పెళ్లి కావాలా నాయనా..! అక్కడ సంతకెళ్తే నచ్చిన భాగస్వామని ఎంచుకోవచ్చు!!

by Javid Pasha |   (  Updated:2026-02-05 08:48:59  IST  )

చైనాలోని బిగ్ సిటీస్‌లో ప్రతీ శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మ్యారేజ్ మార్కెట్’ జరుగుతుంది.

పెళ్లి కావాలా నాయనా..! అక్కడ సంతకెళ్తే నచ్చిన భాగస్వామని ఎంచుకోవచ్చు!!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పెళ్లి చూపులు ఇండ్లల్లో జరుగుతుంటాయి. భారతీయ కుటుంబాల్లో అయితే ఇది సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనం. కానీ చైనాలోని పెద్ద పెద్ద నగరాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతుంటాయి. మన దగ్గర కూరగాయల మార్కెట్ల మాదిరి.. అక్కడ మ్యారేజ్ మార్కెట్ (Marriage Market) మార్కెట్లు జరుగుతాయని మీకు తెలుసా? వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులు తమ కుటుంబ పెద్దలతో కలిసి మ్యారేజ్ మార్కెట్‌కు వెళ్లి నచ్చిన పార్ట్‌నర్ సెలెక్ట్ చేసుకొని పరస్పరం నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏమిటో చూద్దాం పదండి!

వీకెండ్స్‌లో మ్యారేజ్ మార్కెట్

చైనాలోని బిగ్ సిటీస్‌లో.. ముఖ్యంగా షాంఘైలోని పీపుల్స్ పార్క్ (People's Park)లో ప్రతీ వీకెండ్స్‌లో (శనివారం, ఆదివారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక ప్రత్యేకమైన ‘మ్యారేజ్ మార్కెట్’ జరుగుతుంది. ఇక్కడికి పెళ్లికాని యువతీ యువకులు తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో అటెండ్ అవుతారు. ఇక వారి తల్లిదండ్రులు, తాతలు, నానమ్మలు గుమికూడి తమ పిల్లల ప్రొఫైల్స్‌ను గొడుగులు, బోర్డులపై హ్యాండ్‌రిట్టెన్‌గా ప్రదర్శిస్తారు. ఇందులో యువతీ లేదా యువకుడి వయసు, ఎత్తు, చదువు, ఉద్యోగం, జీతం, ఆస్తి వివరాలు, పార్ట్‌నర్ ప్రిఫరెన్సెస్(ఉదా: చైనా రిజిస్ట్రేషన్, కారు, ఇల్లు ఉండాలి) వంటివి ఉంటాయి. అయితే వీటిని చూశాక పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి లేదా యువకుడు ఆసక్తిగా ఉంటే.. తల్లిదండ్రులకు విషయం చెప్తారు. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలను చర్చించి, కాంటాక్ట్ నంబర్లు మార్పిడి చేసుకుంటారు. అంటే అక్కడ ఇదొక సాంప్రదాయిక మ్యాచ్‌మేకింగ్ విధానం అన్నమాట. కాకపోతే.. ప్రస్తుత ఆధునిక డేటింగ్ సమస్యల మధ్య కుటుంబ ప్రమేయాన్ని కలిగి ఉంటుంది.

2004లో ప్రారంభం..

మ్యారేజ్ మార్కెట్ విధానం చైనీస్ నగరాల్లో చాలాకాలంగా ఉంది. అయితే షాంఘైలో 2004లో ప్రారంభమైందని చెబుతారు. దీనికి కారణం.. ఆ దేశంలోని వన్-చైల్డ్ పాలసీనే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల అక్కడ జెండర్ ఇంబ్యాలెన్స్ (మగపిల్లలు ఎక్కువ) ఏర్పడింది. అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. ఇక మారుతున్న కాలంతోపాటు చాలామంది పెళ్లిళ్లపై ఆసక్తి చూపడం లేదు. ఇటువంటి పరిస్థితుల మధ్య మ్యారేజ్ స్ట్రెస్, షెంగ్‌ను (leftover women - 27+ వయస్సు పెళ్లికాని మహిళలు) వంటి సామాజిక సమస్యలు పెరిగిపోయాయి. దీనికి పరిష్కారంగా.. ప్రతిస్పందనగా ఏర్పడిందే మ్యారేజ్ మార్కెట్ విధానం. ఇక్కడ ఎవరికైనా ప్రవేశం ఉచితం.. కానీ కొందరు మ్యారేజ్ బ్రోకర్లు సైతం ఎంటరై సంబంధాలు కుదర్చే పేరుతో డబ్బు వసూలు చేస్తుంటారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు.

సంస్కృతిలో భాగమా?

మ్యారేజ్ మార్కెట్లో మధ్యవర్తులకు దాదాపు ఎవరూ ప్రయారిటీ ఇవ్వరు. నేరుగా బహిరంగంగా ప్రదర్శించిన ప్రొఫైల్ చెక్ చేసి, కలిసి చర్చించుకొని ఇరువైపులా నచ్చితేనే సంబంధం ఖాయం చేసుకుంటారు. లేకపోతే ఎవరి దారి వారిది. వినడానికి మ్యారేజ్ సంత ఏంటి? అనిపిస్తుంది.. కానీ షాంఘై వంటి చైనీస్ నగరాల్లో ఇది చాలా కామన్. బీజింగ్‌లోని జాంగ్‌షాన్ పార్క్, గ్వాంగ్‌జౌలోని టియాన్హే పార్క్ వంటి ఇతర నగరాల్లో కూడా ఇలాంటివి మార్కెట్లు వీకెండ్స్‌లో నిరంతరం జరుగుతుంటాయి. వీటిని చూడడానికి టూరిస్టులు సైతం వస్తుంటారు. ఇది చైనా సంస్కృతి, కుటుంబ విలువలు, పెళ్లి సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక డెస్టినేషన్ అని కూడా చెబుతుంటారు. ఆధునిక యువత ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లు, స్వతంత్ర ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ.. చైనాలో మాత్రం మ్యారేజ్ మార్కెట్లు ఇంకా జనాదరణ పొందుతున్నాయి.

Next Story