ చికిత్సా పద్ధతిని పరిశీలించినప్పుడు ల్యాబ్ పరీక్షల్లో 30 నిమిషాల్లోనే లక్ష్యం ఛేదించగలిగామని పరిశోధకులు చెబుతున్నారు. ల్యాబ్ పరీక్షల్లో చర్మ క్యాన్సర్ కణాలలో 92% వరకు నాశనం అయినట్లు వారు గుర్తించారు. ముఖ్యంగా ఈ చికిత్స ఫొటో థర్మల్ థెరపీ (photothermal therapy) ఆధారంగా పనిచేస్తుంది. నానోఫ్లేక్స్ కాంతిని గ్రహించి స్థానికంగా వేడిని ఉత్పత్తి చేసి, క్యాన్సర్ కణాల మెంబ్రేన్& ప్రోటీన్లను దెబ్బతీసి వాటిని నాశనం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

సంప్రదాయ చికిత్సకు భిన్నంగా..

ఫొటోథర్మల్ థెరపీలోని మరో ప్రత్యేకత ఏమిటంటే.. దాని ఖచ్చితత్వమే అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఇది క్యాన్సర్ కణాలను మాత్రమే టార్గెట్ చేసి నాశనం చేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మ కణాలకు ఎటువంటి హానీ చేయదు. సంప్రదాయ చికిత్సలైన కీమోథెరపీ లేదా ఇతర పద్ధతులతో పోలిస్తే.. ఇది చాలా సురక్షితమని, తక్కువ బాధాకరమైనదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా లేజర్లకు బదులుగా సాధారణ నియర్-ఇన్‌ఫ్రారెడ్ ఎల్ఈడీ కాంతిని ఉపయోగించడంవల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. ఇప్పటి వరకైతే ప్రీక్లినికల్ ట్రయల్స్‌లో ఈ చికిత్స మంచి ఫలితాన్ని ఇచ్చింది. చర్మ క్యాన్సర్‌తో కొలెరెక్టల్ క్యాన్సర్ కణాలపై కూడా 50% వరకు ప్రభావం చూపింది. భవిష్యత్తులో సర్ఫేస్ లెవెల్ ట్యూమర్లకు నాన్-ఇన్వేసివ్ చికిత్సగా మారే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Next Story