ఐదుగురు పిల్లల తల్లి.. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది.!

by Daayi Srishailam |

ఆడవాళ్లకు పెళ్లి.. పిల్లలు అనేవి అడ్డుకాదని నిరూపిస్తోంది.

ఐదుగురు పిల్లల తల్లి.. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది.!
X

సోలో ట్రావెల్ అంటే..

యువకులు..

ఒంటరి పురుషులు మాత్రమే చేస్తారనుకుంటాం.

కానీ.. ఒకావిడ ఐదుగురు పిల్లల తల్లి.

ఇంకా గృహిణి.

కిచెన్ టు హాల్.. హాల్ టు కిచెనే ప్రపంచంగా బతికే గృహిణులున్న ఈ రోజుల్లో..

ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టేస్తోందామె.

అదికూడా థార్ వెహికిల్‌తో.

చూద్దామా.. ఆ ధీరనారి ఎవరో.?

- దిశ, ఫీచర్స్

కేరళలోని కన్నూర్. 35 ఏళ్ల గృహిణి , ఐదుగురు పిల్లల తల్లి నాజీ నౌషీ అడ్డులేని ఆత్మ విశ్వాసంతో.. లడఖ్ పర్వతాల నుంచి యూఏఈ ఎడారుల వరకు.. అంతర్జాతీయ సరిహద్దుల నుంచి సంఘర్షణ ప్రాంతాల వరకు ఆమె ఒంటరి ప్రయాణం చేస్తోంది. అలా అని ఆమె తన ఐదుగురు పిల్లల్ని వదిలేసి ప్రయాణించడం లేదు. తనలాంటి.. తన పిల్లల్లాంటి ఆడవాళ్లందరికీ పెళ్లి.. పిల్లలు అనేవి అడ్డుకాదని నిరూపిస్తోంది.

తొలి ఇండియన్

గృహిణి అంటే సమాజంలో ఏదో చిన్నచూపు. ఆమెతో ఏమవుతుందిలే అనే అభిప్రాయంతో ఉంటారు జనాలు. తన కలల్ని వంటింట్లో తాకట్టుపెట్టి.. కుటుంబం కోసం త్యాగం చేస్తుంది ఏ తల్లి అయినా. ఐదుగురు పిల్లల తల్లి అంటే ఇక అర్థం చేసుకోవచ్చు నాజీ నౌషీ పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఆమె ఆ కథనే మార్చేసింది. 18 ఏళ్లకే పెళ్లి.. 19 ఏళ్లకు తల్లిగా మారి.. ఇరాక్.. ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ధైర్యంగా.. ఒంటరి ప్రయాణాలు చేస్తున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. కిలోమీటర్లు టార్గెట్ కాదు ఆమె లక్ష్యం.. తనలాంటి మహిళలకు ఓ మార్గం చూపిస్తోంది.

ఆంక్షలు దాటి..

నాజీది.. కన్నూర్‌లోని సంప్రదాయ ముస్లీం కుటుంబం. గడపదాటి బయటకు వెళ్లలేని ఆంక్షలు. ఇంటర్ పూర్తయిన తర్వాత తనకు పెళ్లి చేశారు. చిన్న వయసులోనే పెళ్లి.. పిల్లలు కావడంతో కొంత ఆందోళన కలిగింది. ఏదో కోల్పోతున్నాననే బాధ. చదువుకునే వయసులో వంటింటి కుందేలుగా మారిపోవడం ఆమెకు నచ్చలేదు. అందుకే చరిత్ర.. భూగోళశాస్త్రం మీద అవగాహన పెంచుకుంది. క్రమంగా ఆ ఆసక్తి తనలో ప్రయాణ కలలకు జీవం పోసింది. చిన్నప్పడు అమ్మమ్మ చెప్పిన బ్రిటీష్ కాలనీలు.. స్వాతంత్ర్య పోరాటాలే స్ఫూర్తిగా సోలో ట్రావెలర్‌గా మారింది.

25 రోజుల్లో 10 దీవులు

నాజీ భర్త నౌషద్ కూడా ప్రయాణాలంటే ఆసక్తి కలిగిన వ్యక్తే కావడంతో ఆమెకు ప్రోత్సాహం దొరికింది. 2020లో తన చిన్న కూతురు ఆర్నెళ్ల వయసులో ఉన్నప్పుడు నాజీ తన మొదటి సోలో ట్రిప్‌‌ను స్టార్ట్ చేసింది. కేరళలో 10 రోజుల రోడ్ ట్రిప్ అది. 2021 నాటికి ఇండియా మొత్తం కవర్ చేయాలనే ప్లాన్ ప్రిపేర్ చేసింది. 2016లో భర్తతో కలిసి ట్రిప్‌కి వెళ్లాల్సి ఉండగా.. అనూహ్యంగా అతడు డ్రాప్ అయ్యాడు. దాంతో నాజీ ఒంటరిగా ఇండియాలోని 20కి పైగా రాష్ట్రాలను చుట్టేసింది. తన మూడో పెద్ద ట్రిప్ లక్ష్యద్వీప్. అక్కడే 25 రోజులు గడిపింది. 10 దీవులను చుట్టేసింది.

థార్‌తో కలిసి..

ఆమె అత్యంత సాహసోపేత ప్రయాణం 2022లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్. ఎలాంటి పర్వత శిక్షణ లేకుండా.. నేపాల్‌కు డ్రైవ్ చేసి.. 65 కిలోమీటర్ల బేస్ క్యాంప్ ను ఐదు రోజుల్లో చేరుకుంది. సాధారణంగా 12-15 రోజులు పట్టే ఈ ట్రెక్‌ను ఆమె రికార్డు సమయంలో పూర్తిచేసింది. థార్ వాహనం అయితే ఈజీగా ఉంటుందని భావించి 2022లో ఖతార్ చేరుకుంది. థార్‌లో చిన్న వంటగది.. ఇతర సౌకర్యాలతో మొబైల్ హోమ్‌‌‌‌గా మార్చేసింది. 40000 కిలోమీటర్లు.. ఏడు సరిహద్దులను ఒకే ట్రిప్ లో కవర్ చేసి.. ఈ రికార్డు సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.

సవాళ్లను అధిగమించి..

2024 జనవరిలో నాజీ మణిపూర్.. మిజోరాం వంటి సంఘర్షణ ప్రాంతాలను సందర్శించింది. అక్కడ కూలిపోయిన ఇండ్లు.. ఉపాధి లేని ప్రజలను చూసింది. వాటిని డాక్యుమెంటరీలలో దేశంతా ప్రచారం చేసి.. మార్పు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేసింది. ఈ మొత్తం ప్రయాణంలో ఒకవైపు సమాజానికి మెసేజ్ ఇవ్వాలనే ఆలోచన.. ఇంటిదగ్గర పిల్లలు ఎలా ఉన్నారో అనే ఆందోళన.. ట్రిప్‌ల ఖర్చు రోజురోజుకూ పెరిగిపోవడం వంటి ఎన్నో సమస్యలను ఫేస్ చేసింది. వాటిని చూసి నిరుత్సాహ పడకుండా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లింది.

Next Story