ఉద్యోగం వదిలి.. స్వదేశానికి వచ్చి.. అద్భుతం చేశాడుగా..!

by Javid Pasha |

జర్మనీలోని ‘మైండ్‌ట్రీ కంపెనీ’లో పని చేస్తున్న మునీత్ ధీమాన్ ఉద్యోగాన్ని వదిలేసి.. ఇండియా వచ్చి.. విద్యాక్షేత్రాన్ని స్థాపించాడు.

ఉద్యోగం వదిలి.. స్వదేశానికి వచ్చి.. అద్భుతం చేశాడుగా..!
X

దిశ, ఫీచర్స్ : మునీత్ ధీమాన్ జర్మనీలో ఐటీ జాబ్ చేసేవాడు. ఐతే.. తనకు ఆ పనిలో సంతృప్తి లేదు. వెంటనే ఇండియాకు తిరిగొచ్చాడు. ‘విద్యాక్షేత్రం’ అనే పాఠశాలను ప్రారంభించగా దీంట్లో ఇప్పుడు 157 మంది పిల్లలు ఉచితంగా చదువుకుంటున్నారు. చదువుతో పాటు వ్యవసాయం, చేనేత, సంగీతం నేర్చుకుంటున్నారు.

26 స్కూళ్ల సందర్శన..

జర్మనీలోని ‘మైండ్‌ట్రీ కంపెనీ’లో పని చేస్తున్న మునీత్ ధీమాన్ తన జీవిత లక్ష్యాన్ని ప్రశ్నించుకున్నాడు. ఐటీని, జర్మనీని వదిలేసి ఇండియాలో విద్యా వ్యవస్థపై దృష్టి సారించాలనుకున్నాడు. ఉన్నన్ని రోజులు విద్యారంగంలోనే ఉండి.. ఒక కొత్త తరాన్ని తయారుచేయాలని సంకల్పించాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం తన భార్య ప్రీతితో కలిసి బెంగళూర్‌లో స్థిరపడ్డాడు. 2010 నుంచి 2016 వరకు దేశమంతా పర్యటించి 26కు పైగా స్కూళ్లను సందర్శించారు. ఆ అనుభవాలతో 2016లో ‘విద్యాక్షేత్రం’ అనే పాఠశాలను స్థాపించారు. అప్పుడు విద్యార్థుల సంఖ్య కేవలం 13 మాత్రమే. ఇప్పుడు 157 మంది ఉన్నారు.

ప్రత్యేకతలు

విద్యా క్షేత్రంలో చేరేందుకు ఎప్పుడూ వేలాది దరఖాస్తులొస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకం. అన్ని స్కూళ్లలో మోగినట్లు ఉదయం బెల్ మోగదు. దానికి బదులుగా ఫ్లూట్ స్వరాలు మారుమోగుతాయి. వేపచెట్ల కింద పిల్లలు రాగాలు పాడుతారు. కొందరు నేత మగ్గాలు నడుపుతారు. ఆవరణను శుభ్రంచేసి వంటగదిలో అల్పాహారం సిద్ధం చేస్తారు. శ్లోకాలు పఠిస్తుంటారు. వాళ్లకు యూనిఫామ్‌లు లేవు. భుజాలకు వేలాడేసుకునే భారీ బ్యాగులు లేవు. కానీ ప్రతీది నేర్చుకుంటారు. పాఠశాలలోని ప్రతీ మూలలో నేర్చుకోవడం కనిపిస్తుంది.

పరీక్షలుండవ్..

ఇక్కడ ప్రతీది ప్రాక్టికల్‌గా ఉంటుంది. విద్యార్థులు పిండి పిసికి గణితం అర్థం చేసుకుంటారు. ల్యాబ్‌లో ప్రయోగాలు చేసి.. మరుసటి రోజు బట్ట సంచులు కుడుతారు. మరీ ముఖ్యంగా వాళ్ల పాఠశాలలో రోజువారీ పరీక్షలు లేవు, ర్యాంకులు లేవు. అయినా బోర్డు పరీక్షలు రాసినవారు 85 శాతం పైగా మార్కులు సాధిస్తున్నారు. చాలామంది 90 నుంచి 96 శాతం వరకు తెచ్చుకుంటున్నారు. విద్యాక్షేత్రం గురుకుల శైలిలో నడుస్తుంది. సమగ్ర వికాసం, పంచకోశ విధానం అమలవుతోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సిలబస్‌ను అనుసరిస్తారు.

108 గురుకులాలు లక్ష్యంగా..

ప్రతి శనివారం వీడియో కాన్పరెన్స్, నెలాఖరున 'మంథన్' చర్చలుంటాయి. బోర్డు పరీక్షలకు ఆర్నెల్ల ముందు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఫీజులుండవు కానీ తల్లిదండ్రులు గురుదక్షిణ ఇస్తారు. ఒక్కో తరగతిలో 16 మంది మాత్రమే ఉంటారు. ప్రతీ విద్యార్థిపై ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తారు. ఈ విద్యాక్షేత్రం ఆచార్య విద్యాలయ కార్యక్రమం ప్రారంభించింది. దీనిద్వారా తొమ్మిది రాష్ట్రాల నుంచి 39 మంది శిక్షణ పొందుతున్నారు. వీరిలో 17 మంది తమ స్వంత గురుకులాలు స్థాపించనున్నారు. 2047 నాటికి 108 గురుకులాలు స్థాపించాలని వీరి లక్ష్యం.

Next Story