కాల్చిన చింత గింజలు ఎప్పుడైనా తిన్నారా.. టేస్ట్ అదిరిపోద్ది..

by Sujitha Rachapalli |

కాల్చిన చింత గింజలు.. చిన్నప్పుడు మా టైమ్ పాస్ స్నాక్.. చింత గింజల ఆట మస్త్ ఆడుతుండే.. నానమ్మ ఏంచిన గింజలు ఒలిచి తింటే.. ఆహా..

కాల్చిన చింత గింజలు ఎప్పుడైనా తిన్నారా.. టేస్ట్ అదిరిపోద్ది..
X

దిశ, ఫీచర్స్ : చింత గింజలు.. ఇప్పుడు చూద్దామన్న కనిపిస్తలేవు. అట్లుంది సిటీ లైఫ్. కానీ ఒకప్పుడు మా ఊరి పెద్ద చింత చెట్టు.. దాని కింద మేము ఆడిన ఆటలు... చింత గింజల కోసం పొద్దంతా ఆడిన ఆటలు.. ఇందుకోసం చెమటలు చిందించిన రోజులు.. గుర్తుచేసుకుంటే మా అమాయకత్వం గుర్తుకొస్తుంది..

డబ్బా.. గీత..

ఊర్లో మస్తు చింత చెట్లు ఉండేది.. దాదాపు అందరి ఇల్లల్లోనూ చింత కాయ కొట్టేటోళ్లు.. చింత పండు, చింత గింజలు వేరు చేసేటోళ్లు. నిజానికి ఇందులో అక్కరకు వచ్చేది చింత పండు. కానీ చిన్న పిల్లలకు అవసరం చింత గింజలే. ఎందుకంటే అప్పుడు అవి మా ఆట వస్తువులు. నేల మీద చతురస్రం ఆకారంలో ఓ డబ్బా గీసి... ఎంత మంది ఆడితే అంత మంది.. ఎన్ని ఎన్ని ఆడుదామనుకుంటే.. అన్ని గింజలు లెక్కపెట్టి ఆటను షురూ చేసేది. ఆ డబ్బాకు దూరంగా ఓ గీత గీసి.. ఆ తర్వాత చప్పట్లేసి.. ముందు ఎవరు చప్పట్లలో నెగ్గుతరో వాళ్లు ఫస్ట్.. ఇలా ఒకరెనుక ఒకరు ఆడాలి. ఈ ముందు చప్పట్లల్లో నెగ్గినోడు.. చింత గింజలన్నింటిని ఆ గీత కాన్నుంచి డబ్బాలోకి విసరాలి. ఎన్ని డబ్బాల పడుతాయో అవన్నీ వాళ్ల సొంతం. ఈ ఆట ఆడేందుకు.. డబ్బాల నిండా చింత గింజలు సంపాదించేందుకు మస్త్ ఆరాటపడేది మేము.

కాల్చిన గింజలు

గిట్ల ఆటల సంపాదించిన చింత గింజలను.. పొయ్యిల కాల్చుకుని తినేది. ఒక్కోసారి నానమ్మను అడిగితే.. నా దగ్గర ఉన్న చింత గింజలన్నింటిని పెనం మీద కొంచెం ఉప్పు కలిపి ఏంచేది. వాటి పొట్టు తీసి తింటే ఆహా ఆ రుచే వేరు. జేబుల్లో నింపుకుని స్కూల్‌కు కూడా పోయేది. ఒక్కొక్కటి జేబులో నుంచి తీసుకుని తింటూ నా దగ్గరే ఉన్నాయని పోజులు కొట్టేది. దోస్తులకు ఇచ్చి.. ఒరేయ్ ఒకవేళ నువ్వు కూడా చింత గింజ కాల్చుకున్నప్పుడు నాకియ్యాలి మరి అని ఒప్పందం పెట్టుకునేది.

లాభాలు

అప్పుడు అయితే ఉట్టిగా గొప్పలు పోనికి, టైం పాస్‌గా తినడానికే ఈ చింత గింజలు అనుకునేది. కానీ వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కొంచెం పెద్దయ్యాకే తెలిసింది. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి అనేక పోషకాలుంటాయి. శరీరానికి శక్తిని ఇస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు చింత గింజలు గుండె ఆరోగ్యంలో, చర్మ సంరక్షణలోనూ హెల్ప్ చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ అనారోగ్యాల నుంచి కాపాడుతాయి.

వెంకటేష్

Next Story