గోల్డ్‌ కన్నా ల్యాండ్ కొనుడే బెస్ట్.. ప్రధాని స్టేట్మెంట్‌తో ప్రచారం

by Sujitha Rachapalli |

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది బంగారం కొనొద్దన్న స్టేట్మెంట్‌ను రియల్ ఎస్టేట్ బాగా వినియోగించుకుంటుంది.

గోల్డ్‌ కన్నా ల్యాండ్ కొనుడే బెస్ట్.. ప్రధాని స్టేట్మెంట్‌తో ప్రచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఓ సంవత్సరం పాటు బంగారం మీద ఇన్వెస్ట్ చేయొద్దు’.. అని చెప్పారు ప్రధాని మోడీ. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ప్రచార ఊపందుకుంది. బంగారం కాదు, భవిష్యత్తు ముఖ్యం. భూమి మీద పెట్టుబడి పెట్టండి.. భావి తరాలకు సంపద సృష్టించండి. భూమిపైన పెట్టుబడి పెట్టడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని ప్రకటనలు ఇస్తున్నారు. మొత్తానికి ప్రధాని మోడీ బంగారం కొనొద్దన్న ఒక్క సూచనను రియల్టర్లు ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. ఆయన దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పలు సూచనలు చేశారు. బంగారంతో పాటు దుబారా చేయొద్దని పిలుపునిచ్చారు. ఐతే ఇప్పుడిది రియల్ ఎస్టేట్ సంస్థలకు, ఏజెంట్లకు ఆఫర్‌గా కనిపిస్తుంది. దీన్నే ఆసరాగా చేసుకొని బంగారం కొనకండి.. మా వెంచర్‌లో ఓ ప్లాట్ కొనండి. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది. మంచి లాభాలు వస్తాయంటూ.. మోడీ హైదరాబాద్ సభ తర్వాత సోషల్ మీడియా వేదికగా ప్రచారం నడుస్తుంది. పలు కంపెనీలు కూడా ఏజెంట్ల సమావేశాల్లో దీన్నే జనాల్లోకి తీసుకెళ్లాలంటూ ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పుడు భూమే బంగారమని చెబుతున్నారు. ఇక గోల్డ్ వద్దు, ల్యాండ్ బెస్ట్ అంటూ నినాదాలు చేస్తున్నారు. నిజానికి బంగారం, వెండి ధరలు పెరిగినట్లుగా, అదే స్థాయిలో భూముల ధరలు పెరగడం లేదు. కానీ ప్రస్తుతం ఆర్ధిక మాంధ్యం కారణంగా బంగారం కొనుగోలు మీద సుంకాన్ని పెంచారు. దాంతో మరింత కాస్లీగా మారింది. ఈ క్రమంలో భూములు కొనడమే బెస్ట్ అంటున్నారు.

ఐతే ఏది బెటర్​

ప్రస్తుతం రియల్ ఎస్టేట్, బంగారం ఈ రెండింటిలో ఏది బెటర్​? పెట్టుబడిదారులకు ఇదో పెద్ద సవాల్‌గా మారింది. ఎవరైనా ఎక్కువ లాభాలు ఎక్కడ వస్తే ఆ రంగం వైపే వెళ్తారు. ప్రస్తుతానికి బంగారం ధర మాత్రమే విపరీతంగా పెరుగుతున్నది. ఇదే క్రమంలో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మందగించింది. ఏ రంగంలోనైనా పెద్దగా బూమ్ లేనప్పుడు పెట్టుబడి పెడితే బూమ్ వచ్చినప్పుడు లాభాల పంట పండుతుందనేది అందరికీ తెలిసిందే. దీని ప్రకారం బంగారమా.. రియల్ ఎస్టేట్ రంగమా అనేది తేల్చుకోవాలి. పెరుగుతున్న బంగారాన్ని కొనాలా? భూమిని కొనాలా? అనే ప్రశ్నకు ప్రస్తుతానికి బంగారం కొనొద్దన్న ప్రధాని మోడీ సూచనతో సమాధానం లభించింది.

భూమి కొంటే గొప్ప లాభాలు

- అధిక రాబడి: భూమి విలువ కాలక్రమేణా పెరుగుతుంది. పెట్టుబడిపై అధిక లాభాలు సంపాదించొచ్చు.

- సురక్షితమైన పెట్టుబడి: స్టాక్ మార్కెట్, గోల్డ్ కొంటే ధరలు తగ్గుతాయో, పెరుగుతాయో తెలియదు. కానీ భూమి ఎప్పుడూ సురక్షితమే. స్థిరమైన పెట్టుబడి. పెట్టిన పెట్టుబడి మాత్రం ఎక్కడికి పోదు. ఏ రోజు అమ్మేసినా తిరిగొస్తుంది.

- అద్దె ఆదాయం: కమర్షియల్, రెసిడెన్షియల్ భూముల్లో పెట్టుబడి పెడితే నిరంతరం ఆదాయం వస్తుంది.

- భవిష్యత్తుకు భరోసా: మీ పిల్లల భవిష్యత్తుకు, రిటైర్మెంట్ ప్లాన్‌కు భూమి బెస్ట్ ఆప్షన్‌గా ఉపయోగపడుతుంది. మీ దగ్గరున్న డబ్బులు ఎవరికి ఇచ్చినా తిరిగి రావడం కష్టం. గోల్డ్ కొనొచ్చు. కానీ దాని ధర అందనంత ఎత్తులో ఉంది. పైగా ట్యాక్స్‌లు పెంచారు. అందుకే భూములు కొనుక్కోవడమే మంచిది.

- హైదరాబాద్ అభివృద్ధి: హైదరాబాద్‌లో మెట్రో, ఐడీ కారిడార్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విస్తరణతో భూమి విలువ వేగంగా పెరుగుతుంది. ఎన్నటికీ తగ్గే అవకాశం ఉండదు.

ఎక్కడ కొనాలి?

- ఎక్కడ అభివృద్ది చెందుతున్న ప్రాంతాలు ఉన్నాయో వెతకాలి. హైదరాబాద్‌కి అత్యుత్తమ రోడ్డు కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. భూముల విలువలు ఎక్కడ ఎక్కువగా పెరుగుతున్నాయో సెర్చ్ చేయాలి. ఏదైనా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ మధ్యలో ధరలు అధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రిపుల్ అవతలి వైపుకు కూడా చాన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారు ట్రిపుల్ అవతలి వైపు తిరిగి కొనుగోలు చేయడం అనివార్యం.

- రెసిడెన్షియల్ జోన్: భవిష్యత్తులో నివాసాలు, వ్యాపార అభివృద్ధికి దోహదపడే ఏరియాల్లో భూములు కొనడం ఉత్తమం. నివాసాలు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, వేర్ హౌజ్‌లు వంటి ప్రతిపాదిత ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాలు బెస్ట్. ప్రకృతికి దగ్గరగా, ప్రశాంత వాతావరణం ఉండే ఏరియాల్లోనే డెవలప్‌మెంట్ అవుతుంది.

- సురక్షితమైన పెట్టుబడి : ఎక్కడ భూములు కొనడం అనేది ఎంత ప్రధానమో.. ఆ భూమి టైటిల్ అంత కంటే ఇంపార్టెంట్. డాక్యుమెంట్ పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేవో సరి చూసుకోవాలి. లీగల్, రెవెన్యూ ఒపినీయన్ తీసుకోవాలి. లీగల్ సెక్యూరిటీ లేకపోతే లాభాల సంగతి ఏమో గానీ మానసిక ప్రశాంతత కోల్పోతారు.

- పెట్టుబడికి లాభాలు రావాలి : ఎవరైనా వారు సంపాదించే దాంట్లో ప్రతి రూపాయిని కాపాడుకుంటూ వస్తారు. సంపాదించిన దాంట్లో ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేస్తుంటారు. ఆ సేవింగ్ అమౌంట్‌నే ఏదో ఒక‌ రంగంలో పెట్టుబడిగా పెట్టాలనుకుంటారు. పిల్లల భవిష్యత్తు, చదువులు, పెళ్లిళ్లు లక్ష్యంగా ఆస్తులను కూడబెట్టాలని భావిస్తారు. ఎంతైనా కష్టపడి సంపాదించిన డబ్బులను ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే సురక్షితంగా ఉంటుంది? ఏ రంగంలో ఎక్కువ రాబడి ఉంటుంది? అనేది బేసిక్ క్వశ్చన్స్. నిన్న మొన్నటి వరకు అందరూ భూములపైనే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించారు. ఐతే గడిచిన రెండేండ్లుగా పెట్టుబడి బంగారం, వెండి వైపు తిరిగింది. తాము కూడబెట్టుకున్న డబ్బులతో బంగారం కొనుక్కునేవారు కూడా ఎక్కువయ్యారు. బంగారమైతే తమ దగ్గరే ఉంటుందన్న భరోసా. ఎప్పుడంటే అప్పుడే అమ్మేసుకోవచ్చునన్న నమ్మకం. ఐతే ఇప్పుడైతే ల్యాండ్, షేర్ మార్కెట్ మాత్రమే మిగిలాయి.

Next Story