- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెల్మెట్ లైట్ తీస్కో.. పోతే పోనీ ప్రాణాలు.!!
సోకు ముఖ్యంకాదు.. సేఫ్టీ ముఖ్యమనీ.?

మనం వినం.
ఎందుకు వింటాం.?
ప్రాణాలంటే లెక్కలేదు కదా.?
జీవితమంటే తోలుబొమ్మలాట కదా.?
స్టయిల్‌గా సన్ గ్లాసెస్ పెట్టుకుని..
కూల్‌గా మూన్‌లైట్‌లా మెరుస్తూ..
రయ్‌మని బైక్ తీసి..
రఫ్ఫున పోతుంటే..
అరే ఏమన్నవోతుండారా..
అచ్చం హీరో లెక్కనే ఉండు..
అని సోకుల సోపతి మెచ్చుకుంటే చాలు.
కానీ.. ఎప్పుడైనా ఆలోచించారా.?
సోకు ముఖ్యంకాదు.. సేఫ్టీ ముఖ్యమనీ.?
- దాయి శ్రీశైలం
యాక్సిడెంట్.. కుటుంబాల్ని ఛిద్రం చేస్తుంది. బంధాల్ని బలితీసుకుంటుంది. పిలల్ని అనాథలను చేస్తుంది. జీవితాలను ఆగం చేస్తుంది. అందుకే ప్రయాణం ప్రమాదరహితం కావాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రోడ్ సేఫ్టీపై అవగాహన పొందాలి. సోకులదేముంది బాస్.. ప్రాణాలతో ఉంటే ఏమైనా చేయొచ్చు.
ఎవరి కోసమో కాదు..
ఇంటి నుంచి బయల్దేరిన మనిషి.. తిరిగొచ్చేదాక ఒకటే టెన్షన్. ఎట్లొస్తడో అని. డాడీ ఏం తెస్తడో అనే ఎదురుచూపు పిల్లలది. ఇంతమంది నిరీక్షణ తర్వాత ఆ మనిషి గాయాలతో ఇంటికొస్తే ఎంత బాధైతుంది.? యాక్స్‌డెంటైందనే ఫోన్ కాలొస్తే ఎంత వణికిపోతాం.? చేజేతులా జీవితాన్ని ఆగం చేసుకోవడమంటే ఇదే. మన జాగ్రత్తలను చూసి యాక్సిడెంటే యాబైకిలోమీటర్లు పారిపోవాలి. చూస్తున్నాం కదా.? హెల్మెట్ లేకపోవడం వల్ల ఎందరి జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయో.? ఎంతమంది ఆగమైతున్నారో.? హెల్మెట్ అనేది ఎవరో చెప్తే పెట్టుకునే మొక్కుబడి పరికరం కాదు.. మనకోసం ధరించే సేఫ్టీ గార్డ్.
అయ్యా హెల్మెట్‌రా..
ఒక యదార్ధ ఘటన. భాస్కర్ చిత్రకారుడు. అతడికి భార్య.. ఆర్నెళ్ల వయసున్న చంటి పాప. భార్యాభర్త అన్యోన్యంగా ఉండేవాళ్లు. భార్య.. పాపే భాస్కర్ ప్రపంచం. ఒకసారి ఫ్రెండ్స్ ఏం మామా.. ఇంట్లకెంచి బయటకెళ్లవా..? ఔటింగ్‌కి పోదాం నడువ్ అనేసరికి మనోడు రెడీ అన్నాడు. బైక్స్ మీద ప్రయాణం. అయ్యా హెల్మెట్ తీసుకోరా అని వాళ్లమ్మ చెప్పింది. నాకేమైతదే అని హెల్మెట్ లేకుండానే వెళ్లాడు. కట్‌చేస్తే తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్.. భాస్కర్.. తనతో పాటు ఉన్న మిత్రుడికి తీవ్ర గాయాలయ్యాయి. భాస్కర్ తల నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. ఆర్నెళ్లపాటు కోమాలో ఉండి చనిపోయాడు. ఫ్యామిలీ చిన్నాభిన్నమైంది. భాస్కర్ భార్య కుటుంబం నుంచి విడిపోయే వేరే పెండ్లి చేసుకుంది. పాపం.. పసిపాప అనాథయ్యింది.
ప్రాణం రోడ్డు పాలా.?
అయ్యా హెల్మెట్‌రా అని తల్లి అంత ఆప్యాయతతో.. అవగాహనతో చెప్తే భాస్కర్‌లా చాలామంది పెడచెవిన పెడతారు. కొందరైతే నాకేమైతదీ.. నేనేమన్నా ముసలోడినా అని కసురుకుంటారు. ఇక్కడ హెల్మెట్ పెట్టుకోవడానికి ముసలొళ్లు.. వయసొళ్లు అనే తేడా ఏంటి.? ముంచుకొచ్చే యాక్సిడెంటుకు ముసలి.. వయసు అనే సెంటిమెంట్లు ఉంటాయా.? సరే.. మనం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తుండొచ్చు. కానీ ఎదురుగా వచ్చేవాడు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే పరిస్థితి ఏంటి.? వాడి దరిద్రమో.. మన దరిద్రమో అది మన మీదికి దూసుకొస్తే ఆగమయ్యేది ఎవరు.? పోయేది ఎవరి ప్రాణం.? విరిగేది ఎవరి కాళ్లు.? ప్రాణాలను సైతం అడ్డేసి తల్లిదండ్రులు మనకిచ్చిన ఈ ప్రాణాన్ని ఇలా అజాగ్రత్తగా ఉండి రోడ్డుపాలు చేద్దామా.?
ఎవరో చెప్పాలా.?
మనలో చాలామంది హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసొల్లు పట్టుకుంటారు అనే అభిప్రాయంతోనే ఉంటున్నారు. యే.. పోలీసాయన చెప్పకపోతే నీకు నువ్వుగా హెల్మెట్ పెట్టుకోవా.? హెల్మెట్ లేకపోతే నష్టం జరిగేది నీకా.? పోలీసుకా.? ట్రాఫిక్ పోలీసులు కనపడగానే బైక్‌ను రయ్‌మని తిప్పేసి.. రకరకాల స్టంట్లు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అక్కెరకురాని ఆ స్టంట్ల మీద పెట్టే శద్ధ హెల్మెట్ పెట్టుకోవడం మీద పెడితే ఎవరితో మాట పడాల్సిన అవసరం ఉండదు. ఫైన్ కట్టాల్సిన పనే ఉండదు కదా.? ప్రాణం నీదైనప్పుడు.. బైక్‌ను నడిపించేది నువ్వే అయినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలనే సోయి నీకు ఎందుకు ఉండకూడదు. అయినా బర్రెను కొనుక్కొని తలుగుకు భయపడినట్లు.. రూ. లక్షల బైక్ తీసుకొని రూ.500 హెల్మెట్ ఎందుకు తీసుకోరూ.?
షోకేజ్ కోసం కాదు..
కొందరు బుద్ధిగా హెల్మెట్ తీసుకెళ్తారు. కానీ దానిని పెట్రోల్ ట్యాంక్‌పైనో లేక లగేజీ హ్యాండిల్‌కో తగిలేసి ఏంచక్కా రంగుల అద్దాలు పెట్టుకొని దువ్విన తలనే దువ్వుకుంటూ.. ఐదు నిమిషాలకోసారి సైడ్ మిర్రర్‌లో అద్దాల అందాన్ని చూసి మురిసిపోతుంటారు. ఏంటయా హెల్మెట్ పెట్టుకోలేదూ అని అంటే.. వెంట్రుకలు ఊడిపోతాయనో.. లేక చుండ్రు వస్తుందనో.. అదీగాకపోతే నిద్రొస్తుందనో సాకులు చెప్తుంటారు. ఐనా వెంట తీసుకెళ్లిన హెల్మెట్‌ను తలకు పెట్టుకుంటారు కానీ.. షోకేజ్ ఐటమ్‌గా బైక్‌కు తగిలిస్తారా చెప్పండి.? ఇంకా కొందరైతే నేను వెళ్లేది పది కిలోమీటర్లే కదా.. ఐదు కిలోమీటర్లే కదా అని లైట్ తీసుకుంటారు. ఏమో చెప్పలేం. గాచారం బాగలేకపోతే ఆ ఐదు కిలోమీటర్లలోపే ఏదైనా జరిగితే.?
సీట్ బెల్టూ పెట్టుకోరు..
ఒక హెల్మెటనే కాదు. మనొళ్లు కార్లలో వెళితే సీట్ బెల్టు కూడా పెట్టుకోరు. సీట్ బెల్ట్ పెట్టుకోండయ్యా అని కుయ్ కుయ్ అని ఇండికేటర్ సైరన్ వచ్చినా పట్టించుకోరు. చూసీ చూసీ దాన్ని మ్యూట్లో పెడతారు. లేదంటే వెనకసైడ్ నుంచి సీట్ బెల్టును లాక్ చేసి మొత్తానికి ఆ సౌండ్ రాకుండా చూస్తారు తప్పితే.. సీటుబెల్టు ధరిద్దాం అనే ఆలోచించరు. ఎందుకో జనాలకు ప్రాణాలు కాపాడే హెల్మెట్.. సీట్ బెల్ట్ అంటే ఇంత మోటు. అవేమైనా పెట్టుకోకూడని వస్తువులా.? చేయకూడని పనులా.? ఇంకా కొందరైతే రూ.1000 జరిమానా అయినా కట్టేందుకు రెడీగా ఉంటారు కానీ జర్నీలో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోరు. అదేం ఆనందమో.. అదేం సక్కదనమో మరి.?
లెక్కలేం చెప్తున్నాయి.?
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. హెల్మెట్ ధరించడం వల్ల మరణ ప్రమాదాన్ని 40శాతం.. తీవ్ర గాయాల ప్రమాదాన్ని 74శాతం వరకు తగ్గించవచ్చు. నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియా ప్రకారం మనదేశంలో 2023లో జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల 54,568 మంది చనిపోయారు. 2019లో జరిగిన యాక్సిడెంట్లలో హెల్మెట్ లేకపోవడం వల్ల 52,000 మంది చనిపోయారు. ఆ సంవత్సరం మొత్తం 151,113 రోడ్డు ప్రమాదాలు జరిగితే వాటిలో హెల్మెట్ లేకపోవడం వల్ల కలిగిన ప్రమాదాలే అధికం. ఈ మరణాలలో 30,148 మంది బైక్ నడిపిన వాళ్లు కాగా.. 14,518 మంది వెనకాల కూర్చున్నవాళ్లు. చెప్పండి.. నిర్లక్ష్యంతో ఇలా ఉత్త పుణ్యానికే ప్రాణాలను గాల్లో కలిపేసుకుందామా.?
ట్రాఫిక్ రూల్స్ ఎందుకు.?
2024 చివర్లో హైదరాబాద్‌లో 215 మంది రోడ్డు ప్రమాదాల బారినపడితే వారిలో 100 మంది హెల్మెట్ ధరించక పోవడం వల్లనే చనిపోయారు. అది మొత్తం మరణాలలో 46శాతం. మోటార్ వాహన చట్టంలోని 129/177 సెక్షన్ల ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నా.. జరిమానాలు విధిస్తూ.. శిక్షలు వేస్తున్నా ప్రజల్లో భయం లేకుండా పోతోంది. వాళ్లెంత సేపూ హెల్మెట్ వాడకాన్ని.. సీట్ బెల్ట్ వాడకాన్ని ట్రాఫిక్ పోలీసుల కోణం నుంచే చూస్తున్నారు. ఏముంది రూ.200 జరిమానే కదా అని అనుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ అనేవి జరిమానాల కోసం.. ఆదాయం కోసం కాదు.. అది ప్రజల సేఫ్టీ కోసం అని గ్రహించనంత కాలం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉంటాయి.
హెల్మెట్ ధరించకపోతే..
- అమెరికాలో $50- $500 జరిమానా. లైసెన్సు రద్దు.
- జపాన్‌లో ¥20,000- ¥50,000 ఫైన్ వేస్తారు.
- ఆస్ట్రేలియాలో AU$50- AU$344 జరిమానా విధిస్తారు.
- దక్షిణాఫ్రికాలో R500- R1,000 జరిమానా విధిస్తారు.
- చైనాలో CNY 20-200 ఫైన్.
సీట్ బెల్ట్ ధరించకపోతే..
- మోటార్ వెహికిల్ సవరణ చట్టం 2019 ప్రకారం ఇండియాలో ₹1,000 జరిమానా వేస్తారు.
- యునైటెడ్ స్టేట్స్‌లో $25- $200 జరిమానా.
- యునైటెడ్ కింగ్‌డమ్‌లో £100- £500 జరిమానా.
- ఆస్ట్రేలియాలో AU$200- AU$1,000 జరిమానా.
- కెనడాలో CAD 60- CAD 1,000 జరిమానా.
హైదరాబాద్‌లో..
- హెల్మెట్/ సీట్ బెల్ట్ ధరించకపోతే ₹1,000 ఫైన్.
- డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు సస్పెన్సన్.
- మళ్లీ రిపీట్ అయితే జరిమానా, సస్పెన్షన్ రెట్టింపు.
- డ్రైవింగ్ లైసెన్స్‌కు 3 డీమెరిట్ పాయింట్స్ యాడ్ చేస్తారు.
- మోటార్ వెహికిల్ చట్టం 129/177 ప్రకారం ₹200 జరిమానా వేస్తారు.
- నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ప్రకారం.. 2019లో సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల 14,000 మంది ప్రాణాలు కాపాడాయి.
- ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ (IIHS) ప్రకారం సీట్ బెల్టులు ప్రాణాంతక ప్రమాదాన్ని 45%.. తీవ్ర గాయాల ప్రమాదాన్ని 50% తగ్గిస్తాయి.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం సీట్ బెల్టులు రోడ్డు ప్రమాదాల మరణాలను 40% తగ్గిస్తాయి.
- సింగపూర్‌లో కఠినమైన ట్రాఫిక్ చర్యలతో పాటు ప్రజలు స్వతహాగా అవగాహనతో ఆలోచిస్తుంటారు.
- ఇక్కడ సీట్ బెల్ట్ ధరించకపోతే SGD 120 SGD 1,000 ఫైన్ వేస్తారు. 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు.
అపోహలు- వాస్తవాలు
1. హెల్మెట్ ధరిస్తే జుట్టు ఊడిపోతుంది.. చుండ్రు ఎక్కువవుతుంది.
- జుట్టు ఊడిపోదు.. చుండ్రు పట్టదు. కాకపోతే గాలి ఆడక చెమట పడుతుంది. కర్చీఫ్ లాంటిది కట్టుకొని దానిపై హెల్మెట్ పెట్టుకుంటే సరి.
2. హెల్మె్ట్ల పెట్టుకుంటే రోడ్డు సరిగా కనిపించదు.. హారన్ సౌండ్స్ వినిపించవు.
- అలాంటి సమస్యే ఉండదు. నాసిరకం హెల్మెట్లు కాకుండా బ్రాండెడ్‌వి వాడితే విజర్లు.. చెవి కటౌట్‌లు ఉండి దృష్టి.. వినికిడి సమస్యలు రావు.
3. హెల్మెట్లు మెడకు గాయాలు కలిగిస్తాయి.
- మెడకు గాయం కావడం అనేది ధరించే హెల్మెట్ మీద ఆధారపడి ఉంటుంది. మోడ్రన్ హెల్మెట్లు వాడాలి.
4. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికే హెల్మెట్స్.
- ప్రమాదానికి కొత్త.. పాత అనే తేడాలేమీ ఉండవు. అందరికీ హెల్మెట్లు అవసరం.
5. చిన్న ప్రయాణాలకు హెల్మెట్లు అవసరం లేదు.
- ప్రయాణం చిన్నదైనా.. పెద్దదైనా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే.
ISI సర్టిఫైడ్ హెల్మెట్
- వేగా: అధునాతన భద్రతా ప్రమాణాలతో దృఢమైన బాహ్య కవచం ఉంటుంది. ధర ₹998
- యమహా: సౌకర్యవంతమైన డిజైనింగ్.. అధిక నాణ్యమైన హెల్మెట్ ఇది. ధర ₹949
- XINOR: ఇది డైనమిక్ వెంటిలేషన్ సిస్టమ్‌తో తయారుచేసింది. ధర ₹535
- ఏరోస్టార్: ఫాగింగ్‌ను నివారించడానికి మంచి వెంటిలేషన్ ఉంది. ధర ₹700
- స్టడ్స్: వినూత్న డిజైనింగ్.. సురక్షితమైన ఫిటింగ్ ఉంటుంది. ధర ₹970
- TRAX రోడ్ సేఫ్టీ NGO రైడ్ టు సేఫ్టీ ఇనిషియేటివ్, సేఫ్ రోడ్ యూజర్స్ ఇనిషియేటివ్ వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
- ఇండియా రోడ్ సేఫ్టీ కాన్‌క్లేవ్ సంస్థ హెల్మెట్ వాడకం ప్రాముఖ్యతపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ చైతన్యం తీసుకొస్తుంది.
- యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ అనే బీమా సంస్థ రోడ్ సేఫ్టీ రేంజర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
- వోకార్డ్ హాస్పిటల్స్ హార్ యా హెల్మెట్ వంటి వినూత్న ప్రచారాలను ప్రారంభించింది.
- గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్మెట్ వాడకం పట్ల రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తోంది.
హెల్మెటే రక్ష: లాలగారి జంగయ్య, ఆరుట్ల
నేను ప్రతీరోజూ బైక్ మీదనే జర్నీ చేస్తుంటా. ఊర్లో కూడా హెల్మెట్ పెట్టుకుంటా. హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలకు గురై.. ప్రాణాలు పోగొట్టుకున్న మిత్రులను చాలా చూశాను. హెల్మెట్ మనకు శ్రీరామరక్ష లాంటిది. దానిని నిర్లక్ష్యం చేయొద్దు.
లైట్ తీసుకుంటారు: సోమనబోయిన పారిజాత, సంస్థాన్ నారాయణపూర్
కొందరు హెల్మెట్ పెట్టుకోమని చెప్తే లైట్ తీసుకుంటారు. నాకేమైతదీ.. నేను మంచిగనే డ్రైవ్ చేస్తా కదా అని అంటుంటారు. వాళ్లు బాగనే డ్రైవ్ చేస్తుండొచ్చు. కానీ అవతలి నుంచి వచ్చే వ్యక్తి నిర్లక్ష్యంగా నడిపితే.. ఇద్దరికీ ప్రమాదమే కదా.? కాబట్టీ హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధన పెట్టుకోవాలి.
స్వీయ నియంత్రణేది.?: నాగమల్లు, ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్
రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయి. 80 శాతం యాక్సిడెంట్స్ హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతున్నాయి. వీటిలో 70 శాతం 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నవారే. హెల్మెట్, సీట్‌బెల్ట్ జీవితాలను ఎలా కాపాడుతాయో పాటలు, సదస్సుల ద్వారా నిత్యం అవగాహన కల్పిస్తున్నా. మేం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో శ్రద్ధ ఉంటేనే ప్రమాదాల తీవ్రతను తగ్గించగలం. ఈ విషయంలో స్వీయ నియంత్రణ.. బాధ్యత తప్పనిసరిగా ఉండాలి.
లైట్ తీసుకోవద్దు: బజారు భిక్షపతి, సామాజిక కార్యకర్త
మేం చేసే సేవా కార్యక్రమాల్లో రోడ్ సేఫ్టీకి ప్రధాన ప్రాధాన్యత ఇస్తుంటాం. కాలేజీల్లో.. సంస్థలల్లో అవగాహన కల్పిస్తుంటాం. కొంత వరకు మార్పు వచ్చింది. కానీ యువత హెల్మెట్ వాడకాన్ని.. సీట్ బెల్ట్ ధరించడాన్ని ఎందుకో లైట్ తీసుకుంటుంది.
అదొకటే ఆయుధం: డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల
మనమీద మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా.. మనల్ని మనం రక్షించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం హెల్మెట్.. సీట్ బెల్ట్. ప్రాణాలను కాపాడుకోవడానికి ఇది ఆయుధం లాంటిది. తలకు దెబ్బకు తాకితే 90 శాతం మామూలు స్థితికి తీసుకురాలేం. చిన్న నిర్లక్ష్యం ఎంతో పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. ఈ మధ్య హాస్పిటల్స్‌కు వచ్చే కేసులను పరిశీలిస్తే చాలామటుకు రోడ్ యాక్సిడెంట్లవే ఉంటున్నాయి. సో.. ఇంట్లోవాళ్లు కూడా చెప్పాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా మనలా ప్రాణం మీద నిర్లక్ష్యం ఉండదు.
Read More..
Childhood Memories:చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు రావట్లేదా!.. అయితే మీకు ఈ సమస్య ఉన్నట్లే?






