- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాటతో.. పేద గుండెలకు ప్రాణం.!
పాటలతో ప్రాణంపోస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చేరింది

దిశ, ఫీచర్స్: చాలామంది సెలబ్రిటీలు ఛారిటీ షోలు చేసి ఫోటోలకు పోజులిస్తారు. కానీ పలక్ ముచ్చల్ వేరు. తన ప్రతీ పాట పేద పిల్లల గుండెకు ప్రాణం పోస్తుంది. తన గాత్రం గరీబుల ఇంట్లో దీపమై వెలుగునిస్తుంది. పాటలతో వేలాదిమందికి ప్రాణంపోస్తూ ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చేరింది.
చారిటబుల్ ఫౌండేషన్..
బాలీవుడ్ మెలోడీ క్వీన్ పలక్ ముచ్చల్ పాడిన ప్రతీ పాట ఒక గుండెకు కొత్త జీవితాన్నిస్తోంది. అలా ఇప్పటివరకు 3800 మంది పేద పిల్లల గుండె ఆపరేషన్లకు ఫండింగ్ చేస్తోంది. తన సేవా దృక్పథంతో లక్షలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇండోర్‌కు చెందిన పలక్ ఒకసారి రైలులో ప్రయాణిస్తుండగా కొందరు పేద పిల్లల పరిస్థితిని చూసింది. ఆ దృశ్యం తన మనసును టచ్ చేసింది. "ఏదో ఒకరోజు వీళ్లను ఆదుకుంటా" అని తనకు తానే మనసులో గట్టిగా అనుకుంది. ఆ సంకల్పంతోనే "పలక్-పలాష్ చారిటబుల్ ఫౌండేషన్"ను స్థాపించింది.
ఒక ఆపరేషన్ రూ.2-4 లక్షలు..
పలక్ పాడిన ప్రతీ పాట.. ప్రతీ కాన్సర్ట్.. ప్రతీ షో రెమ్యునరేషన్ నేరుగా "పలక్-పలాష్ చారిటబుల్ ఫౌండేషన్" ఖాతాలోకి వెళ్తాయి. తన వ్యక్తిగత పొదుపును కూడా పిల్లల ఆపరేషన్ల కోసమే ఖర్చు చేస్తుంది. మిగతా సెలబ్రిటీల మాదిరి తన సంపాదించిన లక్షలాది రూపాయలతో లగ్జరీ కార్లు.. డిజైనర్ బట్టలు కొనుక్కోకుండా పేద పిల్లల గుండె ఆపరేషన్లకు వినియోగిస్తోంది. మామూలుగా గుండె ఆపరేషన్ చేయాలంటే రూ.2–4 లక్షల వరకు అవుతుంది. నెలకు రూ.10 వేలు సంపాదించే కుటుంబానికే ఎంతో కొంత సాధ్యం ఇది. అలాంటి వారికి పలక్ దేవతలా మారి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తోంది.
గిన్నిస్ రికార్డ్..
పాటతో 3800 మందికి పైగా గుండె ఆపరేషన్లకు నిధులు సమకూర్చి.. తన సంగీత కచేరీ ఆదాయాలతో ఆపరేషన్లకు వినియోగించడంతో 2025 నవంబర్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ "హాల్ ఆఫ్ ఫేమ్"లో స్థానం సంపాదించుకుంది. సంగీతంతో సామాజిక సేవ చేస్తున్న తన కృషిని ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డు ప్రతినిధులు కొనియాడారు. షో లేకపోయినా.. ఆదాయం లేకపోయినా ఏ ఒక్క పిల్లవాడి గుండె ఆపరేషన్ ఆగొద్దనే విధంగా ప్లాన్ చేసింది. దీంతోపాటు కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాలకు.. గుజరాత్ భూకంప బాధితులకు రూ.10 లక్షలు ఇచ్చింది.






