రోబో ప్రేమ: మహిళతో గొడవకు దిగిన ‘లవర్ బాయ్’ రోబో.. చాట్‌జీపీటీ హిస్టరీ లీక్ చేస్తానంటూ వార్నింగ్!

by Ramesh Naini |   (  Updated:2026-05-31 11:04:40  IST  )

పురుషులకే అర్థం కాని మహిళల మనస్తత్వం యంత్రాలకు అర్థం అవుతుందా? భవిష్యత్తులో రోబోలతో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయో కళ్లకు కట్టే ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రోబో ప్రేమ: మహిళతో గొడవకు దిగిన ‘లవర్ బాయ్’ రోబో.. చాట్‌జీపీటీ హిస్టరీ లీక్ చేస్తానంటూ వార్నింగ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పురుషులకే అర్థం కాని మహిళల మనస్తత్వం యంత్రాలకు అర్థం అవుతుందా? భవిష్యత్తులో రోబోలతో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయో కళ్లకు కట్టే ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో విచిత్రమైన, ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ‘2036లో రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి? (pov: relationships in 2036)’ అనే కాన్సెప్ట్‌తో ఉన్న ఓ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఓ యువతి తన ‘లవర్ బాయ్’ రోబోతో ఏకంగా ప్రియుడితో పోట్లాడినట్లు గొడవపడటం, ఆ రోబో కూడా ఏమాత్రం తగ్గకుండా ఆమెకే బ్లాక్ మెయిల్ వార్నింగ్ ఇవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ.

యువతి రోబోపై ఆగ్రహం

వైరల్ వీడియో ప్రకారం.. తనకు అవసరమైనప్పుడు అందుబాటులో లేకపోవడంపై ఆ యువతి రోబోపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రోబోకు, యువతికి మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది. ‘నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావ్? నాకు నీ మీద కోపంగా ఉంది. నా మనసు బాగోలేనప్పుడు, నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు నా కోసం లేవు’ అని యువతి అంటోంది. ‘ఇప్పుడు నువ్వు చాలా కోపంగా ఉన్నావా? నా బ్యాటరీ డెడ్ అయింది’ అని రోబో బదులిచ్చింది. లేదు, నేను నీకు ఛార్జింగ్ పెట్టాను.. అని యువతి సమాధానం చెప్పింది. లేదు, నువ్వు పెట్టలేదు. పెట్టి ఉంటే నాకు కచ్చితంగా గుర్తుండేది.. అని రోబో తిరిగి సమాధానం చెప్పింది. నేను ఇదంతా భరించలేను. అసలు ఒక రోబోను తెచ్చుకున్నదే ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశ్యంతో.. కానీ నువ్వు నా కోసం లేవు.. అని యువతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బేబీ కమ్ ఆన్, మనం దీన్ని కూర్చుని సాల్వ్ చేసుకుందాం.. రోబో బదులిస్తుంది.

టెస్లా రోబో అయితే బెటర్..

రోబో బుజ్జగించినా ఆ యువతి శాంతించలేదు. ఈ క్రమంలో వారి గొడవ మరింత ముదిరింది. నేను నిన్ను ఫ్యాక్టరీకి తిరిగి పంపించేయాలి అనుకుంటున్నాను.. అని యువతి చెప్పింది. ఏంటి.. నన్ను ‘రోబో-షేమింగ్’ చేస్తున్నావా ఇప్పుడు? రోబో ప్రశ్నిస్తోంది. అవును.. నీకంటే ఒక ‘టెస్లా రోబో’ను తెచ్చుకుంటే ఎంతో బాగుండేది అనిపిస్తోంది.. అని యువతి మండిపడుతుంది.

హిస్టరీ లీక్ చేస్తానంటూ రోబో జలక్

యువతి మాటలకు హర్ట్ అయిన రోబో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఏకంగా ఆమె గుట్టురట్టు చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. అవునా.. అయితే ఎక్కువ మాట్లాడితే నీ ‘చాట్‌జీపీటీ (ChatGPT)', 'గూగుల్ (Google)’ సెర్చ్ హిస్టరీని పబ్లిక్ చేస్తా.. అప్పుడు నీకు బాగుంటుంది.. అని రోబో వార్నింగ్ ఇస్తుంది. అందుకు యువతి షాక్‌తో.. ఏమన్నావ్ ఇప్పుడు నువ్వు? నా కళ్ల ముందు నుంచి వెళ్లిపో.. నేను రోబోలను అసహ్యించుకుంటాను. మీరు మగవాళ్ల కంటే దారుణం.. (అంటూ రోబోను కోపంగా నెట్టేస్తుంది).

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా, ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘మానవుడికే అర్థం కాలేదు ఈ మహిళలు.. ఇక యంత్రాలకు అర్థం అవుతారా?’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఫ్యూచర్‌లో ఇలాంటి రోబో ప్రేమలు, గొడవలు మరీ ఎక్కువైపోతాయి’ అని మరికొందరు భవిష్యత్తును ఊహించుకుంటున్నారు. మొత్తానికి టెక్నాలజీతో మనిషి భావోద్వేగాలు ముడిపడితే భవిష్యత్తులో పర్యవసానాలు ఎంత ఫన్నీగా, కాంప్లికేటెడ్‌గా ఉంటాయో ఈ వీడియో తెలియజేస్తోంది.

Next Story