నానమ్మ చేతి మామిడి తొక్కు

by Sujitha Rachapalli |

మా చిన్నప్పుడు వైశాఖ మాసం వచ్చిందంటే మా ఇంట్లో ఒక పండుగలా ఉండేది. మా పొలంలో మామిడి చెట్లు ఉండేవి.

నానమ్మ చేతి మామిడి తొక్కు
X

దిశ, ఫీచర్స్ : మా చిన్నప్పుడు వైశాఖ మాసం వచ్చిందంటే మా ఇంట్లో ఒక పండుగలా ఉండేది. మా పొలంలో మామిడి చెట్లు ఉండేవి. వాటిని మైలారం మావిళ్లు అనేవాళ్లు. మా తాత మా మామిడి చెట్ల నుంచి తెంపుకొని తెచ్చిన పచ్చటి తొక్కు మామిడి కాయల వాసన ఇల్లంతా నిండేది. పిల్లలమంతా ఆ కాయలను చూస్తూ వాటిని తాకుతూ ‘నాయినమ్మా.. ఈసారి ఎన్ని జాడీల తొక్కు పెడతవ్?’ అనేవాళ్లం. మా అక్క ‘నానమ్మోయ్.. నాకు వెల్లుల్లి పాయల తొక్కు కావాలి చూడూ’ అనేది.

జ్ఞాపకాల జాడీ..

ఇప్పుడు మా నాయినమ్మ లేదు. కానీ ఆమె చేసిన ఆవకాయ రుచి ఇప్పటికీ నా నాలుక మీద తగులుతుంది. వేడి వేడి అన్నంలో కొత్త మామిడికాయ తొక్కు.. నెయ్యి వేసి కలిపి పెద్ద ముద్దలు చేసి పెట్టేటప్పుడు వచ్చే ఆ కమ్మని వాసన ఎప్పటికీ మరచిపోలేనిది. మేం మామిడికాయ తొక్కు అనేవాళ్లం. ఇప్పడేమో ఆవకాయ అంటున్నాం. నేను సిటీలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు మా అమ్మ పంపిన ఆవకాయ జాడీ తెరవగానే నా కళ్లు చెమ్మగిల్లేవి. చిన్నతనంలో నాయినమ్మ పక్కన కూర్చుని తిన్న ఆ రోజులు, తాత తినురా అని నా మీద చూపించిన ప్రేమ.. నా బాల్యం.. అమ్మ ప్రేమ.. మా అక్క.. తమ్ముడితో ఆటలన్నీ గుర్తుకొచ్చేవి. అందుకే మామిడికాయ తొక్కు మా కుటుంబం తీపి జ్ఞాపకాల జాడీ.

ముక్కలు కొట్టేది..

ఆవకాయ చేసే రోజు మా ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడేది. నాయినమ్మ ఉదయం నుంచే శుభ్రంగా స్నానం చేసి.. చాలా పవిత్రంగా పని మొదలుపెట్టేది. మంచి కండపెట్టిన మామిడి కాయలను ఆరబెట్టేది. పక్కింటి నుంచి కత్తిపీట తెచ్చి ముక్కలు కొట్టేవారు. అంతకుముందు రోజుల్లో వడ్రంగిని పిలిపించి మామిడికాయ ముక్కలు కొట్టేవారు. వాటిని కొట్టినందుకు అతనికి ఐదు మామిడికాయలు ఐదు శేర్ల వడ్లు పెట్టేవాళ్లు. అయితే రానురాను వడ్రంగివాళ్లు మామిడికాయలను కొట్టడానికి రాకపోవడంతో ఎవరింట్లో వాళ్లే స్వయంగా ముక్కలు చేయడం మొదలు పెట్టారు. ఇక నేను.. మా అక్క.. తమ్ముడు అందరం కలిసి ఆ ముక్కలను తడిలేకుండా తెల్లటి గుడ్డతో తుడిచి ఎండలో ఆరబెట్టడంలో సహాయం చేసేవాళ్లం.

నీకో ముద్ద.. నాకో ముద్ద..

అట్లా పొద్దుమూకేది. ఆవపిండి.. ఉప్పు.. ఎర్రటి ఇంటికారం.. నువ్వుల నూనె.. మెంతుల పొడి ప్రిపేర్ చేసేది అమ్మ. నాయినమ్మ ఎట్ల చెప్తే అట్లా ఇంగ్రీడియన్స్ రెడీ చేసిచ్చేది. అమ్మకు కూడా అప్పటికే తొక్కు పెట్టడం వస్తుంది కానీ నాయినమ్మ చేత్తో పెడితే రుచి బాగుంటుందని భావించేది. ఇక ఈ దినుసుల వాసనలతో ఇల్లంతా ఘుమఘుమలాడేది. నాయినమ్మ పెద్ద స్టీల్ బేసిన్‌లో కలుపుతుంటే నేను పక్కన నిలబడి చూస్తూ కొన్నిసార్లు చేతులు చాపేవాడిని. ‘ఆగరాదురా’ అని అమ్మ అంటుండేది. ‘వానికేం తెలుసు నువ్వాగమ్మా’ అని నన్ను వెనకేసుకొచ్చేది. దేవుడి అర్రలో దీపం వెలిగించి.. మొక్కి జాడీలో నింపేటప్పుడు ఆమె ముఖంలో కనిపించే ఆనందం ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ రాత్రి అందరం కలిసి కొత్త ఆవకాయతో అన్నం తినేటప్పుడు ఇంట్లో పండగలా ఉండేది.

మా ఇంటి మడతమాను..

మా నాయినమ్మ ఒక్క సాధారణ ఆవకాయ మాత్రమే కాకుండా ఎన్నో రకాలు చేసేది. ప్రతి రకానికి ఒక్కో ప్రత్యేక రుచి ఉండేది. వెల్లుల్లిపాయలు కలిపిన ఆవకాయ తినేటప్పుడు వచ్చే ఆ ఘాటు.. వాసన ఇంకా నా నాలుకకు తగులుతుంది. ఆవకాయలో వేసే ఆవాలు.. మెంతులు.. సహజ నూనెలు ఆరోగ్యానికి చాలా మంచివని అమ్మ ఎప్పుడూ చెప్పేది. సంవత్సరం పాటు ఆ మడతమానులు మా కుటుంబానికి రుచిని అందించేవి. అమ్మ చెప్పేది మడతమానులో తొక్కు పెడితే ఆకలి మంచిగైతదంటా. ఇంకా అజీర్ణం వంటి సమస్యలు రావంటా. కెమికల్స్ లాంటివేమీ లేకుండా సహజంగా ఎక్కువకాలం నిల్వ ఉండి మంచి రుచిని ఇచ్చేవి. ఆ రుచి నాకు ఇప్పటికీ అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఆ రుచి గుర్తుచేసుకుంటే నా బాల్యం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది.

మన జీవన విధానం..

ఇప్పుడు బిజీ జీవితంలో ఆవకాయ చేసే సమయం చాలా తక్కువైపోయింది. రెడీమేడ్ పచ్చళ్లు సులభంగా దొరుకుతున్నా.. నాయినమ్మ, అమ్మ చేతి ఆవకాయ రుచి మాత్రం ఎప్పుడూ గుర్తుంటుంది. ఆ రోజుల్లో కుటుంబం అంతా కలిసి తిన్న ఆనందం.. నాయినమ్మ ముఖంలోని తృప్తి.. వేడి అన్నంలో కలిపిన ఆ గోరు ముద్దల రుచి.. ఇవన్నీ నా మనసులో పదిలంగా ఉంటాయి. ఈ సీజన్‌లో నేను కూడా కొంత సమయం కేటాయించి ఇంట్లో ఆవకాయ చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మను, నాయినమ్మను గుర్తుచేసుకుంటూ వేడి అన్నంలో ఆవకాయ ముద్ద తినేటప్పుడు నా బాల్యం తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను. ఆవకాయ కేవలం ఆహారం కాదు. అది మన సంస్కృతి. పెద్దవాళ్ల ప్రేమ.. బాల్యపు జ్ఞాపకాల నిధి. ఇంకా మన జీవన విధానం. మన తర్వాతి తరాలకు దీనిని అందించాలి.

- లక్ష్మీ ప్రతీక్

Next Story